తెలంగాణలో తగ్గినా… ఏజెన్సీలో వెంటాడుతున్న మలేరియా
x
తెలంగాణ ఏజెన్సీలో దోమల బెడద : మలేరియా ప్రబలటానికి కారణం

తెలంగాణలో తగ్గినా… ఏజెన్సీలో వెంటాడుతున్న మలేరియా

దోమల దాడితో మన్యంలో మళ్లీ మలేరియా జ్వరాలు,అప్రమత్తమైన ఆరోగ్య శాఖ


తెలంగాణలో మొత్తం మలేరియా కేసులు గణనీయంగా తగ్గినా, మన్యం,ఏజెన్సీ జిల్లాల్లో మాత్రం పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు.భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లో దోమల వ్యాప్తి వల్ల మలేరియా కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అటవీ ప్రాంతాల్లో దోమల వ్యాప్తి, పారిశుద్ధ్య లోపాలు, వలస కార్మికుల రాకపోకలు మలేరియా వ్యాప్తికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో గడచిన అయిదేళ్లలో 70 శాతం మలేరియా కేసులు తగ్గాయి కానీ మన్యం జిల్లాల్లో మాత్రం మలేరియా జ్వరాలు వస్తూనే ఉన్నాయి.

మన్యం జిల్లాలో మలేరియా జ్వరాలు

మన్యం జిల్లాగా పేరొందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మలేరియా జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ ఏడాది 21 మలేరియా కేసులు నమోదయ్యాయి.కొరవడిన పారిశుద్ధ్యంతో దోమలు వ్యాప్తిచెందుతుండటంతో మలేరియా జ్వరాలు వ్యాపిస్తున్నాయి. దోమల నివారణ కోసం ప్రతీ శుక్రవారం నిర్వహించాల్సిన డ్రైడేను అధికారులు విస్మరించడంతో దోమల బెడద పెరిగింది. జిల్లాలో 160 మలేరియా పీడిత గ్రామాలను గుర్తించి, దోమల నివారణకు చర్యలు చేపట్టామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ చెప్పారు.

దోమల నివారణకు ఫాగింగ్

మలేరియా నివారణ చర్యలేవి?

తెలంగాణలోని అటవీ జిల్లాల్లో దోమల వ్యాప్తి వల్ల మలేరియా జ్వరాలు ప్రబలుతున్నాయి. మలేరియా నివారణకు అధికారులు సజావుగా పనిచేయక పోవడంతో తాజాగా కేసులు నమోదవుతున్నాయి. గతంలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి రక్తపూతలు సేకరించేవారు. అది ప్రస్థుతం కనిపించడం లేదు. ఇంటింటి సర్వే చేసి రక్తనమూనాలతో స్లైడ్స్ తీసుకునే వారు. మలేరియా విభాగం అటకెక్కింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, హన్మకొండ, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో మలేరియా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది 146 మంది మలేరియా జ్వరంతో ఎంజీఎంలో చికిత్స పొందారు.ఈ ఏడాది ఇప్పటికే 37 కేసులు నమోదయ్యాయి. ములుగు జిల్లాలో అత్యధికంగా గత ఏడాది 44 మలేరియా కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో మలేరియా కేసుల గ్రాఫ్

సంవత్సరం కేసుల సంఖ్య
2014 14,000
2018 2,500
2024 261
2025 270
2026 (మే వరకు) అదుపులో ఉన్నాయి

2030 నాటికి మలేరియా రహిత రాష్ట్రం లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2030 నాటికి మలేరియా రహిత రాష్ట్రంగా అవతరించాలనే లక్ష్యంతో మలేరియా విభాగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది.పదేళ్ల క్రితం వేలల్లో ఉన్న కేసుల సంఖ్య ఇప్పుడు వందల్లోకి తగ్గాయి. 2014వ సంవత్సరంలో 14,000 మలేరియా కేసులు నమోదు కాగా గత సంవత్సరం వీటి సంఖ్య 259కి తగ్గాయి. రాష్ట్రంలో గత ఏడాది 11 జిల్లాల్లో ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదని వైద్యశాఖ అధికారులు చెప్పారు.టెస్టు, ట్రీట్, ట్రాక్ వల్ల మలేరియా తగ్గుముఖం పట్టిందని వైద్యశాఖ అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

