
ఇల్లు మారితే ‘సర్’ లో ఓటు పోయినట్లేనా ? (వీడియో)
నిజానికి ఇల్లు మారినంత మాత్రాన ఓటు హక్కు ఎక్కడికీ పోదు.
స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ లో మొదలైనప్పటినుండి ఇదే ప్రశ్న లేదా ఇలాంటి ప్రశ్నలే జనాలను పట్టి పీడిస్తున్నాయి. తెలంగాణలో ఎస్ఐఆర్ ఈనెల 25వ తేదీనుండి మొదలైంది. రాష్ట్రంలోని సుమారు 36 వేల పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్ల మ్యాపింగ్, ఎన్యుమరేషన్ ప్రక్రియ మొదలైంది. కొన్నిచోట్ల ఎన్యుమరేషన్ ఫారాలు అందని కారణంగా ఇంకా మొదలుకాలేదంతే. అయితే ఇపుడు జనాలందరి మదిలోని ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ఇల్లు మారితే ఓటు హక్కు పోతుందా ? అని. నిజానికి ఇల్లు మారినంత మాత్రాన ఓటు హక్కు ఎక్కడికీ పోదు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టమైన గైడ్ లైన్స్ జారీచేసింది. అయితే ఆ గైడ్ లైన్సును బీఎల్వోలు, సర్ ప్రక్రియలో పాల్గొంటున్న అధికారులు సక్రమంగా ఎంతమంది పాటిస్తున్నారు ? అన్నదే అసలైన పాయింట్.
ఇక విషయానికి వస్తే ఎంతోమంది ఒక చోట నుండి మరొకచోటకు ఇల్లు మారిపోతుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. కొంతమంది ఒక అద్దె ఇంటినుండి మరొక అద్దె ఇంటికి మారుతుంటారు. మరికొందరు అద్దె ఇంటినుండి సొంత ఇంటికి మారుతుంటారు. ఎవరు ఏ విధంగా ఉంటున్న ఇంటినుండి మరొక ఇంటికి మారినా పర్వాలేదు ఓటైతే ఎక్కడికీ పోదు. అయితే ఓటు పోకూడదంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే పాత ఇంటినుండి మరొక ఇంటికి మారినపుడు ఇంటి యజమానికి వెంటనే ముందుగా చేసేది గ్యాస్ కనెక్షన్ మార్చుకోవటం. తర్వాత కరెంట్ బిల్లు, బ్యాంకు పాస్ పుస్తకాల్లో అడ్రస్సులు మార్పించుకోవటం. ఆ తర్వాత ఆధార్ కార్డులోని అడ్రస్ కూడా మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు.
సర్ ప్రక్రియలో బీఎల్వో, అధికారులు ఇంటికి వచ్చినపుడు పాత ఇంటి అడ్రస్ ప్రకారం తాము ఓట్లేసిన వివరాలను చెప్పాలి. ఓటర్ కార్డును చూపించాలి. అలాగే కొత్త అడ్రస్ లో తాము మార్చుకున్న గ్యాస్ కనెక్షన్ అడ్రస్ లేదా ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ లాంటి ఏదో ఒక అడ్రస్ ప్రూఫ్ అయితే చూపించాల్సుంటంది. ఏ ప్రూఫూ చూపించకుండా కొత్త అడ్రస్ లో ఓటు కావాలంటే కుదరదు. ప్రూఫులు ఏవీ లేకపోయినా కనీసం తాము ఉంటున్న అద్దె ఇంటి యజమాని నుండైనా ఒక ప్రూఫ్ తెప్పించుకోవాలి. తన ఇంట్లో సదరు కుటుంబం ఎంతకాలంగా అద్దెకు ఉంటున్నారనే విషయాన్ని అయినా ఇంటి యజమాని నుండి డిక్లరేషన్ గా చూపించాలి. పైన చెప్పిన ఆధారాల్లో ఏ ఒక్కదాన్ని చూపించినా చాలు కొత్త అడ్రస్ లో అధికారులు ఓటును నమోదుచేస్తారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన ఓటు హక్కును ఎవరూ తీసేయలేరు.

