తెలంగాణలో బిజెపి ఆంధ్రోళ్లని ఆలింగనం చేసుకుంటుందా?
x
ప్రధాని మోదీతో, ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి వపన్ (ఫైట్ ఫోటో). ఈ ముగ్గురు తెలంగాలో చేతులు కలుపుతారా?

తెలంగాణలో బిజెపి ఆంధ్రోళ్లని ఆలింగనం చేసుకుంటుందా?

మోదీ, బాబు, పవన్ తెలంగాణలో చేతులు కలుపుతారా? ఆంధ్రా నేతలను ప్రధాని మోదీ నేడు తెలంగాణ గడ్డమీద కలుసుకుంటున్నారు.


ఇక బిజెపి లక్ష్యం తెలంగాణయే అనే మాట సర్వత్రా వినబడుతూ ఉంది. జాతీయ మీడియా ఈ విషయాన్ని బాగా ప్రచారం చేస్తున్నది. కేరళ, తమిళనాడులో ఓడిపోయినా, తెలంగాణలో విజయం సాధించి దక్షిణ భారతదేశంలో తమకూడ పట్టు ఉందని నిరూపించేందుకు ప్రధాని నరేంద్ర లక్ష్యంగా పెట్టుకున్నారని అంటున్నారు.

ఇలాంటి లక్ష్యం ఒకటి పెట్టుకుని పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ను తరిమేసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇలాంటి తెలంగాణ లో ఎందుకు సాధ్యం కాదని బిజెపి నేతల్లో ధీమా కనబడుతుంది. మల్కాజ్ గిరి లోక్ సభ సభ్యుడు ఈటెల రాజేందర్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. శనివారం నాడు ఒక సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తెస్తారు అన్ని చెప్పారు. “దేశంలో22 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. 23 వ రాష్ట్రం తెలంగాణ గెలవబోతుంది. ప్రధాని మోదీ గారికి అండగా నిలవాలని కోరుతున్నాను,” అని పిలుపునిచ్చారు. ఇదే ఉత్సాహం పార్టీ నేతల్లో కనబడుతుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత తమ దగ్గిర ఏమీ లేకపోయినా ఢిల్లీ నాయకత్వం తలుచుకుంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనే విశ్వాసం పార్టీ నేతల్లో కనబడుతుంది. ఇదే విశ్వాసం కేంద్ర నాయకత్వంలో ఉంది. దీనికోసం వ్యూహ రచన చేస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. మే 10 నాటి ప్రధాన పర్యటనలో దీనికి సూచనలు కనిపిస్తున్నాయి.

ఆదివారం నాడు హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా ప్రధాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ లను కలుస్తున్నారు. దీనికోసం వారి నివాసాలకు వెళ్లనున్నారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి మధ్యాహ్నం తర్వాత 4.40 గంటలకు చేరుకుంటారు. ఈ సమావేశం రాజకీయవర్గాల్లో ఆసక్తిని పెంచింది. ఇది 2028 నాటి ఎన్నికల్లో ఎదురుకానున్న ఒక రాజకీయ పరిణామానికి సంకేతంగా బిజెపి నేతలుచెబుతున్నారు. ఇపుడు తెలంగాణలో టిడిపి బలపడేందుకు బిజెపి సహకరించడం లేదు. తెలంగాణ ప్రాంతీయ రాజకీయాల కారణంగా తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజలు ఆంధ్రా పార్టీగానే చూస్తున్నారు. అసలు తెలంగాణ ఉద్యమం మొదలయ్యేందుకు చంద్రబాబే కారణమని అందరికి తెలుసు. ఇలాంటపుడు తెలంగాణలో టిడిపి పున:ప్రారంభమయ్యేందుకు బిజెపి ఎందుకు సహకరిస్తుంది? ఇటీవల జరిగిన జూబిలీ హిల్స్ ఉప ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకుని బిజెపి ఆంధ్రా సెటిలర్స్ ఓట్లు పొంది వుండవచ్చు. అయితే, పొత్తు ప్రమాదమని భావించి టిడిపి జోలికి వెళ్లలేదు. బిజెపి అభ్యర్థికి డిపాజిట్ పోయింది.

