దశాబ్దాల కలకు రెక్కలు:ఆదిలాబాద్ విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్
x
ఆదిలాబాద్ కు త్వరలో విమాన యోగం

దశాబ్దాల కలకు రెక్కలు:ఆదిలాబాద్ విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్

ఉత్తర తెలంగాణకు గేట్‌వే,ఉత్తర తెలంగాణ కల త్వరలో సాకారం..


ఉత్తర తెలంగాణ ప్రజల దశాబ్దాల నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసే విమానాశ్రయ ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో శరవేగంగా ముందుకు సాగుతున్న ఈ ప్రాజెక్టుకు త్వరలో శంకుస్థాపన జరగనుండటంతో జిల్లా ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు కొత్త ఊపు రానుంది.

తెలంగాణ రాష్ట్రంలో మారుమూల వెనుకబడిన జిల్లా అయిన ఆదిలాబాద్ లో ప్రయాణికులకు ఆకాశయానం త్వరలో అందుబాటులోకి రానుంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి చొరవతో ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా పట్టాలెక్కుతున్నాయి.తెలంగాణకు చెందిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మంగళవారం సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు తో కలిసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను కలిశారు. తెలంగాణలోని ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించిన అంశాలను, దీని అమలు, అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. ఈ చర్చల్లో ఈ విమానాశ్రయానికి త్వరలో శంకుస్థాపన జరపాలని నిర్ణయించారు.ఇప్పటికే కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సాంకేతిక అంశాలను పరిశీలించారు. తెలంగాణ సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో ఉండటంతో ఇక్కడ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఏర్పాటుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దశాబ్దాల కలకు రెక్కలు..శరవేగంగా అడుగులు

ఆదిలాబాద్‌లో విమానాశ్రయ నిర్మాణానికి గత రెండేళ్లుగా వేగంగా కసరత్తు జరుగుతోంది. నిజాం కాలం నాటి ఎయిర్‌స్ట్రిప్‌ను ఆధారంగా చేసుకుని కొత్తగా సివిల్ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. రక్షణ శాఖ ప్రధాన ఎయిర్‌పోర్ట్ మౌలిక సదుపాయాలను, పౌర విమానయాన శాఖ సివిల్ ఎన్‌క్లేవ్‌ను అభివృద్ధి చేసే ప్రతిపాదన ఉంది.

విమానాశ్రయానికి భూసేకరణ

విమానాశ్రయం నిర్మాణానికి వీలుగా ఆదిలాబాద్ శివార్లలో భూసేకరణ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. మొదట 700 నుంచి 800 ఎకరాలు అవసరమని భావించినా, తాజా సర్వేల ప్రకారం 1,500 ఎకరాలకు పైగా భూమి అవసరమవుతుందని అధికారులు గుర్తించారు.మూతపడిన సీసీఐ భూములు, నిషాన్‌ఘాట్ పరిసర ప్రాంతాలను రక్షణ శాఖ, రెవెన్యూ అధికారులు ఉమ్మడిగా సర్వే చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్, కొత్తగూడెం ప్రాజెక్టులతో పాటు ఆదిలాబాద్ విమానాశ్రయ పనులను కూడా వేగవంతం చేయాలని అధికారులకు సూచించింది. ప్రయాణికుల సేవలతో పాటు వాయు కార్గో రవాణా, భారత వైమానిక దళం శిక్షణ కార్యకలాపాలకు కూడా అవకాశాలు కల్పించేలా ఈ విమానాశ్రయంలో ప్లాన్ చేస్తున్నారు.

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి (ఫొటో : ఎక్స్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పోస్టు)

ఎయిర్‌బస్ సేవలు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆదిలాబాద్ విమానాశ్రయ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఏడాది కాలంలోనే ఇక్కడి నుంచి ఎయిర్‌బస్ విమాన సేవలను ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

విమానాశ్రయం వల్ల ప్రయోజనాలు

ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తి అయితే ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం-ఆసిఫాబాద్ జిల్లాలకు విమాన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.పరిశ్రమలు, పర్యాటకం, వ్యాపార కార్యకలాపాలకు ఊతం లభించనుంది.ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, నాగ్‌పూర్ వంటి నగరాలకు భవిష్యత్తులో నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంటుంది.అలాగే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు కూడా మెరుగైన విమాన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.జిల్లాలోని కుంటాల, పొచ్చెర జలపాతాలు, కవ్వాల్ టైగర్ రిజర్వ్ వంటి పర్యాటక ప్రాంతాలకు జాతీయ గుర్తింపు లభించనుంది.స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి ఉత్తర తెలంగాణ ఆర్థిక రూపురేఖలు మారే అవకాశం ఉంది.
Read More
Next Story