ఎన్‌సీఆర్‌బీ  లెక్కల్లో తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎందుకు తగ్గిపోయాయి?
x

ఎన్‌సీఆర్‌బీ లెక్కల్లో తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎందుకు తగ్గిపోయాయి?

2018 నుంచి రైతు భీమా పథకం అమలులోకి వచ్చాక రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను నమోదు చేసే ప్రక్రియ ఆగిపోయింది


ఇటీవల విడుదల అయిన జాతీయ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలలో తెలంగాణా రైతు ఆత్మహత్యలను తక్కువ చేసి చూపారని రాష్ట్రంలోని రైతు సంఘాలు తప్పుపడుతున్నాయి. ఈ సంఖ్య ఖచ్చితంగా వాస్తవ పరిస్థితులను ప్రతిభింభించటం లేదని వ్యవసాయ రంగంలోని సంక్షోభాన్ని ఇది దాచే ప్రయత్నం అని విమర్శిస్తున్నాయి.

2024 లో రాష్ట్రంలో కేవలం 43 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారని ఈ గణాంకాలు చెప్పటం పట్ల విస్మయం వ్యక్తం చేశాయి. ఇందులో 28 మంది స్వంత భూమి సాగుదారులు కాగా, 15 మంది లీజు తీసుకున్న భూమిని సాగుచేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ అంకెల గారడీ బిఆర్ఎస్ హయాం నుంచే మొదలైందని అవి తెలియచేస్తున్నాయి. రాష్ట్రంలో ఎంత మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి అనే విషయం పై రాజకీయం దుమారం మాత్రం తరచూ జరుగుతోంది. అదే ఏడాదిలో 5,745 మంది రోజు వారీ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఈ విషయం పై వివాదం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు మాత్రమే గడిచిన సమయం నుంచే మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7, 2025 న కొలువు తీరి అధికార పీఠం ఎక్కింది. అయితే మరో 100 రోజుల్లో దేశ సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 209 మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయని బిఆర్ఎస్ పెద్ద దూమరమే చేసింది. అయితే ఆ జాబితాలో కరెంట్ షాక్ తో, పిడుగు పడి, ట్రాక్టర్ ఆక్సిడెంట్ లో పొరపాటున చనిపోయిన వాళ్ళను ఈ జాబితాలో చేర్చారని రైతు స్వరాజ్య వేదిక లాంటి సంఘాలు బయట పెట్టాయి. తమ లెక్కల ప్రకారం ఆ కాలంలో 63 రైతు ఆత్మహత్యలు జరిగాయని, సరైన జాబితా ఇవ్వటం ద్వారా రైతులకు న్యాయం చేయవచ్చని తద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావచ్చని ఆ సంఘం రాజకీయ పార్టీలకు ఆ సందర్భంగా విజ్ఞప్తి చేసింది.

అయితే బిఆర్ఎస్ హయాంలో మొదలైన రైతుల ఆత్మహత్యలు తక్కువ చేసి చూపే ప్రక్రియ నేటికి కొనసాగుతోందని రైతు సంఘాలు చెప్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఉమ్మడి రాష్ట్రం నుంచి అమలులో ఉన్న జీవో 194 అమలును నిర్లక్ష్యం చేయడమే అని అవి అభిప్రాయపడుతున్నాయి. బిఆర్ఎస్ ప్రభుత్వం ఆగస్టు 15, 2018 నుంచి రైతు భీమా పథకం అమలులోకి తేవటంతో ఈ జీవో అమలు నిలిచిపోయింది. జీవో 194 ప్రకారం ఏ రైతు ఆత్మహత్య చేసుకున్నా మొదట మండలంలోని పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల ముగ్గురు సభ్యుల కమిటీ తరువాత జిల్లా స్థాయి అధికారులతో కూడిన కమిటీ రైతు కుటుంబాన్ని సందర్శించి ఆత్మహత్యకు గల కారణాలను నమోదు చేయాలి. ఇలా నిర్ధారణ అయిన రైతు కుటుంబాలకు ఆరు లక్షల నష్ట పరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇందులో ఒక లక్ష అప్పులు ఇచ్చిన వారికి అప్పు పత్రాలు తీసుకుని ఆ కుటుంబాన్ని ఋణ విముక్తి చేస్తారు. మిగిలిన ఐదు లక్షలు కుటుంబానికి ఇస్తారు.

రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను నివారించటానికి వివిధ కమిటీలు ఇచ్చిన సిఫార్సులతో ఏర్పడిన ఈ ప్రక్రియను బిఆర్ఎస్ రైతు భీమా పథకం అమలు మొదలు పెట్టాక నిలిపివేసింది. ఈ పథకం అమలుకు ఉన్న షరతు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పేరు మీద వ్యవసాయ భూమి వుండటంతో పాటు వారి వయసు 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఈ షరతు వలన భూమి లేని వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు లబ్ది పొందలేకపోయారు.

దేశంలో 2024 లో మొత్తంగా 10,546 మంది వ్యవసాయంతో సంబంధం ఉన్న వాళ్ళు ఆత్మహత్య చేసుకోగా, 2023 లో ఆ సంఖ్య 10,786 గా ఉండింది.

తెలంగాణా లో రైతు ఆత్మహత్యల పై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దగ్గర నమోదు అయిన గణాంకాలు:

ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలపై అఖిల భారత కిసాన్ సంఘ నాయకులు సారంపల్లి మల్లా రెడ్డి మాట్లాడుతూ, “రైతుల చావులను తక్కువ చేసి చూపేందుకు రైతు కూలీలను, మహిళా రైతులను వేరుగా చూపడం మొదలు పెట్టింది బీజేపీ నేతృత్వం లోని ఎన్డీఏ ప్రభుత్వం. చనిపోయిన వాళ్ళను వ్యక్తిగత కారణాలతో చనిపోయినట్టు చూపుతున్నారు. వాటిని భార్య భర్త గొడవలు, తాగుడు వలన, గుండె పోటు వలన చనిపోయినట్టు నమోదు చేస్తున్నారు. రైతుల చావులు 13 రాష్ట్రాలలో జరుగుతున్నాయి. ఐదు ఎకరాల లోపు ఉన్న రైతు మూడు నుంచి ఐదు లక్షల అప్పు కాగానే ఆత్మహత్య వైపు నెట్టివేయబడుతున్నాడు. దీంతో నిరాశ నిస్పృహతో అప్పులు తీర్చలేని స్థితిలో త్రాగుడుకు బానిస అవుతున్నారు,” అని వివరించారు.

దేశంలో రైతులకు ఉన్న సరాసరి అప్పులల్లో ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ తదుపరి స్థానంలో ఉంది. హర్యానా, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ తరువాత స్థానాల్లో ఉన్నాయి. రైతులకు బ్యాంక్ అప్పులు అందుబాటులో లేకపోవటంతో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర 24 శాతం, 36 శాతం వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు. 24 శాతం వడ్డీకి నాలుగు ఏళ్ళలో అప్పు రెండింతలు అవుతుంది. 36 శాతం వడ్డీకి మూడు ఏళ్ళలో వడ్డీ అసలుకు సమానం అవుతుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు 40 శాతం వ్యవసాయ రంగానికి కేటాయించి అందులో 18 శాతం పంట రుణాలు ఇవ్వాలి. న్యాయంగా రైతులకు 9 శాతం వడ్డీకి రుణాలు ఇవ్వాలి. అందులో నాలుగు శాతం కేంద్రం, 2 శాతం రాష్ట్రం భరిస్తే మిగిలిన మూడు శాతం మాత్రమే రైతు చెల్లించాలి. అప్పుడు రైతుకు పావలా వడ్డీకి రుణం ఇచ్చినట్టు అవుతుంది. 18 శాతం లో 8.3 శాతం చిన్న, మధ్యతరగతి రైతులకు ఇవ్వాలి.

