పులుల కోసం మమ్మల్ని తరిమేస్తున్నారు?
x
అమ్రాబాద్ అడవిలో నివాసముంటున్న చెంచులు : మేం అడవి వదిలి వెళ్లం

పులుల కోసం మమ్మల్ని తరిమేస్తున్నారు?

అమ్రాబాద్ చెంచుల ఆవేదన, పునరావాసానికి చెంచుల ‘నో’, ప్రభుత్వానికి సవాల్


తరతరాలుగా అడవిని ఆశ్రయంగా చేసుకుని జీవిస్తున్న చెంచు గిరిజనుల జీవన హక్కులు, వన్యప్రాణి సంరక్షణ మధ్య సంఘర్షణ మళ్లీ వెలుగులోకి వచ్చింది. అమ్రాబాద్ అటవీ ప్రాంతంలోని చెంచు గిరిజనులు తమ పూర్వీకుల నివాసాలను వదిలి వెళ్లాలని ప్రభుత్వ ప్రతిపాదనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “పులులతో కలిసి జీవించడం మా జీవన విధానం… ఇప్పుడు వాటి కోసం మమ్మల్ని అడవి నుంచి పంపిస్తే మా బతుకు ఎలా?” అంటూ వారు హైదరాబాద్‌లో ప్రజావాణి వేదికగా తమ గోడును వెళ్లగక్కడం సమస్య తీవ్రతను స్పష్టం చేస్తోంది.

‘‘మేం తరతరాలుగా అమ్రాబాద్ అడవిలోనే పులులతో కలిసి జీవనం గడుపుతున్నాం...ఇప్పుడు పులుల కోసం మేం అడవిని వదిలి మైదాన ప్రాంతానికి రమ్మంటే ఎలా? అడవి నుంచి బయటకు వచ్చి మేమెలా జీవిస్తాం’’అని అమ్రాబాద్ అటవీ ప్రాంత గ్రామాల చెంచులు ఆవేదనగా ప్రశ్నించారు. రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో అమ్రాబాద్ అటవీ గ్రామాల చెంచులు హైదరాబాద్ నగరంలోని జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో సీఎం ప్రజావాణికి తరలివచ్చి వారి గోడు వెళ్లబోసుకున్నారు.

ఏడు అటవీ గ్రామాల తరలింపునకు సన్నాహాలు

అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో ఉన్న ఏడు గిరిజనుల గ్రామాలను మైదాన ప్రాంతానికి తరలించాలని తెలంగాణ అటవీశాఖ నిర్ణయించిన నేపథ్యంలో చెంచులు హైదరాబాద్ నగరానికి వచ్చి ప్రజావాణి ఇన్ చార్జి డాక్టర్ జి చిన్నారెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు.అమ్రాబాద్ అడవిలోని సార్లపల్లి, కుడిచింతల బైలు, తాటిగుండాల పెంట, కొల్లంపెంట, వటవరపల్లి, ఫర్హాబాద్ పెంట, కొమ్మనపెంట గ్రామాల్లో నివాసముంటున్న గిరిజనులను పెద్దకొత్తపల్లి మండలం బాచారం ప్రాంతానికి తరలించాలని అమ్రాబాద్ అభయారణ్యం ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ సునీల్ హీరేమత్ ప్రతిపాదనలు రూపొందించి పునరావాస ప్రాజెక్టు చేపట్టారు.
రెండు దశల వారీగా చెంచు కుటుంబాలను అడవి నుంచి తరలించి వారికి భూమితోపాటు పునరావాసం కల్పించాలని ప్రతిపాదించారు. అటవీ గ్రామాల గిరిజనులకు పునరావాసం కింద ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పరిహారాన్ని కూడా ఇటీవల పంపిణీ చేశారు.

గిరిజనుల పునరావాసానికి చెక్కుల పంపిణీ

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నివసిస్తున్న గిరిజన కుటుంబాల అభివృద్ధి, అటవీ, వన్యప్రాణి సంరక్షణను సమన్వయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోని గిరిజన గ్రామాలకు చెందిన కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.ఇందులో భాగంగా మొదటి దశలో నాలుగు గ్రామాలకు చెందిన మొత్తం 417 కుటుంబాలకు పునరావాసం కల్పించే దిశగా ముందడుగు పడింది.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సమక్షంలో 14 మంది గిరిజన కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు.
బాచారం వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీని అన్ని మౌలిక వసతులతో మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు.

