
అమెరికా-ఇజ్రేల్ ల ఇరాన్ యుద్ధం ప్రాచీన యుద్ధాల కొనసాగింపే...
భారత-ఇరాన్ ప్రాచీన సంబంధాల చరిత్ర ఏం చెబుతున్నదో ప్రఖ్యాత చరిత్ర పరిశోధకులు కల్లూరి భాస్కరం వివరిస్తున్నారు.
మనిషి యుద్ధాలు చేస్తున్నాడు, గెలుస్తున్నాడు, ఓడుతున్నాడు కానీ; అంతిమంగా యుద్ధం ముందు సామూహికంగా ఓడిపోతున్నాడు. యుద్ధదాహాన్ని, యుద్ధోత్సాహాన్ని ఇప్పటికీ జయించలేకపోతున్నాడు. యుద్ధానికి నాగరికతా, సంస్కృతీ, సంస్కారం, మానవ విలువలు, అభివృద్ధి, జీవితాలతో సహా అన్నీ బలవుతూనే ఉన్నాయి.
విచిత్రంగా, సృష్టిలోనే వికాసమూ, నాశనమూ ఇమిడి ఉన్నాయి. మన పురాణగాథలూ, దేవుడితో సహా మన ఆధ్యాత్మిక, మతవిశ్వాసాలూ ఈ రెండింటితోనూ ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకు, జలప్రళయమూ, సృష్టి తిరిగి ప్రారంభం కావడం గురించి ఇంచుమించు ప్రపంచమంతటా ఒకే విధమైన కథలు పురాతనకాలంనుంచి పురాణాలకు ఎక్కి ప్రచారంలోకి వచ్చాయి. ఆవిధంగా చూసినప్పుడు, మనిషి మరో మనిషితో చేసే యుద్ధాలు కూడా సహా సృష్టికి సంబంధించిన విశాల వాస్తవికతలో అంతర్భాగమైనట్టు కనిపిస్తుంది. ఈ కోణంలో యుద్ధాలను కూడా అనివార్యమైనవిగా చెప్పి హేతుబద్ధం చేయడం కనిపిస్తుంది.
మహాభారతం ప్రారంభంలోనే, పెరిగిన జనాభాభారాన్ని తను మోయలేకపోతున్నానని భూదేవి బ్రహ్మతో మొరపెట్టుకుంటుంది. క్రమం తప్పకుండా వర్షాలు పడి, పంటలు బాగా పండి, ఆహారం పుష్కలంగా అందుబాటులోకి రావడంవల్ల జనాభా పెరిగిందనీ; దేవతలు, రాక్షసుల అంశతో పాండవ,కౌరవులు జన్మించి యుద్ధం చేస్తారనీ, అప్పుడు జనాభాభారం తగ్గుతుందనీ చెప్పి బ్రహ్మ భూదేవిని ఓదార్చుతాడు. విశేషమేమిటంటే, రాబర్ట్ మాల్తస్ అనే శాస్త్రవేత్త కూడా ఆహారపుష్కలత్వానికీ, జనాభా పెరుగుదలకూ ఉన్న సంబంధాన్ని ఎత్తిచూపి; చాలినంత ఆహారం లభించడం, లభించకపోవడం అనేవి జనాభాసంఖ్యను నియంత్రిస్తాయనీ, ఆహారం లభించే దామాషాలోనే జనాభా ఉంటుందనీ అంటాడు. మాల్తూసియన్ థియరీగా దీనిని చెప్పుకుంటున్నాం. ఈవిధమైన జనాభానియంత్రణ చర్యలలో ఒకటిగా యుద్ధాలను కూడా హేతుబద్ధం చేసినట్టు కనిపిస్తుంది.
