మేం బతికే ఉన్నాం.. ఓటు హక్కు తొలగించొద్దు!
x

మేం బతికే ఉన్నాం.. ఓటు హక్కు తొలగించొద్దు!

పబ్లిక్‌ హియరింగ్‌లో బాధితుల గోడు


ముషీరాబాద్‌ బూత్‌ నంబర్‌ 210 పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన 31 మంది మైనారిటీ ఓటర్ల పేర్ల తొలగింపునకు తప్పుడు ఫామ్‌-7 దరఖాస్తులు సమర్పించారనే ఆరోపణల నేపథ్యంలో.. అర్హుల ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ ఓటర్ రైట్స్ ఫోరం (TVRF) ఆధ్వర్యంలో శ‌నివారంనాడు పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై నిర్వహించిన ఈ హియరింగ్ లో ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, పౌరుల హక్కుల పరిరక్షణపై కీలక ప్రశ్నలను లేవనెత్తింది.

"మేం బ‌తికే ఉన్నాం. అయినా మాకు నోటీసు ఇవ్వకుండా ఎ.ఎస్‌.డి.డి. జాబితాలో పెట్టి ఓట్లు తొల‌గించారు." సుల్తానా, మెహ‌మూదాబేగం, ముంతాజ్‌బేగం.

"మా త‌ల్లి చ‌నిపోతే ముషీరాబాద్ నుంచి సిద్దిపేట వెళ్ళా. ఫాం స‌బ్‌మిట్ చేయ‌లేదు. ఆ త‌రువాత ఫాం నింపి ఇచ్చినా BLO తీసుకోలేదు. కానీ మా ప్లేర్లు ఎ.ఎస్‌.డి.డి. లో చేర్చారు" అంటూ కె.సాయిబాబా, బి.న‌రేంద‌ర్ త‌మ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ముషీరాబాద్‌లో వేల మంది ఓట్లు తొల‌గించిన‌ట్లు ఫిర్యాదులు వ‌చ్చిన నేప‌థ్యంలో తెలంగాణ ఓటర్ రైట్స్ ఫోరం చేసిన స‌ర్వేలో ఆందోళ‌న‌క‌ర అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. అందుకే ఈ హియ‌రింగ్ కార్య‌క్ర‌మం పెట్టిన‌ట్లు ప్రొఫెస‌ర్ సునీతా చెప్పారు. “ఓటు హక్కు ఎవరి దయతోనో లభించేది కాదు.. ప్రజాస్వామ్యంలో పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు. జాబితా సవరణ పేరుతో అర్హుడైన ఓటరు నష్టపోకూడదు” “ఓటరు జాబితాలో పేరు లేకపోతే.. పౌరుడి గొంతుకే బలహీనమవుతుంది”.

"ఓటరు గైర్హాజరులో ఉండటం, నివాసం మారడం, పేర్లలో నకిలీ నమోదులు ఉండటం, ఓటరు మరణించడం వంటి కారణాలను పరిశీలించడం ఎన్నికల జాబితా శుద్ధీకరణలో భాగమే. అయితే, ఒకరిని ASD/ASDD జాబితాలో గుర్తించడం మాత్రమే వారి ఓటు హక్కు చట్టబద్ధంగా రద్దయినట్లు కాదు. తగిన పరిశీలన, వర్తించే నిబంధనల ప్రకారం నోటీసు, స్పందించే అవకాశం, నిర్ణయంపై స్పష్టత ఉండటం కీలకం" అని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అభిప్రాయపడ్డారు.

"ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన విచారణలు, నిబంధనలు సామాన్య పౌరులకు సులభంగా అర్థమయ్యేలా లేవని, ఎన్నికల ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం పెరగాలంటే సమాచారం అందుబాటులో ఉండటంతోపాటు, ఫిర్యాదు చేయడం నుంచి తుది నిర్ణయం వరకు ప్రతి దశ ఓటరికి అర్థమయ్యేలా ఉండాలి" అని ఫోరం ప్రతినిధి ప్రొఫెస‌ర్ డి. మేరీ అభిప్రాయ‌ప‌డ్డారు.

“ప్రజాస్వామ్యంలో ఓటరే కేంద్రబిందువు. కానీ తన ఓటు ఉనికిలో ఉందో లేదో తెలుసుకోవడానికి కూడా పౌరుడు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తే, వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉంది” అన్నది ఈ వ్యవహారం ముందుకు తెస్తున్న విస్తృత అంశం" అంటారు సోష‌ల్ యాక్టివిస్ట్ రుబీనా నఫీసా. ముఖ్యంగా వృద్ధులు, నిరక్షరాస్యులు, వలస కార్మికులు, చిరునామాలు మారిన కుటుంబాలు, భాషాపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే వారు సవరణ ప్రక్రియలో వెనుకబడే అవకాశం ఉంది. డిజిటల్‌ సమాచారం మాత్రమే సరిపోదు. నోటీసులు సంబంధిత వ్యక్తులకు చేరాయా? వారు స్పందించేందుకు తగిన సమయం ఉందా? తమ అభ్యంతరాన్ని నమోదు చేయడానికి సహాయం అందుతోందా? అనే అంశాలూ పరిశీలించాలి. అంటారు రుబీనా.

ఓటర్ల జాబితా ప్రక్షాళనలో అక్రమ, నకిలీ నమోదులను తొలగించడం ఎంత ముఖ్యమో, అర్హులైన ఒక్క ఓటరు కూడా తన హక్కును కోల్పోకుండా చూడటం అంతే ముఖ్యం. ముషీరాబాద్‌లో బాధితులు లేవనెత్తిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, నోటీసులు అందని వారికి నిబంధనల ప్రకారం స్పందించే అవకాశం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

“మేం బతికే ఉన్నాం.. మా ఓటు హక్కు తొలగించొద్దు” అంటూ బాధితులు చేస్తున్న విజ్ఞప్తి.. ఓటర్ల జాబితాలో పేర్ల సవరణకు సంబంధించిన అంశమే కాదు, పౌరుల హక్కులు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు సంబంధించినది కూడా. తుది ఓటర్ల జాబితా రూపుదిద్దుకునేలోగా బాధితుల అభ్యంతరాలను పరిష్కరించి, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు చర్యలు తీసుకుంటారా అన్నది ఇప్పుడు కీలకం. ఎందుకంటే, ఓటు హక్కు కేవలం ఒక పేరు కాదు. ప్రజాస్వామ్యంలో పౌరుడి ఉనికికి, గొంతుకకు ప్రతీక.

Read More
Next Story