మల్కాజిగిరి అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
x
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

మల్కాజిగిరి అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

రూ.1,511 కోట్ల పనులకు శంకుస్థాపన.. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణపై కీలక ప్రకటనలు


దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరిని దేశంలోనే ఆదర్శ పట్టణ ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి (A. Revanth రెడ్డి) స్పష్టం చేశారు. మల్కాజిగిరి ప్రాంత అభివృద్ధికి ఎంతటి నిధులైనా కేటాయించేందుకు సిద్ధమని ప్రకటించిన ఆయన, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు వంటి కీలక ప్రాజెక్టులపై కేంద్రం సహకరించాలని కోరారు. ఉప్పల్‌లో రూ.1,511 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

మల్కాజిగిరి ప్రాంత అభివృద్ధి కోసం ఎన్ని నిధులు అయినా ఇచ్చేందుకు సిద్ధమని సీఎం ఎ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉప్పల్ చౌరస్తాలో రాజిరెడ్డి విగ్రహం కూడా పెడతానని సీఎం చెప్పారు. గుజరాత్ లో సబర్మతీ, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్, యూపీ సర్కారు గంగానదీ రివర్ ఫ్రంట్ చేసుకోవచ్చు కానీ తాము మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా అని సీఎం ప్రశ్నించారు. మూసీ సుందరీకరణతో ఉద్యోగాలు వస్తాయని సీఎం చెప్పారు. నల్గొండ జిల్లా వాసులు కాలుష్యం కాటుతో బాధపడుతున్నారని, వారిని ఆ బాధ నుంచి విముక్తి చేయకూడదా అని సీఎం అడిగారు. మూసీ కింద ఇళ్లు కోల్పోతే ఇళ్లు ఇస్తామని సీఎం హామి ఇచ్చారు. నాగోలు నుంచి శంషాబాద్ మెట్రోరైలు విస్తరణకు ప్రతిపాదనలు పంపించానని సీఎం చెప్పారు. 122 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణానికి అర్ధాంతరంగా ఆపారని సీఎం ఆరోపించారు.రీజనల్ రింగ్ రోడ్డు కోసం ప్రధానిని అయిదు సార్లు కలిశానని అయినా కేంద్రం నుంచి అనుమతి రాలేదన్నారు. మూడు కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు తీసుకు రారా అని సీఎం ప్రశ్నించారు. కేంద్రం ప్రాజెక్టులకు సహకరించకుంటే తాము కార్యాచరణ ప్రారంభిస్తామని సీఎం హెచ్చరించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వకుండా మహారాస్ట్ర నుంచి క్లియరెన్స్ రాకుండా కేంద్రమంత్రి అడ్డుపడుతున్నారని సీఎం ఆరోపించారు.
దేశంలోనే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం అతిపెద్దదని, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు నివశిస్తున్నారని సీఎం ఎ రేవంత్ రెడ్డి చెప్పారు. నాడు మల్కాజిగిరి ఎంపీగా ప్రజలు గెలిపించి నందునే తాను పీసీసీ అధ్యక్షుడై సీఎం అయ్యాయని సీఎం పేర్కొన్నారు. మల్కాజిగిరి ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తాను ఎంపీ అయ్యానన్నారు. అంతర్జాతీయ నగరంలో ఆ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నానని సీఎం చెప్పారు.ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1.34 కోట్ల మంది గ్రేటర్ మున్సిపాలిటీల్లోనే నివాసముంటున్నారని, వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా పరిపాలనను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఎన్నికల లబ్ధి కోసం కాకుండా పరిపాలనా సౌలభ్యం కోసమే తాను మూడు మున్సిపల్ కార్పొరేషన్లు చేశానని సీఎం తెలిపారు. పరిపాలనా వికేంద్రీకరణకు వీలుగా చర్యలు చేపట్టామన్నారు.

రూ.1511 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన

ఉప్ప‌ల్ భ‌గాయ‌త్ లే అవుట్ లో 1511 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. పది ఎకరాల్లో రూ.98 కోట్లతో నిర్మించే మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన సీఎం శంకుస్థాపన చేశారు. రూ.960 కోట్ల రూపాయలతో ఏఓసి సెంటర్ లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి,రూ.416 కోట్లతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్ లో 6 లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి,రూ.37.50 కోట్లతో 100 పడకల మల్కాజ్ గిరి జిల్లా ఆస్పత్రి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. క్యూర్ వన్ యాప్ ను ముఖ్వమంత్రి ప్రారంభించారు. కోర్ అర్బన్ ఏరియాలోని ప్రజలు క్యూర్ వన్ యాప్ ద్వారా ఇంటి పన్ను లేదా విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, ట్రాఫిక్ చలానాల చెల్లింపులు సులభంగా చెల్లించవచ్చు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు,దామోదర రాజనర్సింహ,ప్రభుత్వ సలహా దారు వి హనుమంత రావు,రాజ్య సభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి,అనిల్ కుమార్ యాదవ్, భువనగిరి ఎంపీ చామ‌ల ‌కిర‌ణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్,ఎంఎల్ ఏ లు బండారి లక్ష్మా రెడ్డి ,మల్ రెడ్డి రంగా రెడ్డి ,శ్రీ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాల విస్తరణ, పరిపాలనా వికేంద్రీకరణ, ఆధునిక నగర నిర్మాణ లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మల్కాజిగిరి ప్రజల ఆశీర్వాదంతోనే తాను రాజకీయంగా ఎదిగానని గుర్తు చేసిన ఆయన, అదే ప్రాంతాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టే బాధ్యతను తమ ప్రభుత్వం నిర్వర్తిస్తుందని పేర్కొన్నారు. రూ.1,511 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో మల్కాజిగిరి ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపిరి లభించనున్నట్లు స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read More
Next Story