ఎవరి లెక్కలు వారికి ఉన్నాయా?
x

ఎవరి లెక్కలు వారికి ఉన్నాయా?

పార్టీ మీద పట్టుకోసం రేవంత్, కుటుంబం కోసం ఉన్న రాజకీయాలు చేస్తున్న సురేఖ


Click the Play button to hear this message in audio format

చాలాకాలం నుంచి పార్టీ సహచర నాయకులతో పాటు సీఎంతో బహిరంగంగా వివాదాలు నెరుపుతున్న మంత్రి కొండా సురేఖను, సీఎం రేవంత్ రెడ్డి క్యాబినేట్ నుంచి తొలగించారు. సురేఖను తొలగించడానికి ఆయన అధిష్టానం అండగా నిలిచింది అనడంలో సందేహం లేదు.

ఉత్తర తెలంగాణలో బలమైన బీసీ నాయకురాలు, ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రేవంత్ రెడ్డి క్యాబినేట్ లో అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఆమె ఎన్ని వివాదాలు లేవనెత్తిన రేవంత్ సురేఖను తొలగించలేడని, పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని నానుస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా మంత్రి పదవి నుంచి సురేఖ బర్తరఫ్ కావడం చాలామంది విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.

కొన్ని రోజుల క్రితం కొండా సురేఖ పుట్టిన రోజు సందర్భంగా ఆమె కుమార్తె సుస్మిత నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడారు. దీని కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపింది. అప్పటికే వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులందరితో కొండా కుటుంబానికి పొసగడం లేదు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అంతా కొండా కుటుంబం చేస్తున్న రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగంగా మీడియాకు ఎక్కారు. ఈ పరిణామం తరువాత అంతా సర్దుకున్నట్లే కనిపించినా, తరువాత సీఎంను టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో ఇక ఉపేక్షించకూడదని అధిష్టానం సైతం భావించింది.
ఆమె తల్లి అనుమతి లేకుండా కొండా సుస్మిత ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండదని సీఎం రేవంత్ రెడ్డి భావించి, అధిష్టానం అనుమతితో మంత్రి పదవి నుంచి తొలగించారు.

‘కొండా’ కోటను బద్దలు కొడతారా?

కొండా కుటుంబానికి రాజీకయంగా గట్టి పట్టున్న నియోజకవర్గం పరకాల. కానీ ఇక్కడ నుంచి ప్రస్తుతం రేవూరి ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకే వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున మళ్లీ నిలబెడతామని రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. ఇదే కొండా కుటుంబం ఆగ్రహానికి కారణమై, సుస్మిత తీవ్రమైన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది.
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కుమార్తెను పరకాల నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని కొండా దంపతులు భావిస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి నిర్ణయం వారికి అవమానంలా భావించారు. రేవంత్ రెడ్డి వల్ల తమ రాజకీయ ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉందని అనుకున్న కొండా కుటుంబం.. వెంటనే సీఎంపై మాటల దాడికి దిగింది.
2017 నుంచి టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి మారిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాతతరం నాయకులను కాదని వేగంగా ఎదిగి, 2023 ఎన్నికల్లో సీఎం అయ్యారు. అప్పటి నుంచి తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి రాజకీయ ఎత్తులు వేస్తూ, తనతో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు.
ఈ క్రమంలో పరకాల నియోజక వర్గాన్ని తన కుమార్తెకు వదిలి పెట్టాలన్న కొండా సురేఖ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సీఎం, వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాశ్ రెడ్డిని మరోసారి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ చర్యతో కొండా ఫ్యామిలి భగ్గుమంది. ముఖ్యంగా కొండా సుష్మిత దీనిని తమ కుటుంబానికి అవమానకరంగా భావించింది.

కుల ఉద్రిక్తతలు...

సురేఖ తొలగింపు వల్ల రెడ్డి- ఓబీసీ వర్గాల మధ్య రాజకీయ ఘర్షణగా చిత్రీకరించే అవకాశం ఉందని భావించిన సీఎం రేవంత్ రెడ్డి, వివిధ సంస్థలకు ముగ్గురు బీసీ మహిళలను అధ్యక్షులుగా నియమించి బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారు.
మంత్రి తొలగింపుకు కులంతో సంబంధం లేదనే వాదన సమర్థించేందుకు రెడ్డి కులానికే చెందిన రెబెల్ గా వ్యవహరిస్తున్న డాక్టర్ చిన్నారెడ్డిని సైతం రాష్ట్ర ప్రణాళిక బోర్డు నుంచి తప్పించారు. కేవలం పార్టీ లైన్ దాటితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదనే సంకేతం పంపారు.
అయితే చిన్నారెడ్డి విషయం కన్నా.. మంత్రి పదవి నుంచి సురేఖను తప్పించడమే రాజకీయ కుదుపుకు ప్రధాన కారణమైంది. తెలంగాణ మహిళా రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నది సురేఖ మాత్రమే. ఎలాంటి రాజకీయ సంబంధాలు లేని సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన పద్మశాలి మహిళా, మున్నూరు కాపుకు చెందిన కొండా మురళిని వివాహమాడటంతో రెండు కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

సురేఖకు ప్రత్యేక స్థానం...

