
డిలిమిటేషన్ దెబ్బ మల్కాజ్‌గిరికే ఎక్కువా?
తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనతో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో భారీ మార్పులు సూచనలు. కొత్త సీట్లు, రాజకీయ ప్రభావంపై చర్చ.
డిలిమిటేషన్.. ప్రస్తుతం దేశమంతా చర్చిస్తున్న అంశం ఇది. ఈ విషయంలో దక్షిణ రాష్ట్రాలన్నీ ఒకటే స్వరం వినిపిస్తున్నాయి. వీటిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తన వ్యతిరేక స్వరాన్ని మరింత గట్టిగా వినిపిస్తున్నారు. అంతేకాకుండా కేంద్రానికి పలు కీలక సూచనలు కూడా చేశారు. డిలిమిటేషన్‌ను హైబ్రిడ్ పద్దతిలో చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే అసలు డిలిమిటేషన్ ప్రభావం తెలంగాణ జిల్లాలపై ఎంత ప్రభావం చూపుతుంది? అన్న అంశం కీలకంగా మారింది. కాగా ఈ డిలిమిటేషన్ దెబ్బ అన్ని జిల్లాలకన్నా మల్కాజ్‌గిరికే ఎక్కువ అని తెలుస్తోంది. దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా గుర్తింపు పొందిన మల్కాజిగిరి.. ఈ డిలిమిటేషన్‌తో తన అగ్రస్థానాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ప్రతిపాదిత డిలిమిటేషన్ ప్రక్రియతో ఈ నియోజకవర్గ పరిమాణం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తాజా అంచనాలు సూచిస్తున్నాయి.
ప్రస్తుతం 37 లక్షలకుపైగా ఓటర్లతో మల్కాజిగిరి అగ్రస్థానంలో ఉంది. గాజియాబాద్, బెంగళూరు నార్త్, ఉన్నావో, నార్త్‌వెస్ట్ ఢిల్లీ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. అయితే కొత్త పునర్విభజనతో ఈ సమీకరణాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రో ప్రాంతంలోని సికింద్రాబాద్, హైదరాబాద్, చెవెళ్ల నియోజకవర్గాలు కూడా చిన్నవయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భోంగిర్, మహబూబ్‌నగర్ వంటి సమీప ప్రాంతాల్లో కూడా మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో 3 నుంచి 4 కొత్త లోక్‌సభ స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది.
ఇదే సమయంలో తెలంగాణలో రాజకీయ ప్రాతినిధ్యం పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కి పెరిగే అవకాశం ఉందని సమాచారం. అసెంబ్లీ స్థానాలు కూడా 119 నుంచి 179కి పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రత్యేకంగా పాత రంగారెడ్డి జిల్లా ఎక్కువ మార్పులకు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, వలస జనాభా, కొత్త కాలనీల విస్తరణ కారణంగా గత రెండు దశాబ్దాల్లో జనాభా భారీగా పెరిగినట్లు సమాచారం.
ప్రస్తుతం మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ కాంటోన్మెంట్, మేడ్చల్, కూకట్పల్లి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్లో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, వాటిలో మార్పులు జరిగితే మొత్తం సమీకరణం మారే అవకాశం ఉంది. సీట్ల పునర్విభజనలో జనాభా కీలక పాత్ర పోషించనుంది. అధిక జనాభా ఉన్న జిల్లాలకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉందని ఒక బీఆర్ఎస్ నేత అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 52 లక్షల జనాభా ఉండగా, మహబూబ్‌నగర్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలు తదుపరి స్థానాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా, హైదరాబాద్‌కు 15 ఉన్నాయి. కరీంనగర్‌కు 13, నల్గొండకు 12 స్థానాలు ఉన్నాయి. కొత్తగా పెరగనున్న 60 అసెంబ్లీ స్థానాల్లో సుమారు 9 స్థానాలు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉందని అంచనా. అయితే ఈ మార్పులపై రాజకీయ పార్టీలలో ఆందోళన వ్యక్తమవుతోంది. నియోజకవర్గాల సరిహద్దులు మారితే ప్రస్తుత రాజకీయ సమీకరణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు. ఓటర్ల గణాంకాల్లో మార్పులు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.
అలాగే గత డిలిమిటేషన్లో ఉన్న లోపాలను సరిదిద్దాలని కొందరు నేతలు సూచించారు. సికింద్రాబాద్ కాంటోన్మెంట్ హైదరాబాద్ జిల్లాలో ఉన్నప్పటికీ మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో ఉండటం, జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ పరిధిలో ఉండటం వంటి అసంగతాలను సవరించాలని వారు కోరారు. మొత్తానికి, డిలిమిటేషన్ ప్రక్రియతో తెలంగాణ రాజకీయ పటంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ మార్పులు ఎలా రూపుదిద్దుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

