
ప్రధాని మోదీ పర్యటన తెలంగాణ బిజెపిని ఉత్తేజపరుస్తుందా?
మూడోసారి ప్రధాని అయ్యాక మోడీ రావడం ఇదే ప్రథమం, ఫలితముంటుందా?
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 10వ తేదీన తెలంగాణ హైదరాబాదులో పర్యటించనున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామ్ చందర్ రావు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారి ప్రధాని పర్యటించనున్నారు. దీంతో కాషాయం పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తుంది. కాషాయం పార్టీ శ్రేణులు మోదీని స్వాగతించడానికి ఏర్పాట్లు చేశాయి. ఇప్పటికే హైదరాబాదులో బ్యానర్లు వెలిశాయి.
అయితే, బిజెపికి అనేక ఎదురు దెబ్బలు తగిలిన నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన జరుగుతూ ఉంది. మూడు సార్లు శాసన సభ్యుడిగా గెలిచిన ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. హైదరాబాద్ నుంచి గెలిచిన బీజెపి శాసనసభ్యుడు ఆయన ఒక్కరే. ఇది మొదటి ఎదురు దెబ్బ. ఇక రెండో విషయానికి వస్తే జూబిలీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్ సభ ఎన్నికల్లో ఊహించిన దాని కంటే గొప్పగా పని చేసిన బిజెపి ఈ ఉప ఎన్నికల్లో చతికిల పడటం అందరినీ ఆశ్చర్యపరింది. ఇది కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ. ఎందుకంటే ఆయన ప్రాతినిధ్యం వహించే సికిందరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఈ స్థానంలో పార్టీ డిపాజిట్ కోల్పోయింది. ఇక మూడో దెబ్బ పంచాయతీ ఎన్నికల్లో కూడా బిజెపి మూడో స్థానంలోకి పడిపోయింది. ఇక నాలుగో ఎదురుదెబ్బ 2026 ఫిబ్రవరిలో జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మూడో స్థానానికి పరిమితమైంది. దానికి తోడు బిజెపి నాయకుల మధ్య సఖ్యత లేదు. తెలంగాణా బిజెపి లో ఏంజరుగుతుందో ప్రధాని దాకా వెళ్లినట్లు, ప్రధాని స్వయంగా అసంతృప్తివ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.
జిహెచ్ ఎంసి ఎన్నికల భయం
తొందరలో జిహెచ్ ఎంసి ఏరియా కార్పొరేషన్ లలో ఎన్నికల జరగాల్సి ఉంది. కాంగ్రెస్ కార్పొరేషన్లంటికి కైవసం చేసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ గట్టిగా కృషి చేస్తున్నారు. కాంగ్రెస్, ఎంఐఎం దగ్గరయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో బిఆర్ ఎస్ పట్టు సడిలినట్లు లేదు.
గతలోక్ సభ ఎన్నికల తర్వాత బిజెపికి ఏదైనా అనుకూలమయిన పరిణామం ఉందా అంటే అది ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికయే. తెలంగాణలో మార్చి 2025లో జరిగిన ప్రతిష్టాత్మక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానంతో పాటు టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుని పార్టీ బలాన్ని చాటుకుంది. మొత్తానికి బిజెపి బలపడుతున్నట్లు చెప్పే పరిణామలేవీ ఈ మధ్య జరగలేదు.
ప్రధాని పర్యటన
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన జరుగుతూ ఉంది. రాజాసింగ్ కి బీజెపి లో బ్రాండ్ ఇమేజ్ ఉండేది. ప్రధానితో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పుకునే వారు. అయితే, రాజాసింగ్ కమలం పార్టీకి ప్రస్తుతం దూరమయ్యారు. ఒకవేళ ఆయన బీజెపి లో ఉంటే పరిస్థితి హైదరాబాద్ లో మంచికో చెడుకో సందడి ఉండేది . తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రామ్ చందర్ రావుతో పోటీపడి రాజాసింగ్ భంగ పడ్డారు. రాజాసింగ్ లేని లోటును పూడ్చడానికి రామ్ చందర్ రావు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కాని పరిస్థితులు ఇంకా అనుకూలించడం లేదు.
పదేళ్లు అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారం చేజిక్కించుకుంది. గత ఎన్నికల్లో నరేంద్ర మోడీ స్వయంగా తెలంగాణలో ప్రచారం చేశారు. బీజీపీ అధికారంలో రానుందని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని చతికిల పడింది. ఎన్నికల తర్వాత తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP) నూతన అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు జూలై 1, 2025 న ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో పార్టీ పనితీరు ఆశించినంత లేదు. కనీసం వచ్చే మునిసిపల్ ఎన్నికల్లో నైనా రామ్ చందర్ రావు తన సత్తా నిరూపించుకోవాల్సి ఉంది.
8 వేల కోట్ల ప్రాజెక్టులకు శంఖు స్థాపన
ఈ నెల 10న నరేంద్ర మోడీ దాదాపు 8 వేల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మోడీ తెలంగాణ అభివృద్ధికి పెద్ద పీట వేయనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. పార్లమెంటు ఎన్నిక ల తర్వాత మోడీ మూడోసారి ప్రధాని బాధ్యతలు స్వీకరించాక మొదటి సారి తెలంగాణకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల తర్వాత బీజేపీ మరింత బలోపేతమైంది. దాదాపు 40 లక్షల ఓటర్లు బీజేపీ లో చేరినట్టు సమాచారం. ఇదంతా బిజెపి వోట్ గా మారేందుకు ప్రధాని మోదీ పర్యటన పనికొస్తుందా అనేది ప్రశ్న.