అలాగని, నేను యుద్ధాలను సమర్థిస్తున్నానని అనుకోవద్దు. బుద్ధిబలంతో ప్రకృతిని జయించగలుగుతున్న మనిషి యుద్ధాలకు దూరంగా, శాంతిసామరస్యాలతో జీవించడం అలవరచుకోలేకపోతున్నాడు. అలవరచుకోలేనివాడు కాదు కానీ, ఆ లక్ష్యానికి మాత్రం ఇప్పటికీ దూరంగానే ఉన్నాడు. అమెరికా, ఇజ్రాయిల్ లు ఇరాన్ తో చేస్తున్న యుద్ధం ఆ వైఫల్యానికి తాజా ఉదాహరణ మాత్రమే. భారత్ తో సహా ఆయా దేశాలు స్వీయప్రయోజనాలు, పక్షపాతాల కారణంగా దాదాపు తటస్థపాత్రకు పరిమితమవడం, కలసికట్టుగా ఎలుగెత్తి ఆ యుద్ధాన్ని ఖండించకపోవడం; శాంతిసామరస్యాల స్థాపనకు నడుము కట్టకపోవడం; ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి వంటివి నిస్సహాయంగా చూస్తూ నిశ్శబ్దపాత్రను పోషిస్తూ ఉండడం రూపంలో ఆ వైఫల్యం బహుముఖాలుగా వ్యక్తమవుతోంది.
పరస్పర సహకారంతో సామరస్యంగా జీవించడం తెలిసిన మనిషే ఉండి ఉండి సమరం వైపు అడుగువేయడం అతని ఆలోచనావైరుధ్యానికి నిదర్శనం. స్థూలంగా యుద్ధాల చరిత్రలోకే తొంగి చూస్తే మొదట్లో తెగల మధ్య ఘర్షణలు మాత్రమే ఉండేవి, ఆ ఘర్షణలలో మృతుల సంఖ్య పదులలోనే ఉండేది. క్రమంగా ఈ ఘర్షణలు యుద్ధాలు, మెగాయుద్ధాల స్థాయికీ; మృతుల సంఖ్య, వందలు, వేల స్థాయికీ ఎలా చేరుకున్నాయో - డేవిడ్ డబ్ల్యూ. ఆంథోనీ అనే ప్రసిద్ధ పురాతత్వ, మానవశాస్త్ర, భాషావేత్త తన ‘ద హార్స్ ద వీల్ అండ్ లాంగ్వేజ్’ అనే గ్రంథంలో పురావస్తు ఆధారాలు, ఇతర సాక్ష్యాలతో సుదీర్ఘంగా వివరిస్తాడు. ఈ పరిణామానికి రంగస్థలమేమిటో, అందుకు ఎవరు బాధ్యులో కూడా చెబుతాడు.
స్థూలంగా చెప్పుకుంటే, యూరప్, పశ్చిమాసియాలూ, ఇండో-యూరోపియన్ తెగలూ ఇందుకు బాధ్యులు. పురాచరిత్రా, చరిత్రా, ఆధునికకాలాల మీదుగా జరిగిన అనేక యుద్ధాలూ, ఇటీవలి రెండు ప్రపంచయుద్ధాలూ, ఇప్పుడు అమెరికా, ఇజ్రాయిల్- ఇరాన్ ల మధ్య జరుగుతున్న యుద్ధమూ - వేల సంవత్సరాల క్రితం ఇండో-యూరోపియన్ జనాలు ప్రారంభించిన యుద్ధాలకు కొనసాగింపుగానే కనిపిస్తాయి. ఇంద్ర-వృత్రాసుర యుద్ధం, దశరాజయుద్ధం వంటి ఋగ్వేదప్రసిద్ధమైన యుద్ధాలూ; ఇతిహాసప్రసిద్ధాలైన ట్రాయ్ యుద్ధం, రామ-రావణయుద్ధం, కురుక్షేత్ర యుద్ధం మొదలైనవాటిని ఇండో-యూరోపియన్ యుద్ధపరంపరలో భాగంగానే చూడవలసి ఉంటుంది.
