వేల్పూర్ స్పైస్ పార్కు నిర్మాణం పూర్తి చేసేదెన్నడు?
x
పసుపునకు గిట్టుబాటు ధర ఏది?

వేల్పూర్ స్పైస్ పార్కు నిర్మాణం పూర్తి చేసేదెన్నడు?

పసుపు రైతుల ఆవేదన: పార్కు లేదు…గిట్టుబాటు ధర లేదు


నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల ఆశలకి ప్రతీకగా భావించిన వేల్పూర్ స్పైస్ పార్కు నిర్మాణం పదేళ్లుగా నిలిచిపోయి ప్రశ్నార్థకంగా మారింది. వేల ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటు ధర అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు, నిధుల కొరతతో కాగితాలకే పరిమితమవడం రైతుల్లో తీవ్ర నిరాశను కలిగిస్తోంది.

వేల్పూరులో స్పైస్ పార్కు పూర్తి చేసేదెన్నడు?

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో స్సైస్ పార్కు ఏర్పాటు కాలేదు.నిజామాబాద్ జిల్లాలో 33,500 ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారు.పసుపునకు గిట్టుబాటు ధర అందించాలంటే స్పైస్ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వేల్పూరు కేంద్రంగా స్పైస్ పార్కు ఏర్పాటుకు 2016వ సంవత్సరంలో 40 ఎకరాల స్థలంతోపాటు రూ.2.75 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.స్పైస్ పార్కు చుట్టూ ప్రహరీగోడ, సీసీరోడ్లు నిర్మించారు. స్పైస్ పార్కును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్మించాలని నిర్ణయించినా కేంద్ర ప్రభుత్వం పైసా కూడా విడుదల చేయలేదు. పసుపు నిల్వ చేసుకునేందుకు గోదాములు, పసుపు శుద్ధికి యంత్రపరికరాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమైనాయి.

పసుపు పరిశోధనా కేంద్రాలేవి?

పసుపులో అధిక దిగుబడి నిచ్చే రకాలను ప్రవేశపెట్టేందుకు వీలుగా పసుపు పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఆచరణ రూపం దాల్చ లేదు. వేల్పూరు, ధర్పల్లి, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ లలో పసుపు పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ నిధులు విడుదల చేయక పోవడంతో పసుపు పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. 2008వ సంవత్సరం నుంచి పసుపు పరిశోధనా కేంద్రాల ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ఒక్క కమ్మర్ పల్లిలో మాత్రం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటైంది. కానీ ఈ కేంద్రంలో పసుపులో పరిశోధనలు ఆశించిన మేర సాగడం లేదని పసుపు రైతులు ఆరోపించారు. పసుపు అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు పరిశోధించడంతో పాటు సాగులో అధునాతన పద్ధతులపై రైతులకు శాస్త్రవేత్తలు సూచనలు అందించాల్సి ఉండగా అవేవీ లేక పసుపు దిగుబడి తగ్గిందని రైతులు ఆవేదనగా చెప్పారు.

పసుపునకు గిట్టుబాటు ధర ఏది?

రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పసుపునకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ లో పసుపునకు మంచి ధరతో పాటు డిమాండ్ ఉన్నా క్వింటాలుకు రూ.4వేలు ధర తగ్గింది. దళారులు, వ్యాపారులు సిండికేట్ గా మారి పసుపు రైతులను దోచుకుంటున్నారు. ఏప్రిల్ 10వతేదీన క్వింటాలు పసుపు ధర రూ.16వేలు పలకగా, దాన్ని పది రోజుల్లోనే రూ.12లకు తగ్గించి కొంటున్నారు. దీని వల్ల పసుపు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈనామ్ సాంకేతిక లోపంతో బహిరంగ వేలం ద్వారా పసుపును తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని నిర్మల్ జిల్లాకు చెందిన పసుపు రైతు డి బాపయ్య ఆందోళన వ్యక్తం చేశారు. తమ పసుపునకు మంచి ధర రావడం లేదని మరో పసుపు రైతు డి నర్సారెడ్డి ఆవేదనగా చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగాలి : పసుపు రైతు సంఘం డిమాండ్

పసుపు క్వింటాలుకు కనీసం రూ. 15వేలు ధర కల్పించాలని, గిట్టుబాటు ధర రానపుడు తమ పసుపు రైతులను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు రంగంలోకి దిగి పసుపును కొనుగోలు చేయాలని పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. వేల్పూరులో స్పైస్ పార్కును ఏర్పాటు చేయలేదని ఆయన చెప్పారు. నిజామాబాద్ కేంద్రంగా జాతీయ బోర్డు ఏర్పాటు చేసినా తమ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని తిరుపతిరెడ్డి ఆరోపించారు.