రైతు చావుల గురించి రోజు వారీగా పేపర్ లలో వచ్చే వార్తలను క్రోడీకరించే కార్యకర్త స్వతహాగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన పులి రాజు 2024 లో రాష్ట్రం లో 229 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చెప్తున్నారు. ఫెడరల్ తో మాట్లాడుతూ తాను వ్యక్తిగతంగా చనిపోయిన 100 మంది రైతు కుటుంబాలను కలిశాను అని తెలిపారు. “రైతు భీమా పథకం వచ్చాక ఎలాగూ ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తుంది కాబట్టి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి శవానికి పోస్ట్ మార్టం చేయకుండా కొన్ని సందర్భాలలో ఆపుతున్నారు. ఇలాంటివి ఎఫ్ఐఆర్ కావు కాబట్టి వెలుగు లోకి రావు,” అని తెలిపారు. చనిపోయిన రైతుల సంఖ్య 229 కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది అని ఆయన చెప్పారు.

ఈ విషయం పై రైతు స్వరాజ్య వేదిక బి. కొండల్ రెడ్డి భూముల విలువ పెరగటంతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొంత తగ్గాయని చెప్పారు. నష్టాలు పెరిగాక ఉన్న పొలంలో కొంత అమ్మి అయినా అప్పులు కడుతున్నారు దీంతో ఆ కుటుంబాలకు ఉపశమనం వస్తోంది అన్నారు. ఆత్మహత్యాగా నమోదు అయిన ప్రతి చావు జాతీయ స్థాయిలో ఎందుకు నమోదు కావటం లేదు అన్న ప్రశ్నకు, “సహజంగా రైతు ఆత్మహత్యగా ఎఫ్ఐఆర్ అయిన ప్రతి రైతు ఆత్మహత్య డిస్టిక్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (District Crime Records Bureau) లో నమోదు కావాలి అక్కడి నుంచి స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (State Crime Records Bureau), తరువాత నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (National Crime Records Bureau) కి ఆ వివరాలు వెళ్ళాలి. కానీ అలా జరగటం లేదు చాలా రైతు ఆత్మహత్యలు డేటాలో మిస్ అయిపోతున్నాయి. ఇది గత కొద్ది సంవత్సరాలుగా అంటే దాదాపు 2018 ప్రాంతం నుంచి డేటా తక్కువ చేసి చూపించడం జరుగుతోంది. ఇలా వెస్ట్ బెంగాల్ ఇతర ఉత్తరాది రాష్ట్రాలలో గతంలో నుంచి జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా తెలంగాణలో కూడా ఇలా జరుగుతోంది,” అని వివరించారు.

ఇక మహిళా రైతుల ఆత్మహత్యలు నమోదుకాకపోవటానికి మహిళా రైతుల పేరుతో భూమి లేకపోవడం ఎఫ్ఐఆర్ లో వారు వ్యవసాయపరమైన అప్పులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు నమోదు కాకపోవడం సహజంగా భర్తని కుటుంబ యజమానిగా సమాజం చూడడం కారణాలుగా వివరించారు. వారి చావులు సాధారణ ఆత్మహత్యాలుగా నమోదవుతున్నాయి అన్నారు.

ఒక రైతుకు పట్టాదార్ పాస్ బుక్ లో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఎకరాకు రు. 10,000 రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా పేరుతో ఎకరానికి రు. 12000 అమలు కావటం; మిషన్ కాకతీయ తో చెరువులలో మట్టి తీయటం, చెరువులు బాగుచేయటం వలన భూగర్భ జలాలు పెరగటం; మార్కెట్ వ్యవస్థ బలంగా ఉండి పండిన పత్తి, వడ్లను కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనటం; ఋణ మాఫీ ఉపయోగ పడ్డాయని రైతు సంఘాలు అభిప్రాయ పడ్డాయి. రైతు భీమా వలన కనీసం అదే కుటుంబం లో ఆర్థిక కారణాల కారణంగా రెండో ఆత్మహత్య జరగకుండా కాపాడిందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఈ చావులకు నకిలీ విత్తనాలు, ప్రకృతి విపత్తులకు నష్టపరిహారం అందకపోవటం, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవటం, ఉత్పత్తుల ధరలను తలక్రిందులు చేసే ఎగుమతి దిగుమతి విధానాలు ఇతర కారణాలుగా ఉన్నాయి.

Read More
Next Story