
“పాదయాత్రే ఇప్పుడు పవర్ గేమ్!”
2027లో 5 అగ్రనేతల ఎంట్రీ - రోడ్లపై రాజకీయ రణరంగం!
తెలుగు రాజకీయాల్లో పాదయాత్రల సీజన్ 2027 నుంచి ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఐదుగురు కీలక నాయకులు ఏడాదిన్నర పాటు ప్రజల్లోకి వెళ్లే దీర్ఘ పాదయాత్రలకు సిద్ధమవుతున్నారు. అగ్రనేతలంతా మళ్లీ జనం మధ్యకు చేరేందుకు అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు అధికారాన్ని సాధించే అస్త్రంగా నిలిచిన పాదయాత్రలు, ఇప్పుడు తమ ఉనికిని నిరూపించుకోవడానికి, అలాగే వారసత్వ పోరులో ఆధిక్యం సాధించడానికి ప్రధాన వేదికలుగా మారుతున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దాదాపు 18 నెలలపాటు సుదీర్ఘ పాదయాత్రకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. ఆయన సోదరి షర్మిల కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు పాదయాత్రకు ఆసక్తి చూపుతున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీకి మళ్లీ పాత చైతన్యం తీసుకురావడానికి పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు. ఆయన సోదరి కవిత స్వతంత్ర రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టే ఆలోచనలో ఉన్నారు. కొత్త పార్టీ ప్రారంభించిన వెంటనే పాదయాత్ర చేపట్టే అవకాశముందని ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే, బీజేపీ నేత బండి సంజయ్ తన 'ప్రజా సంగ్రామ యాత్ర' తదుపరి దశను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇలా అన్ని పార్టీల నాయకులు రోడ్లపైకి రావడంతో, వచ్చే ఏడాది నుంచి తెలుగు రాష్ట్రాల వీధులు జెండాలు, నినాదాలతో రాజకీయ ఉత్సాహంతో కిక్కిరిసిపోనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన రాజకీయ నమ్మకం ఉంది. అధికారంలోకి రావాలంటే పాదయాత్ర తప్పనిసరి అన్నది. కాలక్రమంలో పలువురు నేతల పాదయాత్రలు ఈ భావనకు మరింత బలం చేకూర్చాయి.
1) 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన పాదయాత్ర కాంగ్రెస్‌కు భారీ మద్దతు తెచ్చి, అధికారంలోకి రావడానికి దోహదపడింది.
2) 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు నిర్వహించిన ‘వస్తున్నా మీకోసం’ యాత్ర ప్రజల్లో విశ్వాసాన్ని పెంచి, తిరిగి అధికార పీఠాన్ని అధిరోహించేందుకు సహకరించింది.
3) 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’ ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి, భారీ మెజారిటీతో విజయాన్ని సాధించారు.
4) ఆ తర్వాత ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ తరఫున నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర కూడా రాజకీయంగా ప్రభావం చూపింది. ఈ యాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో వైసీపీ తీవ్ర ఓటమిని చవిచూసింది.
5) తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాదయాత్ర చేశారు.
ఈ ఉదాహరణలు చూస్తే, పాదయాత్రలు కేవలం ప్రచార సాధనంగా కాకుండా, ప్రజలతో ప్రత్యక్ష అనుబంధాన్ని పెంచే కీలక రాజకీయ ఆయుధంగా మారాయని చెప్పవచ్చు.
ఇమేజ్ పెంచుకునే భారీ ప్లాన్!
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తనను జైలుకు పంపే అవకాశం తక్కువనే అంచనాల నేపథ్యంలో, పాదయాత్ర ద్వారా వ్యక్తిగత ఇమేజ్‌ను బలోపేతం చేసుకోవడం, అలాగే పార్టీలో హరీశ్ రావుతో ఉన్న అంతర్గత పోటీలో ఆధిపత్యాన్ని స్థిరపరచుకోవడం కేటీఆర్ లక్ష్యంగా కనిపిస్తోంది.
అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను రాజకీయంగా ఉపయోగించుకోవడం, ఓటమితో నిరుత్సాహంలో ఉన్న గులాబీ శ్రేణుల్లో మళ్లీ ఉత్సాహం నింపడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశాలుగా భావిస్తున్నారు. కేసీఆర్ వారసుడిగా తన స్థానాన్ని క్షేత్రస్థాయిలో బలపరచుకోవడానికి ఇది కీలక అవకాశం అవుతుంది.