మెట్ పల్లి మార్కెట్ లోనూ...

పసుపు అతిపెద్ద మార్కెట్లు అయిన నిజామాబాద్, మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్లలో పసుపు రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఈనామ్ వ్యవస్థ పనిచేయక పోవడంతో దళారులు, వ్యాపారులు కుమ్మక్కై పసుపు ధరను తగ్గించారు. క్వింటాలు పసుపు ధర రూ.16వేలు పలుకుతుందనే ఆశతో పసుపును మార్కెట్ కు తీసుకువస్తే రూ.11వేలే పలకడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు ధర పతనంతో పాటు రవాణ చార్జీలు పెరిగి తాము నష్టపోతున్నామని మెట్ పల్లి ప్రాంతానికి చెందిన రైతు ఎస్ శ్రీనివాస్ చెప్పారు. పసుపునకు గిట్టుబాటు ధర కల్పించే దాకా తాము పోరాటం చేస్తామని పసుపు రైతు సంఘం అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

జాతీయ పసుపు బోర్డుకు నిధులేవి?

పసుపు రైతుల ఉద్యమాల వల్ల నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేశారు. దానికి కేంద్ర పరిశ్రమల శాఖ ఆశించిన మేర నిధులు కేటాయించలేదు.నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు 2025 జనవరి 14వతేదీన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా ప్రారంభించారు. పసుపు బోర్డుకు రూ.100కోట్లు కేటాయించాలని కోరుతూ ప్రతిపాదనలు పంపించినా కేంద్రం నిధులు కేటాయించలేదు. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులపై స్పష్టత రావాల్సి ఉంది. మరో వైపు పసుపు బోర్డుకు సొంత భవనం నిర్మించక పోవడంతో అద్దె భవనంలో దీన్ని కొనసాగిస్తున్నారు. పసుపు ఉత్పత్తి, నాణ్యతను పెంచడం, ఎగుమతులను ప్రోత్సహించడం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ఈ బోర్డు ప్రధాన లక్ష్యాలు కాగా నిధులు లేక పసుపు రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. జాతీయ బోర్డుకు కేంద్రం నిధులు ఇస్తేనే పసుపు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని పసుపు రైతుల సంఘం నాయకుడు కోటపాటి నర్సింహనాయుడు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

‘ఈ-నామ్ ’లో పసుపు కొనుగోలు చేస్తాం : ఏఎంసీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో బహిరంగ వేలం వల్ల దళారులు, వ్యాపారులు కుమ్మక్కై పసుపు ధర తగ్గించారని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.వ్యాపారులు ఈ-నామ్ సాఫ్ట్ వేర్ సాంకేతిక లోపం వల్ల పసుపు ధరను తగ్గించి కొనుగోలు చేస్తున్నారని పసుపు రైతులు మార్కెట్ లో నిరసన వ్యక్తం చేశారు. దీనిపై నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి స్పందించి ఈ-నామ్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేసే వరకు ఏప్రిల్ 20వతేదీ వరకు వేలం ద్వారా పసుపు కొనరాదని ఛైర్మన్ చెప్పారు.

రైతుల కోసం సహాయ కేంద్రం

పసుపు విక్రయాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వారి ఇబ్బందులను కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రానికి ఫోన్ లో ఫిర్యాదు చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం రైతులకు సహాయం చేస్తుందని కలెక్టరు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సహాయకేంద్రం పనిచేస్తుందని, రైతులు 08462 220183 ఫోన్ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టరు చెప్పారు.
స్పైస్ పార్కు, పసుపు పరిశోధనా కేంద్రాలు, జాతీయ పసుపు బోర్డు...ఇవన్నీ పసుపు రైతుల జీవితాలను మార్చగల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులే. కానీ నిధుల కొరత, అమలులో లోపాలతో ఇవి వాస్తవంగా మారకపోతే పసుపు రైతుల పరిస్థితి మారదు. రైతులకు గిట్టుబాటు ధర, సాంకేతిక సహాయం అందించాలంటే ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది—లేకపోతే పసుపు రైతుల సమస్యలు మరింత పెరగడం ఖాయం.
Read More
Next Story