ఇండో-యూరోపియన్ జనాలు గుర్రాలను మాలిమి చేయడం, వాటిని వాహనం చేసుకుని దూరదూరప్రాంతాలకు వెళ్లగలగడం, అంతకుముందే పరిచయమైన చక్రాన్ని ఆధారం చేసుకుని యుద్ధరథాన్ని నిర్మించడం; గద, కత్తి, పరిఘ, పట్టసం, బల్లెం, పరశువు(గండ్రగొడ్డలి) వగైరాలతో మొదలుపెట్టి విల్లమ్ములవరకూ ఆయుధాలను అభివృద్ధి చేయడం, మధ్యయుగాలలో తుపాకీమందును కనిపెట్టడం, ఆధునికకాలానికి వచ్చేసరికి శతఘ్నుల తయారీ, యుద్ధ ట్యాంకుల నిర్మాణం, చివరిగా అణుబాంబు వరకూ జరిగిన అభివృద్ధి క్రమం అంతా యుద్ధాల చరిత్రలో ముఖ్యమైన ఉపశీర్షికలవుతాయి.
వేద, ఇతిహాస, పురాణకథలు యుద్ధపరిణామక్రమానికి అద్దం పట్టడమేకాదు; యుద్ధాన్ని ఒక ఆదర్శంగా, ఒక పవిత్రచర్యగా, ఇంచుమించు మతవిశ్వాసంలో భాగంగా నొక్కి చెప్పాయి. ఉదాహరణకు, మహాభారతంలో దేవదానవుల యుద్ధం ఆయుధాల పరిణామక్రమాన్ని సూచిస్తూ సాగుతుంది. భీష్ముడు యుద్ధాన్ని ఒక యజ్ఞంగా చెబుతాడు. క్షత్రియుడికి గౌరవాన్నీ, పుణ్యగతులనూ కల్పించేది యుద్ధంలో చంపడం, చావడమే తప్ప రోగంతో మంచమెక్కి మరణించడం కాదని వ్యాసుడు ధృతరాష్ట్రునితో అంటాడు. క్షత్రియులు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుని అంతరించడం, దాంతో క్షత్రియస్త్రీలు నియోగం వంటి రకరకాల మార్గాలలో ఇతరుల ద్వారా సంతానం కనడం, చివరికి రాజ్యాధికారం క్షత్రియుల చేతుల్లోంచి క్షత్రియేతరుల చేతుల్లోకి వెళ్ళడం గురించిన కథనాలు మహాభారత ఇతివృత్తాలలో ఒక ప్రధానపార్శ్వం. భగవద్గీత రూపంలో కృష్ణుడు కూడా మౌలికంగా అర్జునుని యుద్ధం చేయడంవైపే ప్రోత్సహిస్తాడు. ‘ఆదిత్యహృదయం’గా ప్రసిద్ధమైన సూర్యస్తుతిని అగస్త్యుడనే ముని, రావణుడితో యుద్ధం చేస్తున్న సమయంలోనే రాముడికి ఉపదేశించి గెలుపు పట్ల నమ్మకాన్ని, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నూరిపోస్తాడు. ఆ తర్వాతికాలంలోనే భగవద్గీతనూ, ఆదిత్యహృదయాన్నీ మత, తాత్విక, ఆధ్యాత్మిక, భక్తిపరమైన బోధగా మార్చినట్టు కనిపిస్తుంది. గ్రీకుకవి హోమర్ చెప్పిన ఇలియడ్ కూడా ఇలాంటి విషయాలలో భారత, రామాయణాలకు నకలుగానే ఉంటుంది.
ఈవిధంగా యుద్ధపరంపరకు తెరతీసినది ఇండో-యూరోపియన్ జనాలైతే, యుద్ధాలకు తొలి రంగస్థలమైనది రష్యన్ స్టెప్పీలతో మొదలుపెట్టి, పశ్చిమాసియా! యుద్ధమే ఇతివృత్తంగా తీసుకుని పశ్చిమ, మధ్య, దక్షిణాసియాల రేఖాపటాన్నే రూపొందిస్తే, అందులో నేటి భారతదేశం- ముఖ్యంగా వాయవ్య, ఉత్తరభారతాలు - కూడా భాగమై భారతదేశపు రేఖాపటాన్ని ఇప్పటిలా కాకుండా భిన్నరూపంలో చూపిస్తాయి.
