
కార్ పూలింగ్ : ప్రధాని సలహా హైదరాబాద్ వాళ్లు పాటిస్తారా?
హైదరాబాద్ పోలీసులు ఎప్పటి నుంచో ఐటి ఉద్యోగులకు ఈ సలహా ఇస్తూనే ఉన్నారు. ఎవరూ వినడం లేదు...
హోర్ముజ్ జలసంధి దిగ్భంధనం కారణంగా ప్రపంచమంతా చమురు సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో , ఇంధనం ఆదా చేయడానికి, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కార్‌పూలింగ్‌ను స్వీకరించాలని ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ నుంచి దేశ పౌరులను కోరారు.
అయితే, ప్రధానిని సూచనను హైదరాబాద్ ఆచరిస్తుందా? ఎందుకంటే, నగరంలో కారు వాహన దారులు ఎపుడో పట్టుతప్పిపోయారు. వాళ్లు ఇంధనం పొదుపు గురించి ఆలోచించడమే లేదు. అదే విధంగా పెద్ద పెద్ద కంపెనీలు కూడా కార్ పూలింగ్ ను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. కారు యజమానులు ఒక్కడిగా కారులో ప్రయాణించాలనుకోవడం, ఆపైన కార్ పూలింగ్ కి నగరంలోని కంపెనీలు ఆదరణ చూపకపోవడంతో హైదరాబాద్ లో ట్రాఫిక్ క్రిక్కిరిసి పోతున్నది.
ప్రధాని మే 10 వ తేదీన విదేశీ మారక ద్రవ్యం పొదుపు చేసుకునేందుకు ఈ సూచన చేసినా హైదరాబాద్ పోలీసులో ఎప్పటినుంచో కార్ పూలింగ్ ను ప్రచారం చేస్తున్నారు. అది వూపందుకోవడం లేదు. నగరంలో కార్లు నడుస్తున్న తీరు మీద 2026 ఏప్రిల్ లో ఒక సర్వే చేశారు. సర్వే ఫలితాలను చూస్తే హైదరాబాద్ ‘ట్రాఫిక్ నరకం’గా ఎందుకు మారిందో అర్థమవుతుంది.
సైబరాబాద్ పోలీసులు ఉదయం రద్దీ వేళల్లో హైదరాబాద్ సైబర్ టవర్ల పరిసరాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో కార్లలో ఒంటరిగా ప్రయాణించేవారి సంఖ్య సమిష్టిగా ఇతరులతో కలిసి కార్లలో ప్రయాణించేవారి కంటే చాలాఎక్కువ అని ఈ సర్వేలో తేలింది. కేవలం ఒక గంటలోనే వ్యవధిలో 10,138 మంది ఒంటరిగా కారు నడుపుతూ ప్రయాణించేవారిని పోలీసులు గుర్తించారు. ఇద్దరుగా కారులో కలిసి ప్రయాణించేవారు కేవలం 3,584 మంది మాత్రమే ఉన్నారు. అంటే, ఒంటరిగా ప్రయాణించేవారి సంఖ్య 6,554 అధికంగా ఉంది
ఒంటరిగా ప్రయాణించే వారి సంఖ్య పెరగడం వల్ల రోడ్లపై వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ఇది తరచుగా ట్రాఫిక్ జామ్‌లకు దారితీస్తోందని పోలీసులు తెలిపారు. ఒంటరిగా ప్రయాణించడం వల్ల చాలా సమస్యలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో ప్రధామైనది ఆదివారం నాడు ప్రధాని మోదీ చేసిన హెచ్చరికకు సంబంధించిదని. అది అధిక ఇంధన వినియోగం. ఇంధనం రావాలంటే విదేశీ మారక ద్రవ్యం ఖర్చుచేయాలి. యుద్ధం వల్ల చమురు ధర విపరీతంగా పెరగడంతో దేశం ఎక్కువగా విదేశీ మారక ద్రవ్యం వెచ్చించాల్సి వస్తుందని, అది ప్రమాద సంకేతమని ప్రధాని చెప్పారు. దీనికోసం కార్ పూలింగ్ పాటించండని ఆయన చెప్పారు.
