వరంగల్‌కు మళ్లీ విమానాలు...
x
వరంగల్ విమానాశ్రయం చిత్రం : మే 9న ప్రధాని మోదీ శంకుస్థాపన

వరంగల్‌కు మళ్లీ విమానాలు...

దశాబ్దాల కల సాకారం… ఉత్తర తెలంగాణకు గగనద్వారం...


ఓరుగల్లు వాసుల దశాబ్దాల విమానయాన కల నెరవేరబోతోంది.వరంగల్ విమానాశ్రయం పునరుద్ధరణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు పూర్తి చేసి మే నెల 9వతేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమానికి రంగం సిద్ధమవుతోంది.వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి కేంద్రపౌర విమానయాన మంత్రిత్వశాఖ, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా,తెలంగాణ రాష్ట్ర అధికార యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్టోంది. ఏకైక శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న తెలంగాణలో వరంగల్ కొత్త విమానాశ్రయం నిర్మాణం పూర్తి అయితే తెలంగాణ ప్రగతికి బాటలు పడనున్నాయి.

విమానాశ్రయం శంకుస్థాపనకు కౌంట్‌డౌన్ ప్రారంభం

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల బృందం వరంగల్ విమానాశ్రయం స్థలాన్ని పరిశీలించి దీని పునరుద్ధరణకు రూపురేఖలు సిద్ధం చేశారు.దీంతో వరంగల్ విమానాశ్రయం శంకుస్థాపనకు కౌంట్‌డౌన్ ప్రారంభమైనట్టే అని స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఓరుగల్లు అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న వరంగల్ విమానాశ్రయం పునరుద్ధరణ పనుల గురించి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఏప్రిల్ 16వతేదీన జిల్లా అధికారులు,రెవెన్యూ, పోలీస్, ఇంజినీరింగ్ విభాగాలు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు విమానాశ్రయం అప్రోచ్ మార్గాల్లో ఉన్న నిర్మాణాలు, విద్యుత్ లైన్లు, చెట్లు వంటి అడ్డంకులను తొలగించే అంశంపై వరంగల్ జిల్లా అధికారులతో చర్చించారు.విమానాశ్రయం శంకుస్థాపన సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ కలల ప్రాజెక్ట్ పురోగతిపై వరంగల్ జిల్లా అధికార యంత్రాంగం వేగం పెంచింది.శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వీఐపీ సందర్శనలకు అనుగుణంగా భద్రత, రహదారి సదుపాయాలు, ఇతర ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను అప్రమత్తం చేశారు.ఈ విమానాశ్రయం నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఎట్టకేలకు కేంద్రం నుంచి ఆమోదం

వరంగల్ విమానాశ్రయ పునర్నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు ఖరారయ్యాయి.విమానాశ్రయంలో రన్‌వే విస్తరణ, ఆధునిక టెర్మినల్ భవన నిర్మాణం, నావిగేషన్ సదుపాయాల ఏర్పాటుకు కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి ఆమోదం లభించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డితోపాటు కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు ఈ విమానాశ్రయం నిర్మాణానికి పలుసార్లు కేంద్రానికి వినతిపత్రాలు సమర్పించారు.రెండేళ్ల తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అయిన కింజరాపు రామమోహన్ నాయుడు ఎట్టకేలకు టేకాఫ్ చెప్పారు.
ఈ విమానాశ్రయం విస్తీర్ణం 700 ఎకరాలకు పైగా ఉంది. పొడవైన రన్‌వే, విస్తారమైన భూభాగం ఉండటంతో ఇప్పుడు దీనిని పునరుద్ధరించి ఆధునిక విమానాశ్రయంగా మార్చే ప్రణాళికలు రూపొందించారు.