అయితే ఇప్పటి వరకు ‘హైటెక్’ నాయకుడిగా ఉన్న కేటీఆర్, పాదయాత్ర ద్వారా ‘మాస్ లీడర్’గా ఎలా మారుతారన్నది పెద్ద ప్రశ్న. పాదయాత్ర అనేది కేవలం నడక మాత్రమే కాదు, ప్రజల సమస్యలను నేరుగా అర్థం చేసుకునే కీలక ప్రక్రియ. ఈ పాదయాత్ర ద్వారా జనాలకు కేటీఆర్ ఎంత దగ్గరౌతారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటి వరకు కేటీఆర్ రాజకీయ ప్రయాణం ఎక్కువగా వాగ్ధాటి, ఐటీ రంగ అభివృద్ధి, అంతర్జాతీయ సదస్సుల వరకే పరిమితమైందనే అభిప్రాయం ఉంది. ఇక పాదయాత్ర ప్రారంభిస్తే, గ్రామీణ ప్రాంతాల్లోని ధూళి, ఎండ, వర్షం మధ్య ప్రజల సమస్యలను నేరుగా వినాల్సి ఉంటుంది. అధికారంలో వున్న తొమ్మిదిన్నర ఏళ్లలో చేయలేక పోయిన విషయాలపై ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో ‘హైటెక్’ కేటీఆర్ నుంచి నిజమైన ‘మాస్ లీడర్’గా ఆయన ఎలా రూపాంతరం చెందుతారన్నది ఉత్కంఠగా మారింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా ఫలితాలతో వెనుకబడిన బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ ప్రజాదరణ సంపాదించడం కేసీఆర్ లక్ష్యం. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి ఆరోపణలను ప్రజల్లో ఎత్తిచూపుతూ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి పాదయాత్ర సమర్థమైన మార్గమని కేటీఆర్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
అంతేకాకుండా పార్టీలో తనకు పోటీగా భావించే హరీశ్ రావుకు సమానంగా అతికొద్ది కాలంలోనే ఆధిపత్యాన్ని చాటుకోవడానికి, సొంత ఇమేజ్‌ను బలపరుచుకోవడానికి కూడా ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని ఆయన అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలు లోపాలు, అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వాటిని రాజకీయంగా మలచుకునేందుకు పాదయాత్ర సమర్థమైన మార్గమని కేటీఆర్ భావిస్తున్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో పార్టీకి మళ్లీ ఊపు తీసుకురావచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
కేటీఆర్‌తో పాటు కవిత కూడా...
బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ పాత వైభవం తీసుకురావాలనే ప్రయత్నాల్లో కేటీఆర్ ఉంటే, ఆయన సోదరి కవిత స్వతంత్ర రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. కొత్త పార్టీ ఏర్పాటు చేసిన వెంటనే పాదయాత్ర చేపడతారనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్లు వేర్వేరు రాజకీయ జెండాలతో ప్రజల్లోకి రావడం కార్యకర్తలకే కాకుండా సాధారణ ప్రజల్లో కూడా అయోమయం సృష్టించే అవకాశం ఉంది. ఈ పరిణామాలు గులాబీ దళంలో అంతర్గత చర్చలకు, కొంత గందరగోళానికి దారితీస్తుంది.
హైకమాండ్ అనుమతి కోసం!
బీజేపీ అగ్రనేత బండి సంజయ్ కూడా పాదయాత్రకు హైకమాండ్ అనుమతి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆయన తన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ తదుపరి దశను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో నిర్వహించిన యాత్రలు ఆయనకు మంచి ప్రజాదరణను తీసుకువచ్చిన నేపథ్యంలో, ఈసారి కూడా అదే జోరును కొనసాగిస్తూ పార్టీ బలాన్ని మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తన ప్రత్యేక శైలిలో ప్రజల్లోకి వెళ్లి సమస్యలను ఎత్తిచూపుతూ, రాజకీయంగా ఆధిపత్యాన్ని చాటుకోవాలని ఆయన చూస్తున్నారు.
జగన్ మాత్రమే కాదు.. షర్మిల కూడా!
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ కుటుంబంలో నెలకొన్న రాజకీయ విభేదాలు ఇక బహిరంగంగా ప్రజల ముందుకు రానున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దాదాపు 18 నెలలపాటు దీర్ఘకాలిక పాదయాత్రకు సిద్ధమవుతుండగా, ఆయన సోదరి షర్మిల కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు పాదయాత్ర చేపట్టాలనే యోచనలో ఉన్నారు. వైస్ రాజశేఖర్‌రెడ్డి వారసత్వంపై తమకే అధికారం ఉందని ఇద్దరూ ప్రజల్లోకి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు కనిపించని అరుదైన పరిస్థితిని సృష్టిస్తోంది.
సాధారణ రాజకీయ పోటీలకు భిన్నంగా, ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన నేతల మధ్యే ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఈ పాదయాత్రలు కేవలం అధికార పక్షంపై విమర్శలకే పరిమితం కాకుండా, కుటుంబ అంతర్గత రాజకీయ ఆధిపత్య పోరుకు వేదికలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఏపీ రాజకీయాల్లో కొత్త తరహా సమీకరణాలు రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇలా అన్ని పార్టీల నాయకులు వరుసగా రోడ్లపైకి దిగుతుండటంతో, వచ్చే ఏడాది నుంచి తెలుగు రాష్ట్రాల వీధులు జెండాలు, నినాదాలతో రాజకీయ ఉత్సాహంతో కళకళలాడే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్ష నేతలు జగన్, కేటీఆర్ ల పాదయాత్రల అస్త్రాలను ఏపీ, తెలంగాణలో అధికార టీడీపీ, కాంగ్రెస్ లు ఏ విధంగా ఎదుర్కోంటాయని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