రామాయణ, మహాభారతాలలో పర్షియన్ ఛాయలు
భారత్-ఇరాన్ ల సంబంధాల చరిత్రకే వస్తే, దానికి పూర్వరంగంగా అమరినది కూడా పశ్చిమాసియాయే. ఇందులోకి వెళ్ళే క్రమంలో ప్రోటో-ఇండో యూరోపియన్ భాష మాట్లాడిన 7వేల సంవత్సరాల వెనకటితో మొదలు పెట్టి ఎంతో చరిత్రను తడమవలసి ఉంటుంది. ప్రోటో ఇండో యూరోపియన్ భాషనుంచి పుట్టిన పుత్రికాశాఖలలో నేటి అనేక యూరోపియన్ శాఖలతోపాటు ఇండో-ఇరానియన్ శాఖ ఒకటి. దీనినుంచే ఇండిక్-సంస్కృతం, ఇరానియన్ అనే రెండు శాఖలు పుట్టాయి. మళ్ళీ ఇండిక్-సంస్కృతం నుంచి హిందీ, ఉర్దు, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, రాజస్థానీ మొదలైన భాషలు వచ్చాయి. ఇరానియన్ శాఖనుంచి పష్టో, కుర్దిష్, తజకి, బలూచి, ఓల్డ్ పర్షియన్, పర్షియన్ మొదలైన భాషలు వచ్చాయి. ఈవిధంగా భారత్-ఇరాన్ ల మధ్య భాషాపరంగా చుట్టరికం ఉంది.
ఇరాన్ (ఎడమ) , కురుక్షేత్ర యుద్ధాలు
భాష పరంగా చుట్టరికం ఉండడమంటే, దేవుళ్ళు, మతవిశ్వాసాలు, సంస్కృతులపరంగా కూడా చుట్టరికం ఉన్నట్టే. ఈ చుట్టరికాలను బట్టి ఈ జనాలు కూడా ఒకే కుదురునుంచి విస్తరించారని అర్థమవుతుంది. ఆవిధంగా సుదూరగతంలో వీరిమధ్య రక్తసంబంధం కూడా ఉన్నట్టే. వీరందరినీ ఇండో-యూరోపియన్ జనాలుగా గుర్తించవలసి ఉంటుంది. అయితే, సంచారజీవనం, ఎడతెగని వలసల క్రమంలో స్థానికజనాలతో పెద్ద ఎత్తున సంపర్కాలు జరిగిన సంగతినీ దృష్టిలో పెట్టుకోవాలి. కనుక వీరందరూ ఒకే ‘జాతి’కిందికి వస్తారా అన్నది ముఖ్యం కాదనీ; వారు ఎలా జీవించారు, ఎలాంటి సంస్కృతిని పంచుకున్నారు, ఏ దేవుళ్ళను ఆరాధించారు, ఎలా ఆలోచించారు, ఏ రకమైన సారస్వతాన్ని రూపొందించారు, ఎటువంటి ఆలోచనాధారను భారత ఉపఖండానికి తీసుకొచ్చారన్నవి ముఖ్యమనీ ‘అటోక్తనస్ ఆర్యన్స్?’ అనే తన పరిశోధనాపత్రంలో మైకేల్ విజెల్ అనే హార్వర్డ్ యూనివర్సిటీ పండితుడు అంటాడు.