మల్కాజిగిరిలో దోమల వ్యాప్తిని నివారించడానికి అధికారుల తనిఖీలు

మలేరియాపై అప్రమత్తంగా ఉండాలి

2030 నాటికి భారతదేశాన్ని మలేరియా రహిత దేశంగా మార్చడానికి అన్ని విభాగాల సమన్వయంతో పనిచేస్తున్నామని హైదరాబాద్ సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ నందికూరి వినయ్ కుమార్ చెప్పారు. మలేరియా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ మధ్య మధ్యలో కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మురుగునీటి కాల్వలను శుభ్రం చేయక పోవడం, బ్లీచింగ్ పౌడరు చల్లక పోవడం, మురుగునీటిలో ఆయిల్ బాల్స్ వదలక పోవడం, ఫాగింగ్ చేయక పోవడం వల్ల దోమల బెడద పెరుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.వాతావరణ మార్పులు, పెరిగిన ఉష్ణోగ్రతలతో దోమల సంతానోత్పత్తి పెరిగిందని సీసీఎంబీ సీఈఓ డాక్టర్ ఎన్ మధుసూదన్ రావు చెప్పారు.

మంచం ఎక్కుతున్న జ్వర పీడితులు

హైదరాబాద్ నగరంలోని వలస కార్మికులు, నిర్మాణ ప్రదేశాల వల్ల మలేరియా జ్వర పీడితులు మంచం ఎక్కుతున్నారు. ఫాల్సిపేరమ్ మలేరియా కేసులు అత్యంత ప్రమాదకరంగా పెరుగుతున్నాయని తెలంగాణ ఆరోగ్య శాఖ హెచ్చరించింది. మస్కిటో నెట్‌లను పంపిణీ చేయడం, ఫీవర్ సర్వైలెన్స్, ఇంటింటి తనిఖీలు,దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

దోమల బెడద అధికంగా ఉన్న ఏజెన్సీ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు వంటి జిల్లాల్లో మలేరియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రత్యేక మొబైల్ హెల్త్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. మారుమూల గిరిజన గ్రామాల్లో ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్ అందుబాటులో ఉంచారు. ఇవి కేవలం 15-20 నిమిషాల్లో ఫలితాన్ని ఇస్తాయి.ప్రతి శుక్రవారం 'డ్రై డే': నిల్వ ఉన్న నీటి ద్వారా దోమలు వ్యాప్తి చెందకుండా ప్రతి శుక్రవారం ఇళ్లలో, పరిసరాల్లో నీటిని తొలగించాలని మలేరియా విభాగం ముమ్మరంగా ప్రచారం చేస్తోంది.ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికుల ద్వారా మలేరియా 'ఇంపోర్ట్' కాకుండా ఉండేందుకు భవన నిర్మాణ రంగం, ఇటుక బట్టీల వద్ద ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించారు.తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లలో మలేరియా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే ఈ ఏడాది వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా ప్రభావం ఇంకా కనిపిస్తుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండనివ్వకూడదు.రాత్రివేళ మస్కిటో నెట్ వాడాలి.జ్వరం వస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలి.పిల్లలు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.గ్రామాల్లో డ్రైడే కార్యక్రమాల్లో పాల్గొనాలి.
మొత్తానికి తెలంగాణలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గినా, మన్యం మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఇంకా ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. వర్షాకాలం సమీపిస్తున్న వేళ ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండటమే కాకుండా ప్రజల భాగస్వామ్యంతో దోమల నివారణ చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండనివ్వకపోవడం నుంచి జ్వరం వచ్చిన వెంటనే పరీక్షలు చేయించుకోవడం వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే 2030 నాటికి మలేరియా రహిత తెలంగాణ లక్ష్యం సాధ్యమవుతుంది.
Read More
Next Story