త్వరలో తెలంగాణలో 1.74 లక్షల ఉద్యోగాలు
x
జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (:ఫొటో : ఎక్స్ పోస్టు)

త్వరలో తెలంగాణలో 1.74 లక్షల ఉద్యోగాలు

మే 10న జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి శంకుస్థాపన


తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడుతోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పరంగా కొత్త దిశను చూపనుంది. హైదరాబాద్–నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు, ఆధునిక మౌలిక వసతులతో తయారీ రంగానికి గట్టి బలం చేకూర్చేలా రూపకల్పన చేశారు.

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ చోదక శక్తిగా నిలవనుంది. జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ తయారీ రంగం, ఆర్థిక అభివృద్ధికి గణనీయమైన ఊపునిస్తుంది. 3,245 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పారిశ్రామిక స్మార్ట్ సిటీని రూ.2360.54 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో సమగ్ర కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు.

ఇండస్ట్రియల్ కారిడార్ ప్రత్యేకతలు

జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌ రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించే సామర్థ్యంతో పాటు 2029 నాటికి 1.74 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఏర్పాటు అవుతోంది. లాజిస్టిక్స్, ఆటో విడిభాగాలు, లోహేతర ఖనిజాలు, విద్యుత్, ఎలక్ట్రానిక్స్, యంత్ర పరికరాలు, లోహాలు, ఆహార శుద్ధి రంగాలపై దృష్టి సారించనున్నారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ మౌలిక సదుపాయాలు,సుస్థిర మరియు పర్యావరణ హిత అభివృద్ధి విధానాలు'ప్లగ్-అండ్-ప్లే' పారిశ్రామిక వసతులు కల్పించనున్నారు. నివాస, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, శిక్షణా సంస్థలతో కూడిన సమగ్ర పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

మే 10న మోదీ శంకుస్థాపన

జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ తెలంగాణలో తదుపరి తరం పారిశ్రామిక వృద్ధికి చోదకశక్తిగా నిలవనుందని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మంగళవారం ఎక్స్ పోస్టులో వెల్లడించారు. హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌లో వ్యూహాత్మక ప్రదేశంలో ఉన్న జహీరాబాద్ సమీకృత పారిశ్రామిక స్మార్ట్ సిటీ, భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఒక ప్రధాన తయారీ,లాజిస్టిక్స్ కేంద్రంగా మారడానికి సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.2360.54 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు మే 10న శంకుస్థాపన చేయనున్నారని కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు.
మొత్తంగా జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు తెలంగాణను దేశంలోని ప్రముఖ తయారీ, లాజిస్టిక్స్ కేంద్రంగా నిలబెట్టే సామర్థ్యం ఉంది. భారీ పెట్టుబడులను ఆకర్షించడం, లక్షలాది మందికి ఉపాధి కల్పించడం ద్వారా ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ప్రణాళికల ప్రకారం అమలు జరిగితే, ఇది రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి గేమ్‌చేంజర్‌గా నిలిచే అవకాశముంది.
Read More
Next Story