మైకేల్ విజెల్ తన పత్రంలో భారత-ఇరాన్ జనాలు అతి ప్రాచీనకాలంనుంచీ పంచుకుంటూ వచ్చిన పై అంశాలను అన్నిటినీ సుదీర్ఘంగా ఎత్తిచూపుతాడు. ఉదాహరణకు, ప్రాచీన ఇరానియన్లూ; వైదిక సంస్కృతాన్ని, ఇతర ఇండో-ఆర్యన్ భాషలను, మాండలికాలను మాట్లాడే జనాలూ తమను ఆర్యులుగా పిలుచుకున్నారు. తమ భాషలను కూడా ఆర్యశబ్దంతోనే గుర్తించారు. అరియ, లేదా ఆర్యభాషలో మొదట రాసినవాడు, క్రీస్తు పూర్వం 519కి చెందిన డరియస్ అనే పర్షియన్ రాజు. ఆర్యవాక్కు వినిపించే ప్రాంతమంతా వైదికప్రాంతమవుతుందని అనంతరకాలానికి చెందిన కౌసీతకీ ఆరణ్యకం నిర్వచిస్తుంది.
అలాగే, ప్రాచీన ఇరానియన్లు తమ పౌరాణికజన్మభూమిని అయిరీయగా పిలుచుకున్నారు. ఇరాన్ అనే పేరు ఆ మాటనుంచే వచ్చింది. మన దేశంలో హరియానా అనే పేరు కూడా అరియానాగా, లేదా ఆర్యానాగానే ధ్వనిస్తుంది. క్రీ.పూ. మొదటి సహస్రాబ్ది (క్రీ.పూ. 1000) నాటికి ఇండో-ఇరానియన్ భాషలు మాట్లాడే జనాలు రుమేనియా-మంగోలియాలు, ఉరల్-వింధ్యపర్వతాలు, ఉత్తర ఇరాక్/సిరియాలు, ఉత్తరభారతప్రాంతాల మధ్యనున్న సువిశాలప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. వీరిలోకి ఉక్రెయిన్ స్టెప్పీలకు చెందిన సిథియన్ల వంటి ఉత్తర ఇరానియన్లు, ప్రాచీన మీదులు, కుర్డులు, బలూచీలు, పర్షియన్ల వంటి పశ్చిమ ఇరానియన్లు, అవెస్తా, బ్యాక్ట్రియా, పష్టోలకు, పామీర్ భాషలకు చెందిన తూర్పు ఇరానియన్లు, ఇటీవలే ఇస్లామీకరణ చెందిన కఫీరీ/నురిస్తానీ గ్రూపుకు చెందిన ఈశాన్య అఫ్ఘానిస్తాన్ జనాలు వస్తారు.
పాకిస్తాన్ లోని చిత్రాల్ లోయలో జీవించే ‘కలాష్’ అనే తెగవారు ఇప్పటికీ ఇస్లామీకరణ చెందకుండా అతి ప్రాచీనవారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఉదాహరణకు, పది అనే అంకెను తెలపడానికి క్రీ.పూ. 2000 నుంచీ వాడుతూవచ్చిన ‘duc’ అనే మాటనే వీరు ఇప్పటికీ వాడతారు. ప్రాచీన ఇండో-ఇరానియన్ దేవుడైన యమరాజును పూజిస్తారు. అప్ఘానిస్తాన్ నుంచి తూర్పున పంజాబ్, ఉత్తరభారత మైదానాలవరకూ ఇండో-ఆర్యన్ భాషలను మాట్లాడేవారు ఆర్యులనే వర్గీకరణ కిందికి వస్తారు.
ఆసియా మైనర్ ను, అంటే నేటి తుర్కియే చుట్టుపక్కల ప్రాంతాలను ఏలిన హిట్టైట్లు, ఇరాన్ ను ఏలిన పర్షియన్లు, ఉత్తర ఇరాక్/సిరియాలను ఆక్రమించుకున్న మితానీలు, మెసొపొటేమియాను, అంటే నేటి ఇరాక్ ప్రాంతాన్ని ఏలిన కస్సైట్లు ఇండో-యూరోపియన్ నేపథ్యంనుంచి వచ్చినవారే. వీరిలో మితానీలు నేరుగా సంస్కృతం మాట్లాడినవారు. పెంపుడు గుర్రం, గుర్రాలు లాగే రథం, విల్లమ్ముల వంటి ఆయుధాలు, కవితారూపాలు, మతవిశ్వాసాలు, తంతులు, పురాణగాథలు సహా వీరు ఎన్నింటినో పంచుకున్నారు.