1995 లో మండల పరిషత్ సభ్యురాలిగా ఎన్నిక కావడంతో సురేఖ రాజకీయ ప్రస్థానం ప్రారంభం అయింది. ఆ తరువాత వరుసగా జరిగిన 1999, 2004, 2009, 2014, 2023 లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించారు. 2012 లో తన పదవికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2018 లోనూ మరోసారి ఓటమి పాలయ్యారు.
గత మూడు దశాబ్దాలుగా మహిళా రాజకీయా నేతగా తనకంటూ ఉన్న ప్రత్యేక గుర్తింపును ఆమె నిలుపుకుంటూ వస్తున్నారు. 1956 లో ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేసిన తరువాత తెలుగు నేలపై రాజకీయాలలో ఏ ఒక్క బీసీ నాయకురాలు ఇంత సుదీర్ఘంగా రాజకీయ రంగంపై నిలబడలేదు. అందుకే సురేఖ తెలుగు రాజకీయాల్లో ఒక అరుదైన నాయకురాలు.
స్వాతంత్య్రానికి ముందు జన్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ, గౌతు లచ్చన్న, ప్రగ్గడ కోటయ్య, పి. శివశంకర్, టీ. బాలాగౌడ్, సి. జగన్నాథం, జీ రాజారామ్ వంటి మహనీయుల కాలం నుంచి అన్ని రాజకీయ పార్టీలు ఎందరో బీసీ నాయకులను అందించాయి. కానీ ఒకటి రెండు కుటుంబాలు తప్ప ఎవరూ వెలమ, రెడ్డిల వలే తమకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకోలేకపోయాయి.
ఆశ్చర్యకరంగా 1956 లో మొదలైన ఉమ్మడి ఆంధ్ర ప్రస్థానంలో తనకంటూ ప్రత్యేకు గుర్తింపు తెచ్చుకున్న నాయకురాలు ఎవరూ లేకపోవడంతో కొండా సురేఖను ప్రత్యేకంగా గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆమెను రాజకీయాలలో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
కాంగ్రెస్ సంకీర్ణాన్ని బలంగా నిర్మించడానికి వైఎస్ఆర్ కుల వైవిధ్యాన్ని ఉపయోగించుకున్నారు. 2004, 2009 లో ఆయన ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో అన్ని కులాల వారు కలిసిమెలిసే ఉన్నారు. వారిలో కొండా సురేఖ ఒకరు. అనతికాలంలోనే ఆమె వరంగల్ జిల్లా నుంచి మంచి వాక్చాతుర్యం గల మంత్రిగా ఎదిగారు.

పార్టీ మీద పట్టుకోసం రేవంత్..

కాంగ్రెస్ అంటేను గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. దానికి నిరోధించి, ఎలాంటి పవర్ సెంటర్ ఏర్పడకుండా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. తను అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ కొండా కుటుంబం ఆధిపత్యం చెలాయించడాన్ని సీఎం కోరుకోవడం లేదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని కాంగ్రెస్ నాయకుడు ఒకరు చెప్పారు.
తెలుగు రాజకీయాలను ప్రముఖంగా విశ్లేషించే డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ ప్రకారం.. ముఖ్యమంత్రిపై ఆమె కుమార్తె వ్యాఖ్యలు చేయడానికి చాలాకాలం ముందే సురేఖను బలహీనపరిచే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి.
‘‘సురేఖ ప్రాబల్యం విచ్చిన్నం చేయడమే ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. పదేళ్ల పాటు ముఖ్యమంత్రికి కొనసాగుతానని ఇప్పటికే ప్రకటించిన రేవంత్ రెడ్డికి, ఉమ్మడి వరంగల్ జిల్లాను ఒక మహిళా నేతకు స్థావరంగా మార్చడానికి అనుమతించరు’’ అని శ్రీనివాస్ ‘ది ఫెడరల్ ’ తో అన్నారు.
తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ ను ఎల్లప్పుడూ రెడ్డిల పార్టీగానే చూశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఇతర కులాల నాయకులను ప్రొత్సహించి, పార్టీలో వైవిధ్యం తీసుకురావడానికి ప్రయత్నించారు. మరోవైపు సోనియా గాంధీ, కమ్మ, వెలమ కులాల ఆధిపత్యానికి విరుగుడుగా రెడ్డి కులాన్ని చూశారు. ఈ వ్యూహం సరైనదని నిరూపించారు.

రాజకీయ శక్తి...

2004 లో అప్పటిదాక అధికారంలో ఉన్న టీడీపీని ఓడించి వైఎస్ఆర్ అధికారంలోకి తీసుకొచ్చారు. 2023 లో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను ఓడించి ఇదే పనిచేశారు.
‘‘ఈ పరిస్థితులలో శక్తివంతమైన, సమర్థుడైన రెడ్డి ముఖ్యమంత్రికి, బీసీ నాయకుడికి మధ్య వైరం తలెత్తినప్పుడూ పార్టీ సహజంగానే రెడ్డి నాయకుడి వైపు మొగ్గు చూపుతుంది.’’ అని హైదరాబాద్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ చలసాని నరేంద్ర అన్నారు.
మంత్రికి, ముఖ్యమంత్రికి మధ్య పూరులా కనిపిస్తున్న చిత్రం, తెలంగాణ రాజకీయాల్లో ఒక పాత ప్రశ్నను లేవనెత్తింది. సంప్రదాయకంగా శక్తివంతమైన భూస్వామ్య కులాల ఆధిపత్యంలో ఉన్న పార్టీలో, ఒక బీసీ నాయకురాలు, అందులోనూ ఒక మహిళ తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ స్థానాన్ని ఏర్పరచుకోగలరా?
సురేఖ తన మంత్రి పదవిని కోల్పోయి ఉండవచ్చు గానీ, అది రాజకీయంగా మాత్రమే. ఆమె తన రాజకీయ పునాదిని పటిష్టంగా మార్చుకుంటే, సురేఖను బలహీనపరిచేందుకు రేవంత్ చేసే ప్రయత్నాలు భిన్నమైన ఫలితాన్ని ఇవ్వవచ్చు.
(ది ఫెడరల్ అన్నివర్గాల అభిప్రాయాలను అందిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు, అభిప్రాయాలు రచయితవి. అవి తప్పనిసరిగా ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబించవు)


Read More
Next Story