x

తెలంగాణపై పగపట్టిన ‘ఎల్ నినో’ అంటే ఏమిటో తెలుసా ? (వీడియో)

పెరూ, ఈక్వెడార్ దేశాల్లోని తీరప్రాంతాల్లోని నీరు అసాధారణంగా వేడెక్కుతుంది


తెలంగాణపై ఎల్ నినో ప్రభావ తీవ్రతపై అందరిలోను ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఇంతమందిలో ఆందోళనలు పెంచేస్తున్న ఎల్ నినో అంటే ఏమిటి ? ఎల్ నినో అన్నది స్పానిష్ పదం. ఈ పదాన్ని పెరూ, ఈక్వెడార్ దేశాల్లోని తీరప్రాంత ప్రజలు ఎక్కువగా వాడుతారు. ప్రతి ఏడాది డిసెంబర్ మాసాన్ని క్రిస్తిమస్ మాసం అని అంటారు. ఈ నెలలో పెరూ, ఈక్వెడార్ దేశాల్లోని తీరప్రాంతాల్లోని నీరు అసాధారణంగా వేడెక్కుతుంది. సముద్రపు నీరు అసాధారణంగా వేడెక్కటంవల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లోని వాతావరణంలో కూడా అసాధారణమైన మార్పులు వస్తాయి. ఈ అసాధారణమైన మార్పులనే పై దేశాల్లో ఎల్ నినో అనంటారు.

ఇక దీని ప్రభావం తెలంగాణలో ఎలాగుంటుందంటే సాధారణ వర్షపాతం కన్నా 35శాతం తక్కువ వర్షాలు నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావం ప్రధానంగా భూగర్భజలాలు, చెరువులు, కుంటలపైన చూపుతోంది. రబీ, ఖరీఫ్ సీజన్లో తెలంగాణలో సుమారుగా 1.10 కోటి ఎకరాల్లో వరి పండిస్తారు. ఎల్ నినో ప్రభావం వల్ల వరి సాగు ఈసారి 40 లక్షల ఎకరాలు తగ్గుతుందని అంచనా. వరి సాగుకు ఎక్కువ నీరు కావాలి. అందుకనే ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయ పంటలైన వేరుశెనగ, కందులు, రాగులు, మొక్కజొన్న, సజ్జలు, పత్తి పంటలను ప్రోత్సహిస్తోంది.

సాధారణ వర్షపాతం కన్నా తగ్గటంతో భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. నీటి ప్రాజెక్టుల్లో కూడా నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజ్‌కు చేరుకుంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగులకు పడిపోయింది. సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్ స్టోరేజ్‌కన్నా తక్కువకు చేరితే కుడి, ఎడమ గట్టులపై ఉన్న జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతుందని ప్రభుత్వం ఆందోళనపడుతోంది.

మిషన్ భగీరథకు నీరు అందించే 29 ప్రధాన రిజర్వాయర్ల పరిస్థితి కూడా ఆందోళ‌న‌క‌రంగానే వుంది. మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు తాగునీరు అందించే 123 శుద్ధి కేంద్రాలకు రాష్ట్రంలోని 29 ప్రధాన జలాశయాలే ఆధారం. ఈ జలాశయాల మొత్తం నిల్వ సామర్థ్యం 1,059 టీఎంసీలు కాగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు 333.44 టీఎంసీలు మాత్రమే. ఈ నీటిమట్టాలను బట్టే తెలంగాణపై ఎల్ నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతోంది.

Read More
Next Story