తెలంగాణ ప్రభుత్వ బడులలో బోధనకు సంకెళ్ళు
x

తెలంగాణ ప్రభుత్వ బడులలో బోధనకు సంకెళ్ళు

విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి సుమారు 22రోజులు పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అంటే విద్యార్థులు అత్యంత కీలకమైన బోధనా సమయాన్ని కోల్పోవడమే


ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగు పరచడం, ఉపాధ్యాయులను ఆధునిక బోధనా పద్ధతులకు అనుగుణంగా తీర్చిదిద్దడం ఏ ప్రభుత్వానికైనా మొదటి ప్రాధాన్యత కావాలి. అయితే తెలంగాణ విద్యా శాఖ ఇటీవలి కాలంలో ఉపాధ్యాయులకు చేపడుతున్న శిక్షణ కార్యక్రమాలు చూస్తుంటే..అసలు లక్ష్యం పక్కకు పోయి 'శిక్షణే లక్ష్యం' సాగుతున్నట్లు కనిపిస్తుంది.ఏడాది పొడవున ఎదో ఒక శిక్షణ పేరుతో ఉపాధ్యాయులను తరగతి గదులకు దూరం చెయ్యడం ఆశాస్త్రీయం. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి సుమారు 22రోజులు పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అంటే విద్యార్థులు అత్యంత కీలకమైన బోధనా సమయాన్ని కోల్పోవడమే అవుతుంది. ఇది డిసెంబర్ నెలవరకే. ఇంకా విద్యా సంవత్సరం పూర్తయ్యే లోపుల ఇంకా ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారో అనే ప్రశ్నలు ఉపాధ్యాయులనుండి వ్యక్తమవుతున్నాయి.

విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే 'మే' నెలలో ఉపాధ్యాయులకు విద్యా శాఖ శిక్షణ ఇచ్చింది. మొదటి విడతగా మే 13 నుండి 17 వరకు ఐదు రోజుల పాటు 17 వేలకు పైగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. రెండో విడతలో మే 20నుండి 24వరకు ఐదు రోజులపాటు 89 వేలకు పైగా టీచర్లకు విద్యా శాఖ శిక్షణ ఇచ్చింది మొత్తంగా 1.22 లక్షల మంది టీచర్లకు శిక్షణ ఇచ్చింది. బోధన సమయం వృధా కాకుండా టీచర్లకు వేసవి సెలవుల్లోనే శిక్షణ ఇస్తున్నాం. ఆ తర్వాత ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు ఉండవని విద్యాశాఖ ఉన్నత అధికారులు పలుమార్లు ప్రకటించి విద్యా సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత కూడ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యడం విద్యాశాఖ అధికారుల ప్రణాళిక రహిత్యాన్ని సూచిస్తుంది. బడులు ప్రారంభమైన తర్వాత కూడ పాఠశాల గ్రంథాలయాలు, రీడింగ్ కార్నర్స్ బలోపేతం పేరిట జులై 23న జిల్లా స్థాయిలో ఒక్కో స్కూల్ కాంప్లెక్స్ కీ ఇద్దరు టీచర్లను ఎంపికచేసి శిక్షణ ఇచ్చారు. ఇది ముగిసిన తర్వాత జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్స్ కు ఆగస్టు 4నుండి 7వరకు కెపాసిటి బిల్డింగ్ ప్రోగ్రాం పేరిట శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత ఖాన్ అకాడమీ ఒప్పందంలో భాగంగా అక్టోబర్ 14,15 తేదీలలో ప్రధానోపాధ్యాయులకు ఆన్లైన్ ఒరియాంటేషన్ నిర్వహించారు. అక్టోబర్ 27నుండి 30వరకు గణితం, సైన్స్ టీచర్లకు ఫిజిక్స్ వాలా ఎన్జీవోలో భాగంగా శిక్షణ ఇచ్చారు.వీటితో పాటు కాంప్లెక్స్ సమావేశాలకు కూడ ఉపాధ్యాయులు కూడ హాజరు కావాల్సి ఉంటుంది. ఈవిధంగా విద్యా సంవత్సరం పొడుగునా ఉపాధ్యాయులను శిక్షణ తరగతుల పేరిట పాఠశాలలకు దూరం చెయ్యడం వలన సిలబస్ సకాలంలో పూర్తికాక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.

తెలంగాణలో 5వేలకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి.అటువంటి పాఠశాలలో ఉన్న ఒక్క ఉపాద్యాయుడు శిక్షణకీ వెళ్ళితే ఆరోజు పాఠశాలకు సెలవు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనితో పాఠశాలలో చదివే విద్యార్థుల అభ్యసన సామర్ధ్యం దెబ్బతింటుంది. విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టడం విద్యా హక్కు చట్టం యొక్క మూల ఉద్దేశానికి విరుద్ధం

ప్రభుత్వరంగంలో నిపుణులైన రిసోర్స్ పర్సన్స్ ఉన్నపటికీ,ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి ప్రైవేట్ సంస్థలకు శిక్షణ బాధ్యతలు అప్పగించడంపై ఉపాధ్యాయ వర్గాలలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రైవేట్ సంస్థల జోక్యాన్ని పెంచడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయుల అనుభవాన్ని తక్కువ చేయడమే అవుతుంది. శిక్షణల పేరిట కార్పొరేట్ సంస్థల ముద్రను ప్రభుత్వ పాఠశాలలపై వేయడం ఎంత వరకు సమంజసం? అని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.అంటే విద్యాశాఖ అధికారులకు విద్యార్థుల భవిష్యత్తు కంటే ప్రయివేట్ సంస్థలతో ఒప్పందమే ముఖ్యమని స్పష్టంగా అర్ధమవుతుంది.విద్యాశాఖను ముఖ్యమంత్రినే స్వయంగా చూస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే నా ప్రధాన లక్ష్యం ఒక వైపు ప్రకటిస్తుంటే,మరో పక్క విద్యాశాఖ అధికారులు బోధనకు ఆటంకంతో పాటు ప్రభుత్వ పాఠశాలల మనుగడకే ప్రమాదం వచ్చే నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటే ముఖ్యమంత్రికీ తెలియకుండానే అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారా?అని ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధ్యాయులకు ఇచ్చే శిక్షణలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపయోగ పడాలేకాని బోధనకు సంకెళ్లు వేసి విద్యార్థులకీ నష్టం చేకూర్చే విధంగా ఉండకూడదు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండే వాస్తవాలను పరిగణలోకి తీసుకోని ప్రయివేట్ సంస్థల ఒప్పందాలను పునరాలోచించి,సరైన ప్రణాళిక లేని శిక్షణ కార్యక్రమాల నుండి ఉపాధ్యాయులను విముక్తి చేసినప్పుడే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా సాధ్యమవుతుంది.

Read More
Next Story