అడవిలో పులులతోనే కలిసి జీవిస్తాం : చెంచులు

ఒక వైపు అమ్రాబాద్ అటవీ గ్రామాల తరలింపు పునరావాస ప్రాజెక్టును అటవీశాఖ అధికారులు అమలు చేస్తుండగా, మరో వైపు ఆయా గ్రామాల నివాసులైన చెంచులు తాము వందల ఏళ్ల నుంచి అటవీ గ్రామాల్లోనే నివాసం ఉంటున్నామని, పులుల కోసం తమ గ్రామాలను ఖాళీ చేయించి మైదాన ప్రాంతానికి తరలిస్తే తామెలా జీవనం సాగిస్తామని చెందులు ప్రశ్నించారు. తాము పులులతో కలిసి జీవించడానికి అలవాటు పడ్డామని, తమను అడవి బయటకు తీసుకువస్తే తమ జీవనోపాధి ఎలా అని చెంచులు ఆవేదనగా ప్రశ్నించారు. అడవిలోని తమ గ్రామాలను ఖాళీ చేయించవద్దని, తమకు పునరావాసం అక్కరలేదని సార్లపల్లి, కొమ్మనపెంట గ్రామాల చెంచులు మల్లికార్జున్ , మండ్లి చిట్టెమ్మ, చిగురుల నాగమ్మ, కుడుముల తిరుపతయ్యలు చెప్పారు.

అడవి వదిలి వెళ్లం...

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నివసిస్తున్న చెంచు గిరిజనులు ఫారెస్టు కోర్ ఏరియా నుంచి తరలించడానికి అటవీ శాఖ చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకించారు. సవాళ్లు ఎదురైనా తాము అడవుల్లోనే నివసిస్తామని వారు తెలిపారు.‘‘మేం ఎలాంటి పరిస్థితుల్లోనైనా అడవిలో జీవించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ కొత్త ప్రదేశాలకు తరలి వెళ్లం’’ అని వారు పేర్కొన్నారు.
సార్లపల్లి, కుడిచింతల బైలు, తాటిగుండాల పెంట, కొల్లంపెంట, వటవరపల్లి, ఫర్హాబాద్ పెంట, కొమ్మనపెంట కుగ్రామాల చెంచు ప్రతినిధులు మల్లికార్జున్ , మండ్లి చిట్టెమ్మ, చిగురుల నాగమ్మ, కుడుముల తిరుపతయ్యలు తమను ఖాళీ చేయించవద్దని అధికారులను కోరారు.

బలవంతంగా ఖాళీ చేయించం : డాక్టర్ జి చిన్నారెడ్డి

అమ్రాబాద్ అభయారణ్యం నుంచి చెంచులను బలవంతంగా ఖాళీ చేయించమని ప్రజావాణి ఇన్ చార్జి డాక్టర్ జి చిన్నారెడ్డి హామి ఇచ్చారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్ చంద్రతో చిన్నారెడ్డి ఫోన్ లో మాట్లాడి చెంచుల అభీష్టం ప్రకారం నడుచుకోవాలని సూచించారు.

చెంచుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వారి నిర్ణయం ప్రకారం వారిని అడవిలోనే ఉంచుతామని చిన్నారెడ్డి చెప్పారు.
పునరావాసం పేరుతో ఆర్థిక సహాయం అందిస్తున్నప్పటికీ, తమ సంస్కృతి, జీవన విధానాన్ని కోల్పోవడానికి చెంచులు సిద్ధంగా లేరు. అభివృద్ధి, సంరక్షణ మధ్య సంతులనం ఎలా సాధించాలనే ప్రశ్న ఇక్కడ ప్రధానంగా నిలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలు ఒకవైపు ఉండగా, గిరిజనుల ఆత్మగౌరవం, జీవన హక్కులు మరోవైపు నిలిచిన ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read More
Next Story