ఇపుడు అనుసరిస్తున్న సింగిల్ డ్రైవింగ్ వల్ల ట్రాఫిక్ రద్దీ పెరిగి ఎక్కువ ప్రయాణ సమయం అవుతుంది. ప్రమాదాల ముప్పు పెరుగుతుంది.వీటితో పాటు ప్రయాణికులకు శారీరక అలసట సమస్యలు కూడా కలుగుతున్నాయని కూడా పోలీసులు గుర్తించారు. మరీ ముఖ్యంగా పెరుగుతున్న కార్బన్ ఉద్గారాలు కూడా ఒక తీవ్రమైన పర్యావరణ సమస్య అని ట్రాఫిక్ అధికారులు హెచ్చరించారు. భారీ సంఖ్యలో కార్లు చాలా తక్కువ మందితో ప్రయాణికులను మోసుకెళ్తూ రోడ్డును బాగా ఆక్రమిస్తున్నాయి. దీనివల్ల నగరం కీలక కారిడార్లన్నింటా రద్దీ మరింత దారుణంగా పెరుగుతూ ఉంది.
ఈ సమస్యలపై అవగాహన ఉన్నప్పటికీ, చాలా మంది ప్రయాణికులు ఒంటరి వాహన ప్రయాణాన్నే ఎంచుకుంటున్నారు. దీంతో ప్రవర్తనలో మార్పు రావాలని పోలీసు అధికారులు పిలుపునిస్తున్నారు.
అపుడు అదనపు డీసీపీ హనుమంతరావు, ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి తదితర సిబ్బందితో కూడిన ట్రాఫిక్ అధికారులు సర్వేలో పాల్గొని, ఐటీ ఉద్యోగులు, పౌరులలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.
సైబరాబాద్ పోలీసులు పౌరులను రైడ్-షేరింగ్, కార్‌పూలింగ్‌ను అవలంబించాలని, బస్సులు, మెట్రో వంటి ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించుకోవాలని, అవసరం లేని పక్షంలో రద్దీ సమయాల్లో ప్రైవేట్ వాహనాలను వాడకుండా ఉండాలని వారు కోరారు. పాఠశాలలు, కార్యాలయాల్లోని రద్దీ సమయాలను నివారించడానికి మెరుగైన ప్రయాణ ప్రణాళికను రూపొందించుకోవాలని కూడా వారు సూచించారు.
ఇపుడు ప్రధాని మోదీ హెచ్చరిక చేశారు. పోలీసులు హెచ్చరికలను ఖాతరు చేయకపోయినా, ప్రధాని హెచ్చరికను నగరవాసులు గౌరవిస్తారా?
హైదరాబాద్‌లో కార్‌పూలింగ్ కి ఇంకా సిద్ధపడకపోతున్నా, జిల్లాల్లో ఈ పద్ధతి బాగా ఆదరణ పొందుతోంది, అక్కడ ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయాణికులు ఎక్కువగా సమిష్టిగా ప్రయాణించడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అక్కడ జిల్లాకేంద్రాలలో, పట్టణాలలో నివసిస్తూ పల్లెల్లో పనిచేస్తున్న టీచర్లు ప్రధాన కార్ పూలింక్ ను ఇష్టపడుతున్నారు. అన్ని జిల్లాలో కార్ పూలింగ్ కనబడుతుందని వరంగల్ కు చెందిన నిమ్మారామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన వారం లో మూడు నాలుగురోజులు తన పనిమీద హైదరాబాద్ వస్తారు. తనలాంటి ఉద్యోగం చేస్తున్న మరొక అయిదుగురితో కలసి కారులో హైదరాబాద్ వస్తారు. వారంతా కార్ నుషేర్ చేసుకుంటున్నారు. “ మా మిత్రులందరికి కార్లు ఉన్నాయి. ఒక్కొక్క వారం ఒక్కొక్కరి కారు తీస్తాం. దీనితో మాకు చాలా ఖర్చుతగ్గుంది,”రామ్మోహన రెడ్డి చెప్పారు.
హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కు కళాశాలకు చెందిన ఒక ఉద్యోగి రోజు నల్లొండ నుంచి వస్తారు. “నల్గొండ నుంచి హైదరాబాద్ కు రోజూ వస్తున్నమరొక నలుగురితో కలసి ఒక కారులో వస్తాను. ఈ దూరం 110 కి.మీ. రెండు గంటల్లో గమ్యస్థానాలకు చేరుకుంటాము. రోజుకు రు. 1000 ఇంధనం ఖర్చు వస్తుంది. అయిదు గురికి ఒక్కొక్కరికి రెండు వందలు మాత్రమే ఖర్యవుతుంది. ఇది చాలా చక్కటి పద్ధతి,” అని ఆయన చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో వరంగల్ నుంచి అనంతపురం దాకా కార్‌పూలింగ్ కనిపిస్తుంది. పాఠశాల ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, వారాంతాల్లో హైదరాబాద్‌కు వెళ్లి వచ్చే వ్యాపారుల మధ్య ఈ పద్ధతి ఎక్కువగా ఉంది.
"మేము నలుగురు సహోద్యోగులం ప్రతిరోజూ పని కోసం కలిసి ప్రయాణిస్తాము. మా ఇంధన ఖర్చు రోజుకు సుమారు రూ. 600 అవుతుంది, దానిని మేము సమానంగా పంచుకుంటాము. కొన్ని గ్రూపులలో, ఒక వ్యక్తి తన కారును ఒక వారం ఉపయోగిస్తారు, ఆపై మరొకరు బాధ్యత తీసుకుంటారు. హైదరాబాద్‌కు వారాంతపు పర్యటనల కోసం కూడా, మేము కార్‌పూలింగ్ నే ఇష్టపడతాము ఎందుకంటే క్యాబ్‌లను బుక్ చేసుకోవడం చాలా ఖరీదైన వ్యవహారం. ఈ పద్దతి చౌకగా సౌకర్యవంతంగా ఉండటమే కాదు, ప్రయాణం మధ్యలో మనకు స్వేచ్ఛ కూడా ఉంటుంది," అనంతపురం పట్టణానికి చెంది ఒక టీచర్ కె. వర ప్రసాద్ అన్నారు. అయితే, ఇల్లీ గల్ కార్ పూలింగ్ యాప్ ల జోలికి వెళ్లవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ లో 17 లక్షల కార్లు
హైదరాబాద్ లో దాదాపు 17 లక్షల కార్లు రిజిస్టర్ అయి ఉన్నాయి. అందువల్ల కార్ పూలింగ్ కు అవకాశం ఎక్కువగా ఉందని, ఈ పద్ధతికి మారాలని పోలీసులు కోరుతున్నారు.
202లోనే అవగాహన క్యాంపెయిన్
హైదరాబాద్ పోలీసులు ఎపుడో 2020 జనవరిలోనే కార్ పూలింగ్ అవగాహన కార్యక్రమం చేపట్టారు.
హైదరాబాద్ నగర రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు "కార్ పూలింగ్‌ను ప్రోత్సహించే అవగాహన కార్యక్రమాన్ని" హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈరోజు (24 జనవరి 2020) బేగంపేట కుందన్‌బాగ్‌లోని 'బ్లాక్ నైట్' (Black Knight) ఐటీ కంపెనీ క్యాంపస్‌లో నిర్వహించారు. కార్ పూలింగ్‌ను ప్రోత్సహించడానికి హైదరాబాద్ నగరంలో చేపట్టిన మొదటి కార్యక్రమం ఇది. అప్పటి ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్, IPS ఈ కార్యక్రమంలో పాల్గొని, "కార్ పూలింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు, రోడ్డు భద్రత" అనే అంశంపై ప్రసంగించారు. సుమారు 1,000 మంది బ్లాక్ నైట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో కార్ పూలింగ్ ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందిందని, హైదరాబాద్ వెనకబడరాదని ఆయన పిలుపునిచ్చారు.
అడిషనల్ సీపీ ట్రాఫిక్ తన ప్రసంగంలో పేర్కొన్న ముఖ్య అంశాలు:
ఒకే ప్రాంతంలో నివసించే ఉద్యోగులు ఒకే వాహనంలో ప్రయాణించడం ద్వారా ఇంధనాన్ని, సమయాన్ని ఆదా చేయవచ్చు. దీనివల్ల గాలి మరియు శబ్ద కాలుష్యం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు పార్కింగ్ సమస్య కూడా తగ్గుతుంది. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే, భారతదేశంలోనే హైదరాబాద్‌ను ప్రమాద రహిత నగరంగా మార్చవచ్చు.