ఇపుడు తెలంగాణ యే 2028 లక్ష్యం అనుకున్నపుడు వ్యూహం మార్చాల్సి ఉంటుంది. తెలంగాణ నేతల మనస్సులో టిడిపి అంటే ఉన్న వైముఖ్యాన్ని పోగొట్టాలి. ఎందుకంటే బిజెపి నాయకులు చీటికి మాటికి ఎవ్వరితో పొత్తు ఉండదు అని ప్రకటిస్తున్నారు. 2028 ఎన్నికల్లో గెలవాలంటే అందరి సాయం అవసరం. ప్రత్యక్షంగానో పరోక్షంగానో టిడిపి, జనసేనల సాయం కూడా అవసరమవుతుంది. ఈ బంధానికి బాటవేసేందుకే ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లను కలుస్తున్నారనిపిస్తుంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు పదవుల్లో ఉన్నది ఆంధ్రా లోనే అయినా, వాళ్ల నివాసాలుంటున్నది హైదరాబాద్ లోనే. గతంలో ఎపుడూ ప్రధాని వాళ్లని తెలంగాణ గడ్డ మీద కలుసుకునే ప్రయత్నం చేయలేదు. పవన్ కల్యాణ్ ని ఆరోగ్యం పేరుతో కలుసుకున్నా, చంద్రబాబుని తెలంగాణలో కలుసుకోవడం విశేషం. ఇది ఒక రాజకీయ సంకేతమే.

తెలంగాణలో ఎన్ డి ఎ ఫుడుతుందా?

తెలంగాణలో కాపులు బాగానే ఉన్నారు. కాపుల్లో పవన్ కల్యాణ్ మీద చాలా గౌరవం ఉంది. ఆయన మీద ఈగ వాలనీయరు. ఇక చంద్రబాబు తెలంగాణలో ఇంకా బలమున్న వాడే. పెద్ద సంఖ్యలో కమ్మ సెటిలర్స్ ఉన్నారు. చంద్రబాబు పాలనలో లబ్దిపొందిన వారిలో, బిసిలలో చంద్రబాబు అభిమానులున్నారు. తెలంగాణ వచ్చాక కెసిఆర్ విధానాలు బిసిలకు నచ్చలేదు. దానితో బిసిలు ఆయన మీద అసంతృప్తితోనే ఉండేవారు. “టిడిపి లేకపోవడంతో వాళ్లు మెల్లిగా బిజెపి వైపు మొగ్గుచూపుతున్నారు. ఇది ఉత్తర తెలంగాణలో బాగా జరుగుతున్నది. పద్మశాలి వంటి కులాలు బిజెపికి అండగా మారుతున్నాయి,” అని పద్మశాలి కుల సంఘానికి చెంది ఏలే సుకుమార్ చెప్పారు. ఆంధ్రాలో పద్మశాలీయులకు చంద్రబాబు ఎలాంటి గుర్తింపు ఇచ్చారో ఒక సారి చూడండి అని ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న సుకుమార్ చెప్పారు.

ఇదే పరిస్థితి కాపుల్లోనూ కనబడుతుంది. పవన్ కల్యాణ్ ఒక పిలుపు ఇస్తే, చాలా మంది కాపులు బిజెపికి మద్దతు ఇస్తారు. కమ్మలు సరే సరి. ఈ ఓట్లన్నింటిని బిజెపి వైపు తిప్పుకోవాలంటే తెలంగాణలో కూడా ఎన్ డి ఎ అవసరమవుతుంది. ఇది సాధ్యమా? తెలంగాణ బిజెపిలో చాలా మందికి ఈ రెండు ఆంధ్రా పార్టీలతో కలవడం ఇష్టం లేదు, “2018 లో చంద్రబాబు కాంగ్రెస్ తో కలసి తెలంగాణ లో పోటీ చేసినపుడు బిఆర్ ఎస్ దాన్ని ఒక రాజకీయాస్త్రంగా వాడుకుంది. చంద్రబాబు దొడ్డిదారిని తెలంగాణలో దూరేందుకు ప్రయత్నిస్తున్నాడు. తరిమిమేయండఅని కెసిఆర్ క్యాంపెయిన్ చేశారు. దాన్ని జనం విన్నారు. కన్విన్సి అయ్యారు. కూటమిని తరిమేశారు. ఈ విషయం మర్చిపోరాదు," బిజెపి నాయకుడొకరు చెప్పారు.

తెలంగాణలో కాలుమోపలేకపోవడం చంద్రబాబు భరించలేకపోతున్నారు. ఎందుకంటే, నిగనిగలాడుతున్న హైటెక్ తెలంగాణని కట్టింది నేనే అని ఆయన నమ్మకం. అందుకే ఏదో విధంగా తెలంగాణ అసెంబ్లీలో కాలుమోపాలన్నది ఆయన ఆకాంక్ష.

" ఈ కారణంతోనే అప్పటి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) ను ఓడించే ఉద్దేశంతో 2018లో అంతో ఇంతో బలమున్న కాంగ్రెస్ తో పాటు సీపీఐ, తెలంగాణ జనసమితి (TJS)లను కలుపుకుని మహాకూటమి ఏర్పాటు చేశారు. కూటమి దారుణంగా ఓడిపోయింది. ఇపుడు బిజెపి చంద్రబాబు కలిస్తే మళ్లీ ఇదే విమర్శవస్తుంది,”అని ఆయన వ్యాఖ్యానించారు. అందువల్ల నేరుగా ఇక్కడ ఎన్ డిఎ ఏర్పాటు కాకపోవచ్చని చెబుతూ ఇతర మార్గాలలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల సాయం తీసుకోవచ్చునని ఆయన అన్నారు.