ప్రాంతీయ అభివృద్ధికి గేమ్‌చేంజర్

వరంగల్ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రజలకు నేరుగా విమాన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఐటీ, టూరిజం, పరిశ్రమల అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలకంగా మారనుంది. ముఖ్యంగా రామప్ప ఆలయం వంటి యునెస్కో వారసత్వ ప్రదేశాలకు దేశ, విదేశీ పర్యాటకుల రాక పెరగనుంది.విమానాశ్రయం నిర్మాణంతో వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. హోటళ్లు, ట్రాన్స్‌పోర్ట్, ట్రావెల్ సర్వీసులు, లాజిస్టిక్స్ రంగాల్లో స్థానిక యువతకు కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి.
‘‘వరంగల్ విమానాశ్రయం నిర్మాణం పూర్తి అయితే వరంగల్ నగర రూపురేఖలు మారబోతున్నాయి. వరంగల్‌ను ప్రాంతీయ విమానయాన మ్యాప్‌లో నిలబెట్టే దిశగా చర్యలు వేగవంతం అవుతున్నాయి’’అని వరంగల్ జిల్లా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు’’.

ముగిసిన భూసేకరణ ప్రక్రియ

ప్రస్తుతం విమానాశ్రయ ప్రాంగణంలో భూసేకరణ ప్రక్రియ పూర్తి అయింది.రన్‌వే విస్తరణకు అవసరమైన భూమిని గుర్తించారు. పాత రన్‌వే, భవనాలు ఉపయోగించలేని స్థితిలో ఉండటంతో వాటి పునర్నిర్మాణం లేదా పూర్తిగా కొత్తగా నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా పరిసర ప్రాంతాల క్లియరెన్స్ పనులు కూడా చేపట్టారు.
‘‘వరంగల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రాంతీయ కనెక్టివిటీ పథకం ఉడాన్ (UDAN) పథకం కింద అభివృద్ధి చేస్తున్నాం’’అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామమోహన్ నాయుడు ఇటీవల ప్రకటించారు. ప్రాజెక్టు పూర్తి అయితే హైదరాబాద్‌పై ఉన్న విమాన రద్దీ కొంత వరకు తగ్గడమే కాకుండా ఉత్తర తెలంగాణకు ప్రత్యక్ష లాభం చేకూరనుంది.’’

పురాతన ఎయిర్ స్ట్రిప్...మామునూరు

వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయం ఒకప్పుడు పరిమిత సేవలతో కొనసాగినా, తర్వాత పూర్తిగా మూతపడింది. భూసేకరణ సమస్యలు, నిధుల కొరత, కేంద్రం నుంచి అనుమతుల ఆలస్యం వంటి కారణాలతో ఈ ప్రాజెక్ట్ సంవత్సరాల పాటు నిలిచిపోయింది. అయితే తాజాగా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాజెక్ట్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది.మామునూరు విమానాశ్రయం నిర్మాణం హైదరాబాద్ నిజాం పాలన కాలంలో 1930వ సంవత్సరంలోనే ప్రారంభమైంది. అప్పట్లో సైనిక అవసరాలు, పరిపాలన సౌలభ్యం కోసం ఈ ఎయిర్ స్ట్రిప్‌ను అభివృద్ధి చేశారు. విస్తారమైన భూభాగంలో నిర్మించిన ఈ రన్‌వే, ఆ కాలంలోనే అత్యంత పొడవైన ఎయిర్ స్ట్రిప్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది.స్వాతంత్ర్యం అనంతరం కూడా ఈ విమానాశ్రయం కొంతకాలం పౌర విమాన సర్వీసులకు ఉపయోగించారు.వరంగల్ నుంచి హైదరాబాద్ వంటి నగరాలకు పరిమిత స్థాయిలో విమానాలు నడిచినట్లు చరిత్ర చెబుతోంది.కాగిత పరిశ్రమ సౌలభ్యం కోసం కాగజ్‌నగర్‌లో, వరంగల్‌లోని ఆజాం జాహీ మిల్స్ వంటి పరిశ్రమలకు సహాయం చేయడానికి విమానాశ్రయాలు నిర్మించారు.

