ఈ వాన కారులో నైనా పంటల ప్రణాళిక వస్తుందా?
x

ఈ వాన కారులో నైనా పంటల ప్రణాళిక వస్తుందా?

మిగులు ధాన్యం అంతర్జాతీయంగా రేట్ లేకపోవటంతో రాష్ట్రం నష్టాలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది


రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పంటల ప్రణాళిక ప్రవేశపెట్టక నేటికి ఆరు ఏళ్లు. ప్రణాళిక లేకపోవడమే రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో అనేక రుగ్మతలకు కారణమౌతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ప్రణాళిక లేకపోవటంతో నేడు రాష్ట్రంలో వరి, పత్తి కేంద్రంగా వ్యవసాయం జరుగుతోంది. ఈ ఏక రూప పంటల విధానం వలన రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రానున్న ఖరీఫ్ సీజన్ లో అయినా ప్రణాళిక సిద్దం చేసి పంటలను పండించటానికి రైతులను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రణాళిక అవసరాన్ని నొక్కిచెప్తూ మన జనాభా ఏడాదికి 1.9 శాతం పెరుగుతుందని దానికి అనుగణంగా ఆహారం పండించాల్సిన అవసరం ఉందని అఖిల భారత కిసాన్ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లా రెడ్డి అన్నారు. “రియల్ ఎస్టేట్, రోడ్లు, స్పెషల్ ఎకనామిక్ జోన్లు, బిల్డింగ్ కట్టడాలకు భూబదలాయింపు జరుగుతున్న రీత్యా అందుబాటులో ఉన్న భూమిలో ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం బోధన్, ముత్యంపేటలో ఉన్న చెక్కెర కర్మాగారాలను తెరుస్తామని ఇచ్చిన హామీ ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టు ఉంది. ప్రభుత్వం ఫ్యాక్టరీ తెరిచినా దానికి చెరకు అవసరం. అందుకు రైతులను ఆ పంట వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది. రైతులను ప్రోత్సహించాలంటే వాళ్ళకు కొంతకాలం ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక ప్రణాళిక అవసరం,” అని చెప్పారు.

కానీ 2020-21 నుంచి ప్రణాళిక లేకపోవటంతో రాష్ట్రంలో ధాన్యం, పత్తి విస్తీర్ణం పెరిగాయి. 2013-14 లో తెలంగాణ ఏర్పడే నాటికి 65.81 లక్షల టన్నులు ఉన్న వరి ఉత్పత్తి 2024-25 నాటికి 170 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఈ పెరుగుదల వలన నేడు దేశంలో 12 శాతం వరి రాష్ట్రంలో పండుతోంది. విస్తీర్ణంలో 19.95 లక్షల ఎకరాల నుంచి 46.9 లక్షల ఎకరాలకు పెరిగింది. దీనికి సాగు నీటి పారుదల పెరుగుదలతో పాటు గత తొమ్మిది ఏళ్ళుగా ఋతుపవనాలు బాగా ఉండటం తోడైంది. ఈ పంటలకు మాత్రమే మద్దతు ధరల కల్పన ఈ ప్రక్రియకు మరింత ఊతం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ సన్న బియ్యానికి బోనస్ ప్రకటనతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం అయ్యింది.

దీనితో డిసెంబర్ 2024 రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం 2013-14 నుండి 2023 -24 మధ్య పళ్ళతోటల విస్తీర్ణం 7.4 లక్షల ఎకరాల నుంచి 3.9 లక్షల ఎకరాలకు, కూరగాయలు 5.4 లక్ష ఎకరాల నుంచి 1.2 లక్షల ఎకరాలకు, 96 వేల ఎకరాల నుంచి 66 వేల ఎకరాలకు పడిపోయాయి. నూనె గింజల విస్తీర్ణం సగం అవ్వగా పప్పు దినుసులు తగ్గాయి. ఈ కాలంలో పత్తి విస్తీర్ణం మాత్రమే కొద్ది మార్పు నమోదు చేసింది.

