
మోదీ సహకారంతో వికసిత్ తెలంగాణ సాధ్యం: రేవంత్
రాష్ట్ర ప్రాజెక్టులు, మెట్రో, మూసీ నది అభివృద్ధిపై కేంద్రం నుంచి వేగవంతమైన అనుమతులు కోరిన సీఎం రేవంత్ రెడ్డి.
వికసిత్ భారత్ అని ప్రధాని మోదీ ఎలా తాపత్రయపడుతున్నారో, తాము కూడా అదే విధంగా వికసిత్ తెలంగాణ కోసం శ్రమిస్తున్నామని తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం తమ సహకారం అందిస్తే అనుకున్న సమయంలోనే వికసిత్ తెలంగాణను తాము సాధిస్తామని రేవంత్ చెప్పారు. అంతేకాకుండా ప్రధాని మోదీ పెట్టుకున్న 30ట్రిలియన్ డాలర్ల భారత జీడీపీతో తెలంగాణ 10 శాతం సహకారాన్ని అందిస్తుందని వెల్లడించారు. తెలంగాణ తప్పకుండా 3ట్రిలియన్ డాలర్ల ఎకానమిగా అవతరిస్తుందని, అందుకు కావాల్సింది కేంద్ర సహకారమని రేవంత్ చెప్పారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ఆయన తెలంగాణ అభివృద్ధి దిశగా కీలక వ్యాఖ్యలు చేశారు.
కార్యక్రమంలో ప్రధాని మోదీ, గవర్నర్ శుక్లా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. అందరికీ రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, అభివృద్ధి ఉత్సవమని అన్నారు. జాతీయ భద్రత, జాతీయ అభివృద్ధికే తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ముందు దేశం, తర్వాత ప్రజలు, ఆ తర్వాతే పార్టీ అనే భావనతో ముందుకు సాగుతున్నామని వివరించారు.
ప్రధాని మోదీ ప్రకటించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి తెలంగాణ ప్రభుత్వం భాగస్వామిగా నిలిచిందన్నారు. అదే సమయంలో ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణను దేశంలో మొదటి స్థానంలో నిలపాలని తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్, రైల్వే ప్రాజెక్టుల ప్రారంభానికి మోదీ రావడం సంతోషంగా ఉందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని అభివృద్ధి కార్యక్రమాలకు రావడం మంచి సంకేతమని చెప్పారు. ఇక రాజకీయాల కంటే అభివృద్ధిపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సహకారంతో మోదీ గుజరాత్ మోడల్‌ను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. అదే విధంగా తెలంగాణ ప్రజలు కూడా వచ్చే పదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నారని తెలిపారు. మన్మోహన్ సింగ్ ఇచ్చిన సహకారం తరహాలో మోదీ కూడా తెలంగాణకు పూర్తి మద్దతు అందిస్తారనే నమ్మకం ఉందన్నారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.
దేశ ఆర్థిక వృద్ధిలో మహానగరాల పాత్ర చాలా కీలకమన్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే ఈ మెట్రో నగరాలు బలపడాలని పేర్కొన్నారు. ఈ ఆరు ప్రధాన నగరాలకు సంబంధించిన జాతీయ ప్రాధాన్యత గల ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు రావడానికి ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక సింగిల్ విండో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.
తమ రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై ఇప్పటికే కేంద్ర మంత్రులను అనేకసార్లు కలిసినట్లు చెప్పారు. మూసీ నది అభివృద్ధి, మెట్రో రైలు, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు 12 లైన్ల రహదారి వంటి అంశాలపై రెండు గంటల పాటు ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని ప్రధాని మోదీని కోరారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ ప్రతిపాదనలు, ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆమోదాలు లభిస్తాయని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. దేశ అభివృద్ధి విషయంలో తాము కేంద్రంతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుసంధానంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.