ఉదాహరణకు, వైదిక సంస్కృతం మాట్లాడే జనాలు కూర్చిన ఋగ్వేదానికీ, ప్రాచీన ఇరానియన్ల అవెస్తాకీ మధ్య అనేక పోలికలు కనిపిస్తాయి. అలాగే పితృస్వామికతనూ; మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, అగ్ని వంటి దేవతల పేర్లనూ, నదుల పేర్లనూ వీరు పంచుకున్నారు. వీరిమధ్య ఇంకా అనేకమైన సామ్యాలను మైకేల్ విజెల్ తోపాటు డేవిడ్ ఆంథోనీ కూడా విస్తారంగా అందిస్తారు. అగ్ని ఆరాధన ఋగ్వేదజనాల్లోనూ, ఇరాన్ కు చెందిన జరతుష్ట్ర మతానుయాయుల్లోనూ కూడా ప్రముఖంగా కనిపిస్తుంది.
రామాయణ, మహాభారతాలలో ఇరానియన్, లేదా పర్షియన్ ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’ అనే నా పుస్తకంలో ‘పర్షియన్ రాముడు-గ్రీకు హనుమంతుడు’ అనే శీర్షికతో కొన్ని పోలికలను ఎత్తి చూపాను. ఎలాగంటే, సత్యనిష్ఠలో, ధర్మపాలనలో, మంచి చెడుల వివేచనలో, మంచివైపు మొగ్గు చూపడంలో, ప్రతికర్మకూ ఫలితం ఉంటుందని నమ్మడంలో, వెలుగునిచ్చే సూర్యుని ఆరాధించడంలో పర్షియన్లకూ, రామాయణంలో రాముని చిత్రించిన తీరుకీ మధ్య పోలికలు ఆశ్చర్యం గొలుపుతాయి. రాముడు నేరుగా సూర్యవంశీకుడే. ఎవరు గుణవంతుడు, ఎవరు వీర్యవంతుడు, ఎవరు ధర్మజ్ఞుడు, ఎవరు సత్యవాక్కు అన్న ప్రశ్నలతో వాల్మీకి రాముణ్ణి పరిచయం చేస్తాడు.
రావణునితో యుద్ధం చేయడానికి రాముడు సముద్రాన్ని దాటి లంకకు వెడుతున్నప్పటి ఘట్టానికీ, పర్షియన్ చక్రవర్తి గ్జెరెక్సెస్ గ్రీకులపై యుద్ధానికి వెడుతున్న ఘట్టానికీ పోలిక కనిపిస్తుంది. సముద్రుడు దారి ఇవ్వలేదని రాముడు ఆగ్రహించి సముద్రుని శిక్షించబోతాడు. అలాగే, గ్జెరెక్సస్ గ్రీకుల మీదికి యుద్ధానికి వెడుతూ సముద్రం మీద నౌకలతో వారధి నిర్మించినప్పుడు, పెద్ద తుఫాను సంభవించి ఆ నౌకలను చెదరగొడుతుంది. దాంతో గ్జెరెక్సస్ ఆగ్రహించి సముద్రుని బంధించడానికి గుర్తుగా సముద్రంలో సంకెళ్ళను వేయించి, సముద్రునీ మూడువందల కొరడా దెబ్బలతో శిక్షిస్తాడు.