దీనితో 2025-26 లో రాష్ట్రం తన అవసరాలు తీర్చుకుని కేంద్రానికి ఇవ్వగా 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిగులు తేలుతోంది అని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం లెక్కగట్టింది. ప్రపంచ మార్కెట్లో ధరలు మన దేశం కంటే తక్కువగా ఉండటంతో నష్టాలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని పేర్కొంది. దీనితో నష్టాలు ఎలా తగ్గించుకోవాలో చూసే పరిస్థితి ఏర్పడింది.

ఇతర పంటలకు విస్తరించకుండా రాష్ట్రం 50 లక్షల ఎకరాల్లో ధాన్యం ఎందుకు పండిస్తోందని, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ డైరెక్టర్ జీ. వీ. రామాంజనేయులు ప్రశ్నించారు. రబీలో కనీసం 2.4 లక్షల ఎకరాల వరి పండుతున్న భూమిని పండ్లు, దినుసులు, నూనె గింజలు పండించటానికి మళ్లించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొ.అల్దాస్ జానయ్య చెప్పారు.

పంటల్లో వైవిధ్యం లేకపోవటంతో జరిగే అనార్థాలను సెస్ పరిశోధకులు దయాకర్ పెద్ది, సురేష్ రెడ్డి అధ్యయనం చేసి రైతుకు రాబడితో పాటు, నేల సారం దెబ్బతింటుందని చెప్పారు.

గత కొంత కాలంగా మొక్కజొన్నకు డిమాండ్ పెరగటంతో ఈ యాసంగిలో దాని సాగు సాధారణంగా ఉండే ఆరు లక్షల ఎకరాల నుంచి 16 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇది నిరుటి యాసంగిలోని తొమ్మిది లక్షల ఎకరాలతో పోలిస్తే దాదాపు రెండింతలు.

అమెరికాతో వాణిజ్య ఒప్పందం తరువాత దిగుమతులు కూడా తోడై ధరల పతనానికి దారితీసిందని రాష్ట్ర ఏఐకెఎస్ జాయింట్ సెక్రెటరీ బొంతు రామ్ బాబు చెప్పారు. “బీహార్ లో మార్కెట్ వ్యవస్థను రద్దుచేసిన తరువాత అక్కడ ధరలు బాగా పడిపోయాయి. ధరలు నిరుడు క్వింటాల్ రు. 2,100 ఉండగా నేడు రు. 1,800 కు పడిపోయింది. కోళ్ళ పరిశ్రమ అక్కడి నుంచే కొంటోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ప్రణాళిక లేకపోవటం. మనకు అవసరం అయిన కందులు, పెసలు, కూరగాయలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి,” అన్నారు.

“కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో లో కొత్త వ్యవసాయ విధానం రూపొందిస్తామని వాగ్దానం చేసింది. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. దీన్ని ఎదుర్కోవటానికి ఒక సమగ్ర ప్రణాళికా అవసరం. ఓ డబ్బు పంచే పథకం లేదా ఋణమాఫీ తో ఈ సమస్య తీరదు. వ్యవసాయం పర్యావరణ హితం కావాలన్నా, కౌలు రైతుల సమస్యలు తీరాలన్నా, ఆదాయం పెరిగి రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడాలన్నా ప్రణాళిక ప్రాధమిక అవసరం. రైతు కమీషన్ బాధ్యత అదే. ఎరువుల కొరత మన ముందు ఉంది. సేంద్రీయ వ్యవసాయం చేయాలన్నా ప్లాన్ అవసరం. ఇప్పటికైనా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి,” అని రైతు స్వరాజ్య వేదిక కు చెందిన కిరణ్ విస్సా పేర్కొన్నారు.

ఆయిల్ పామ్ విస్తరణకు రాష్ట్రం ఇస్తున్న ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ ఆ పంట గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు అనువైనదని మన రాష్ట్రానికి సరిపడే పంట కాదని రామాంజనేయులు అన్నారు. “మన దేశంలో అండమాన్ దీవులు, కేరళ లో మాత్రమే అందుకు అనువైన వాతావరణం ఉంది. ఈ నూనె వినియోగం 50 శాతం కాస్మెటిక్ పరిశ్రమలో మరి కొంత ఆహార పరిశ్రమలో జరుగుతుంది. రోజువారీగా ఇళ్ళలో వినియోగించేది తక్కువే,” అని ఆయన తెలిపారు.

Read More
Next Story