
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం ఎ రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 పూర్తి చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తుందని వ్యాఖ్యలు
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే హైదరాబాద్ మెట్రో విస్తరణ జరగాలని నిర్ణయం తీసుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి చెప్పారు. ఎలాగైనా తాము మెట్రోను విస్తరించి తీరుతామని సీఎం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఫేజ్ 2 కోసం ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తిచేశానని ఆయన పేర్కొన్నారు.అహ్మదాబాద్, ఉత్తర ప్రదేశ్, వైజాగ్ కు కూడా మెట్రోను మంజూరు చేశారు.. కానీ తెలంగాణకు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకొని, మెట్రో ఫేజ్ 2 ను పూర్తి చేసుకోవడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఫేజ్ 1 నిర్మించిన ఎల్ అండ్ టీ తోనే ఫేజ్ 2 నిర్మించాల్సి ఉంటుందని కేంద్రం నిబంధన పెట్టిందని, కానీ ఈ ప్రతిపాదనకు ఎల్ అండ్ టీ అంగీకరించలేదన్నారు. గత నష్టాలతోనే సతమతమవుతున్న తమకు ఫేజ్ 2 నిర్మించడం కష్టమని తేల్చి చెప్పిందని సీఎం పేర్కొన్నారు.
రూ. 30 వేల కోట్ల ఆస్తి సృష్టించినా ఏటా రూ. 400 కోట్లు నష్టం వస్తుందని చెప్పిందని, అందుకే ఫేజ్ 2 నిర్మాణంలో భాగస్వామ్యం కామని స్పష్టంగా చెప్పిందన్నారు. ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఒక్కటే ఏకైక పరిష్కారం అని కేంద్రం చెప్పిందని సీఎం వివరించారు. రూ.30 వేల కోట్ల ఎల్ అండ్ టీ మెట్రో ఆస్తిని రూ. 15 వేల కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని, 13,600 కోట్లు 8.25 శాతం వడ్డీకి బ్యాంకుల్లో ఎల్ అండ్ టీ మెట్రోపై రుణం తెచ్చుకుందని, ఆ లోన్ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. ‘‘మీరు ఎన్ఓసీ ఇవ్వండి… మేమే పూర్తిగా భరించి మెట్రో విస్తరణ చేసుకుంటాం’’అని సీఎం చెప్పారు.‘‘ కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నారు.. నలుగురు మీ ఎంపీలు ఉన్న ప్రాంతంలోనే మెట్రో విస్తరణ జరగాల్సి ఉందని, ఎందుకు కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోరు? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Next Story