వరంగల్ విమానాశ్రయాన్ని నిర్మించాలని కోరుతూ కేంద్రమంత్రి కింజరాపు రామమోహన్ నాయుడును కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క

బాంబుదాడితో దెబ్బతిన్న ఎయిర్ స్ట్రిప్

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నిజాం స్నేహపూర్వక సంజ్ఞగా అప్పగించిన తర్వాత వరంగల్ ఎయిర్‌స్ట్రిప్‌ను బ్రిటిష్ సైన్యం ఉపయోగించింది.1948 సెప్టెంబర్ లో ఆపరేషన్ పోలో సమయంలో భారత వైమానిక దళానికి చెందిన రెండు హాకర్ టెంపెస్ట్ విమానాలు దీనిపై బాంబు దాడి చేయడంతో ఎయిర్‌స్ట్రిప్ దెబ్బతింది. 1959లో వరంగల్‌లో మొదటి ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాలకు శంకుస్థాపన చేయడానికి జవహర్‌లాల్ నెహ్రూ ఈ ఎయిర్‌స్ట్రిప్‌లో దిగారు. 1962లో చైనాతో జరిగిన యుద్ధ సమయంలో, సంఘర్షణ ప్రాంతానికి దూరంగా ఉండటం వలన ఐఏఎఫ్ తన కొన్ని విమానాలను వరంగల్ లో నిలిపి ఉంచింది. 1970వ దశకంలో ఎన్‌సిసి ఎయిర్ వింగ్ గ్లైడర్‌లను ఉపయోగించి ఎయిర్‌ఫీల్డ్‌లో క్యాడెట్‌ల కోసం కార్యక్రమాలను నిర్వహించడం ప్రారంభించింది.
వరంగల్ ప్రాంతీయ విమానయాన సంస్థ వాయుదూత్ 1987 నుంచి కొద్దికాలం పాటు వరంగల్‌కు విమానాలను నడిపింది.ఆ తర్వాత విమానాశ్రయానికి వాణిజ్య సేవలు నిలిచిపోయాయి.

నిర్వహణ లోపంతో మూతపడిన ఎయిర్ స్ట్రిప్

వరంగల్ ఎయిర్ స్ట్రిప్ ప్రాంతీయ కనెక్టివిటీకి ఇది ఒక ప్రధాన మార్గంగా ఉండేది.కాలక్రమేణా మౌలిక సదుపాయాల లోపం, పెట్టుబడుల కొరత, కొత్త ఎయిర్‌పోర్టుల అభివృద్ధి కారణంగా మామునూరు విమానాశ్రయం ప్రాధాన్యత తగ్గిపోయింది.1987 ఫిబ్రవరిలో ఏదో ఒక సమయంలో 20 సీట్ల వాయుదూత్ విమానం వరంగల్ నుంచి రాకపోకలు సాగించింది. విమానాశ్రయం నుండి నిర్వహణ లేకపోవడంతో రన్‌వే దెబ్బతిని, భవనాలు శిథిలావస్థకు చేరాయి.చివరకు పూర్తిగా వినియోగంలో లేకుండా పోయింది.

నరేంద్రమోదీ మే 9న రాక

వరంగల్ ఎయిర్ పోర్ట్ శంకుస్థాపనకు మే 9వతేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరంగల్ కు రానున్నారు. మూడో సారి ప్రధాని అయిన తర్వాత తెలంగాణకు మోదీ రావడం విశేషం.ఈ సందర్భంగా సికంద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ నాయకులు చెప్పారు.
చిరకాలంగా ఎదురుచూస్తున్న వరంగల్ విమానాశ్రయం కల నిజమవుతున్న ఈ తరుణంలో ఓరుగల్లు ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. శంకుస్థాపనతో ప్రారంభమయ్యే ఈ ప్రస్థానం, వరంగల్‌ను అభివృద్ధి దిశగా కొత్త ఎత్తులకు తీసుకెళ్లనుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.తెలంగాణలో రెండో స్థాయి నగరాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో వరంగల్ విమానాశ్రయం ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది.మొత్తానికి వరంగల్ విమానాశ్రయం నిర్మాణం ఉత్తర తెలంగాణ అభివృద్ధికి మైలురాయిగా మారే అవకాశముంది.
Read More
Next Story