టిడిపి అవసరం

పాత హైదరాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ పెద్దసంఖ్యలో అభిమానులున్నారు. నిజానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రా నుంచి హైదరాబాద్ రావడం ఎక్కువయింది. అక్కడ రాజధాని లేకపోవడం, రాజకీయాలు రచ్చరచ్చగా వుండటంతో, ఉద్యోగాలకోసం చదవుకున్నోళ్లు, ఉపాధి కోసం నిరుద్యోగులు హైదరాబాద్ కు పరుగుపెడుతున్నారు. నేషనల్ శాంపిల్ సర్వే (National Sample Survey Office:NSSO)డేటా ప్రకారం హైదరాబాద్ ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు. రెండు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాదే ఆర్థిక రాజధాని. సామాజికంగా వెనకబడిన ఎస్ సి, ఎస్టీ, బిసిల వాళ్లు పెద్ద ఎత్తున హైదరాబాద్ కు వస్తున్నారు. 15-59 సంవత్సరాల మధ్య వయసున్న వారు పెద్ద సంఖ్యలోహైదరాబాద్ కు వస్తున్నారు. వీళ్లుంతా ఎవరు, పనిచేయ శక్తి ఉన్నవాళ్లు. ఈ విషయాన్ని 2026 లో జరిగిన ఒక అధ్యయనం (Intra-state Migration Patterns Across Agro-climatic Zones in Telangana) లో తేలింది. రాయలసీమ, కోస్తాంధ్రా నుంచి వచ్చే వారి సంఖ్య బాగా ఉంది. చాలా అధ్యయనాలలో ఈ విషయం బటయపడింది. అమరాతికిగాని, విశాఖకుగాని ఇలాంటి ఆకర్షణ లేదు. హైదరాబాద్ వలస వస్తున్న ఎస్సి, ఎస్టీ, బిసిలు తమతో పాటు ప్రాంతీయ, కుల, రాజకీయ ఐడెంటిని కూడా తెచ్చుకుంటారు. ఇలాంటి ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నపుడు వాళ్లని ప్రభావితం చేయడం చాలా అవసరం. ఆంధ్రా నుంచి వస్తున్న బిసిలలో టిడిపి అభిమానులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీళ్లు ఇక్కడ ఓటర్లు అయినపుడు వాళ్లని ప్రభావితం చేయాల్సిన అవసరం ఉంటంది.దానికి బిజెపి వాళ్లు చంద్రబాబు, పవన్ లు అవసరమవుతారు. వాళ్లుని దూరంగా ఉంచడం నష్టమే. అది జూబిలీ హిల్స్ ఉప ఎన్నికలో కనిపించింది.

ఇలాగే పవన్ కల్యాణ్ కు సినిమా ఫ్యాన్స్ ఉన్నారు. కుల ఓటర్లు ఉన్నారు. 2029 ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారంలోకి రావాలనుకున్నపుడు ఈ ఓట్లను ఆకట్టుకునే బలమయిన సందేశం పంపాలి. ఈ రోజు ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను కలవడం ఇలాంటి సందేశం పంపడానికే అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ స్నేహం ఒక షేప్ తీసుకోవాలంటే వచ్చే జిహెచ్ ఎంసి ఎన్నికల్లో బిజెపి గెలవాలి. ఆ గెలుపు తెలంగాణలో కూడా ఎన్ డిఎ ఏర్పాటుకు బాటవేయచ్చని టిడిపి అభిమాని ఒకరు చెప్పారు.

“ జిహెచ్ ఎంసి ఏరియాలో చాలా మంది ఆంధ్రా సెటిలర్స్ ఉన్నారు. ముఖ్యంగా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్‌, రాజేంద్రనగర్‌, జూబ్లీహిల్స్‌ తదితర నియోజకవర్గాల్లో వీళ్ల సంఖ్య బాగా ఎక్కువ. కాలనీలకు కాలనీలు వాళ్ల చేతిలో ఉన్నాయి. ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లు జిహెచ్ ఎంసి ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించగలవు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మూడు పార్టీలు సహకరించుకుని జిహెచ్ ఎంసి కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలిస్తే, ఈ పార్టీల మీద ఉన్న ఆంధ్రా పార్టీ మచ్చ తుడుచుకుపోయనట్లే అని ఆయన చెప్పారు. హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఎన్ డిఎ ఏర్పాటు సాధ్యాసాధ్యాలు తేలవచ్చని ఆయన చెప్పారు. ఎందుకంటే, ఆంధ్రాపార్టీలు మళ్లీ వస్తున్నాయనే విమర్శకు తావులేకుండా చేయాలి అని ఆయన అన్నారు.


Read More
Next Story