మహాభారతం సరమ అనే దేవశునకం(కుక్క) గురించిన కథనంతో మొదలవుతుంది. అర్జునుని మునిమనవడైన జనమేజయుడు ఒక యాగం చేస్తున్నప్పుడు, సరమ కొడుకు సారమేయుడు ఆ యాగశాల దగ్గరికి వెడతాడు; అప్పుడు జనమేజయుని తమ్ముళ్ళు దానిని కొట్టి హింసిస్తారు. ఇది తెలిసిన సరమ, నీ తమ్ముళ్ళు ఏ తప్పూ చేయని నా కొడుకును కొట్టారు కనుక నీకు అనుకోని ఆపదలు సంభవిస్తాయని జనమేజయుని హెచ్చరిస్తుంది. మహాభారతం ముగింపు ఘట్టంలో మహాప్రస్థానానికి బయలుదేరిన ధర్మరాజును ఒక కుక్క అనుసరిస్తుంది.
ఇక్కడ అసలు సంగతేమిటంటే, వైదికమతంలో గోవులానే పర్షియన్లకు కుక్క పవిత్రజంతువు. చనిపోయిన వ్యక్తి భౌతికదేహాన్ని కుక్కకు చూపిస్తారు. అందువల్ల అతనికి పుణ్యగతులు లభిస్తాయని విశ్వాసం. మన దగ్గర అంత్యక్రియల ఘట్టంలో గోవును తీసుకొస్తారు. అలాగే మృతదేహాన్ని పక్షుల భక్షణకు విడిచిపెట్టడం పర్షియన్ల ఆచారం. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెడుతూ తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచుకుని, వాటిపై ఎవరి దృష్టీ పడకుండా పక్కనే ఉన్న ఓ శ్మశానంలో వదిలేసిన మృతదేహాన్ని తీసుకొచ్చి ఆయుధాలకు అడ్డంగా చెట్టుకు కడతారు. ప్రాచీనగతంలోకి తొంగిచూస్తే భారత్-ఇరాన్ ల మధ్య సంబంధాలకు ఇలాంటి సాక్ష్యాలు అనేకం కనిపిస్తాయి.
ఉత్తరభారతం మీదే కాక, ద్రావిడభాషల రూపంలో దక్షిణభారతానికి కూడా ఇరాన్ తో ముడి ఉంది. ద్రావిడభాషల మూలాలు ఇరాన్ కు చెందిన ఈలమైట్ భాషలో ఉన్నట్టు భాషావేత్తలు నిర్ధరించారు. హరప్పా వ్యవసాయనాగరికతకు, నేటి పాకిస్తాన్ లోని మెహర్ గఢ్ మీదుగా దోహదం అందినది కూడా- ఇరాన్ జగ్రోస్ పర్వతప్రాంత జనాల నుంచే. అవన్నీ మరో చరిత్ర.
ఇరాన్ ఇస్లామీకరణ చెందడంతో భారత-ఇరాన్ ల మధ్య అతిప్రాచీనకాలంనుంచీ ఉన్న సంబంధాలను గుర్తించలేని అజ్ఞానం, అంధత్వం దాపురించాయి. మతభేదాలు చూపుతున్న దుష్ప్రభావాలలో ఇదొకటి. ఒకే కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య కూడా చీలిక తేగలిగిన మహమ్మారి, మతం. యుద్ధాలనే కాదు, మతభేదాలను కూడా జయించలేకపోతుండడం మనిషి ఎదుర్కొంటున్న దారుణ వైఫల్యాలలో ఒకటి. వాటిపై విజయం సాధించనంతకాలం మళ్ళీ మళ్ళీ తిరోగమనం సాగిస్తూనే ఉంటాడు...సుఖజీవనం కోసం తను కట్టుకున్న ఇంటిని తన చేతులతో కూలదోసుకుంటూనే ఉంటాడు.
(2026 ఏప్రిల్ 5న, మహబూబ్ నగర్ లోని పాలమూరు అధ్యయన వేదికపై చేసిన ప్రసంగం)
(The Federal seeks to present views and opinions from all sides of the spectrum. The information, ideas or opinions in the articles are of the author and do not necessarily reflect the views of The Federal.)

