
అధికారంలోకి రాగానే ‘క్లీన్’ ఎలా అవుతున్నారు?
చంద్రబాబు నాయుడు, సిద్ధరామయ్యలకు క్లీన్ చిట్ ఇచ్చిన దర్యాప్తు సంస్థలు, కేసులు మూసివేసిన కోర్టులు
అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు ప్రత్యేక హక్కులు ఉంటాయి. వీవీఐపీ కాన్వాయ్ లు, భారీ బందోబస్తు, వారు వస్తున్న సందర్భంలో అధికార గణం వారికి సేవ చేయడంలో నిమగ్నమై ఉంటుంది. ఇది మనకు కొత్త కాదు. ఈ మధ్య ఇది మరో మెట్టు ఎక్కింది.
ప్రతిపక్షంగా ఉన్న సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కీలకనేతలు.. తిరిగి అధికారంలోకి రాగానే కేసుల నుంచి విముక్తి పొందుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏ దర్యాప్తు సంస్థలు వారిపై కేసులు పెట్టాయో.. వారు అధికారంలోకి రాగానే అవి దర్యాప్తు సంస్థలు వారిపై ఎలాంటి తప్పు చేయలేదని నివేదికలు సమర్పిస్తున్నాయి.
దీనితో కోర్టులు వారి మీద నమోదయిన కేసులను కొట్టివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థల స్వతంత్రతపై తీవ్ర సందేహాలు తలెత్తుతున్నాయి.
మొన్న ఈ మధ్య ఆంధ్రప్రదేశ్(AP), కర్ణాటక(Karnataka) రాష్ట్రాల్లో చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే పైన చెప్పిన విషయం నిజమని అర్థం అవుతుంది. ఆంధ్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) పై గతంలో నమోదయిన మూడు కేసులు మూసివేశారు.
జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబునాయుడిపై మూడు కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇవి ప్రస్తుతం కోర్టులు మూసివేశాయి.
సెప్టెంబర్ 9, 2023న మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ సీఐడీ చంద్రబాబును నైపుణ్యాభివృద్ధి కేసులో అరెస్ట్ చేసింది. దీనిలో 371 కోట్ల మోసం జరిగిందని సీఐడీ ఆరోపించింది. ప్రభుత్వ అధికారులు, సీమెన్స్, డిజైన్ టెక్ ప్రాజెక్ట్ ఖర్చులను పెంచి కుట్ర ద్వారా డబ్బును స్వాహా చేశారని సీఐడీ కోర్టులో వాదించింది.
53 రోజుల పాటు జైలులో ఉన్న ఆయనకు అనంతరం బెయిల్ దొరికింది. 2024 లో చంద్రబాబు నాయుడు తిరిగి ఆంధ్రలో అధికారంలోకి వచ్చారు. ఆయన దాదాపు 18 నెలల తరువాత 2026 జనవరిలో అదే సీఐడీ “ ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేవు” అని రిపోర్టు ఇవ్వడంతో కోర్టు దాన్ని ఆమోదించింది.
మద్యం కుంభకోణం కేసు..
గత నెలలో సీఐడీ మరో రెండు కేసులను మూసివేసినట్లు తెలిసింది. చంద్రబాబు పాలనలో మద్యం కుంభకోణం జరిగిందని దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 1300 కోట్ల నష్టం వాటిల్లిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే చంద్రబాబు పాలనలో సీఐడీ ఆయనకు అనుకూలంగా నివేదిక ఇచ్చింది.
ఫైబర్ కుంభకోణం కేసు..
చంద్రబాబు పాలనలో మరో కుంభకోణం జరిగిందని జగన్ ప్రభుత్వం పెట్టిన మరో కేసే ఫైబర్ నెట్ కుంభకోణం. ఇందులో రూ.114 కోట్లు మోసం జరిగింది. ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ నమోదయిన కేసును కూడా 2025 డిసెంబర్‌లో కొట్టేశారు. ఈ కేసుల కొట్టివేతపై వైసీపీ తీవ్ర నిరసనలు చేపడుతుండగా.. టీడీపీ ఇవన్నీ రాజకీయ కక్షతో పెట్టిన నకిలీ కేసులేనని వాదిస్తోంది.
సిద్ధరామయ్య కేసు ఉన్న ముడా కేసు..
కర్ణాటక ముఖ్యమంత్రిపై నమోదయిన కేసును కూడా ఇదే విధంగా కోర్టులు మూసివేశాయి. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Sidda Ramaiah) భార్యకు 14 విలువైన స్థలాలు కేటాయించారన్న ఆరోపణలు 2024లో వెలుగులోకి వచ్చాయి.
ఈ కుంభకోణం ఆరోపణలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నియమించిన జస్టిస్ పీఎన్ దేశాయ్ జ్యుడీషియల్ కమిషన్ నియమించారు. ఈ కమిషన్ సిద్ధరామయ్య ఏ తప్పు చేయలేదని నివేదిక ఇచ్చింది. కర్ణాటక మంత్రివర్గం ఈ నివేదికను ఆమోదించడంతో కేసు రాజకీయంగా ముగిసినట్లయింది.
ఈడీ జారీ చేసిన సమన్లను హైకోర్టు రద్దు చేయడంతో సిద్ధరామయ్య విజయం సాధించారు. ఆ తర్వాత జూలై 2025లో సుప్రీంకోర్టు EDని "రాజకీయ పోరాటాలకు ఉపయోగించుకుంటున్నారని" విమర్శించింది. తాజాగా లోకాయుక్త పోలీసులు కూడా క్లోజర్ రిపోర్టు దాఖలు చేశారు. జనవరి 22న తీర్పు వెలువడే అవకాశం ఉంది.
‘వాషింగ్ మెషిన్’ రాజకీయాలు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన వెంటనే తనపై ఉన్న పాత కేసుల్లో ప్రాసిక్యూషన్ అనుమతి ఉపసంహరించుకోవడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ప్రతిపక్షం నుంచి బీజేపీలోకి చేరిన పలువురు నేతలపై ఈడీ, సీబీఐ కేసులు ఎత్తివేయడంపై కూడా ఆరోపణలు వెలువెత్తాయి. వీటిని ప్రతిపక్షాలు ‘వాషింగ్ మెషిన్ రాజకీయాలు’గా అభివర్ణించాయి.
కోర్టు ఉత్తర్వులతో కేసులు ముగియవచ్చు. కానీ అధికారంతో కేసులు ముగుస్తున్నాయన్న భావన బలపడితే, ప్రజాస్వామ్యానికి అది కేవలం హెచ్చరిక కాదు. ఒక ప్రమాద సంకేతం.
(ది ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు లేదా అభిప్రాయాలు రచయితవి, అవి తప్పనిసరిగా ది ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబిచవు)
Next Story


