అసంతృప్తులు.. బుజ్జగింపులు
x

అసంతృప్తులు.. బుజ్జగింపులు

కాంగ్రెస్‌లో కొత్త లొల్లి!


BRS భారత్ రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పలువురు ఎమ్మెల్యేలు, తమకు హామీ ఇచ్చిన మంత్రివర్గ పదవులు రాకపోవడం, అలాగే తమ నియోజకవర్గాల్లో ప్రభావం పరిమితంగా ఉండటం వల్ల అసంతృప్తిగా ఉన్నారు. కొందరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బహిరంగంగా విమర్శిస్తుండగా, మరికొందరు తమ అసంతృప్తిని సున్నితంగా వ్యక్తం చేయడం ప్రారంభించారు.

1. పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో గూడెం మహిపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు ముందే యూటర్న్ తీసుకున్నారు. ఆయన సోదరుడు బీఆర్ఎస్‌లో చేరి పురపోరులో ఆ పార్టీ విజయానికి కృషి చేశారు. గూడెం మహిపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని పిలుపునివ్వడంతో పటాన్‌చెరులో మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఏకపక్ష విజయం సాధించింది.

2. ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో నిజంగా ప్రభుత్వం పనిచేస్తుందా అన్న ప్రశ్నను ఆయన లేవనెత్తడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆయనను వ్యవసాయ సలహాదారుడిగా ప్రభుత్వం నియమించినప్పటికీ, ఆ పదవి కేవలం అలంకారప్రాయంగా మారిందనే భావన వ్యక్తమవుతోంది. మంత్రిగా, స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ఆయనకు తన మాటకు ప్రాధాన్యం లేకపోవడం అసంతృప్తికి దారితీసింది.సిద్ధాపూర్ రిజర్వాయర్‌కు నిధుల విడుదల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం పోచారం అసహనానికి కారణమైంది. నిధుల కోసం మంత్రుల వద్ద పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఇప్పటివరకు సుమారు 20 సార్లు అడిగినా స్పందన రాలేదని ఆయన తెలిపారు. అంతేకాకుండా, ఇప్పుడు మంత్రులు తన ఫోన్ కాల్స్‌కూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ తనకు ఉపయోగం లేకపోతే కొనసాగడం అవసరమా అన్న ఆత్మపరిశీలనలో ఆయన ఉన్నారనే చర్చ నడుస్తోంది. అదే భావన కొనసాగితే, ఆయన మళ్లీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడం కేవలం విధివిధానాల విషయమే అవుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

3. పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రమే కాకుండా, పార్టీ మారిన పలువురు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరుగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వంటి వారు కూడా ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరకపోవడంపై ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరి రెండేళ్లు అవుతున్నా, తమకు ఇచ్చిన హామీలు అమలు కాలేదనే భావన వారిలో పెరుగుతోంది. ప్రధానంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్‌ను విడిచి కాంగ్రెస్‌లోకి వచ్చినప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఆలస్యం జరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ నేతల నుంచే ప్రారంభంలోనే వ్యతిరేకత ఎదురైంది. అయినప్పటికీ పరిస్థితులను ఓర్చుకుని పార్టీలో కొన‌సాగుతున్నారు. కానీ ఇప్పుడు వరుసగా అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో పూర్తిగా సెట్ కాలేకపోతున్నారు. అందుకే వారి వైఖరిలో మార్పు కనిపిస్తోంది.

4) మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా సి.ఎం.ను నేరుగా టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తూనే వున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు మరింత బహిర్గతమవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

5) మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి కూడా తమ ప్రాంతానికి అభివృద్ధి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం జరుగుతోందని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కొంత మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి మరింత స్పష్టంగా బయటపడుతోంది.

6) రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం దక్కకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేసినప్పటికీ, సీనియర్, జూనియర్‌లకు మంత్రి పదవులు దక్కలేదు. పి. సుదర్శన్ రెడ్డిని క్యాబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా నియమించడం ద్వారా విషయాన్ని ముగించినట్టైంది. దీంతో ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి లేకపోవడంతో ప్రభుత్వంలో ప్రభావం చూపే నాయకత్వం కొరవడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో తొలిసారి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి పి. సుదర్శన్ రెడ్డి, రేకులపల్లి భూపతి రెడ్డి, మదన్ మోహన్ రావు, లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యేలుగా గెలిచినా, వారికి తగిన ప్రాధాన్యం దక్కలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

7) హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల‌కు క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం లేదు. గ‌తంలో ఈ ప్రాంతం నుంచి ఐదారుగురు మంత్రులు ఉండేవార‌ని త‌న‌కు మంత్రి ప‌ద‌వి కావాల‌ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూనే వున్నారు.

8) రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ‌తంలో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాస్ లీడర్ కాదని పేర్కొంటూ, ఆయన స్థానంలో జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు సాధిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో ఆశ్చర్యంతో పాటు కలకలాన్ని రేపుతున్నాయి.

9) కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతులు ఎక్కువగా ఉన్న పార్టీగా భావిస్తారు. ఇందులో ప్రతి నేతకు తనదైన లాబీయింగ్ ఉండటం సహజం. ఢిల్లీ స్థాయిలో కూడా చాలామంది నేతలకు బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు కూడా సరైన సమయం కోసం వేచి చూస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

10) జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతలు క్రమంగా పార్టీ వ్యవహారాల నుంచి పక్కకు తప్పుకుంటున్నప్పటికీ, పలువురు అసంతృప్తి నేతలు మాత్రం తమకు భవిష్యత్తులోనూ పదవులు దక్కవన్న ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీలో అంతర్గత అసంతృప్తి మరింత పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన పరిపాలనా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, హైకమాండ్ వద్ద తన ప్రభావాన్ని పెంచుకుంటున్నప్పటికీ, పార్టీలోని సీనియర్ నేతలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఇంకా సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ రేవంత్ రెడ్డిదే పైచేయిగా కనిపిస్తోంది. ఢిల్లీ హైకమాండ్ వద్ద కూడా ఆయనకు బలమైన మద్దతు ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్ని రకాల ప్రచారాలు వచ్చినా, రేవంత్ రెడ్డి విషయంలో కేంద్ర నాయకత్వం పెద్దగా జోక్యం చేసుకోకుండా పరిశీలక ధోరణిలో వ్యవహరిస్తోంది.

Read More
Next Story