అభివృద్ధి అంటే ప్రజలకు, పార్టీలకు భిన్నాభిప్రాయాలు ఉంటాయా?
x

అభివృద్ధి అంటే ప్రజలకు, పార్టీలకు భిన్నాభిప్రాయాలు ఉంటాయా?

ఈ పరిశ్రమలు మాకు వద్ధు -మా వ్యవసాయమే మాకు ముద్దు ,

“కెమికల్ అంటే కెమికలే ,

ఈ పరిశ్రమలు మాకు వద్ధు -మా వ్యవసాయమే మాకు ముద్దు ,

కంపెనీలు వద్ధు- కాలుష్యం వద్ధు

వద్దన్నా వస్తాం అంటారా - తెలంగాణ తడాఖా చూపిస్తాం “

ఈ నినాదాలన్నీ సాధారణ ప్రజలు ఇచ్చినవి,

మండల స్థాయి విభిన్న పార్టీల నాయకులు ఇచ్చినవి,

గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు ఇచ్చినవి ,

రైతులు, యువత, మహిళలు, వృద్ధులు, పిల్లలు

అందరి కందరూ ఉమ్మడిగా గొంతెత్తి అరిచినవి..

2025 డిసెంబర్ నెలలో వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలలో మూడు పరిశ్రమల ఏర్పాటు కోసం అధికారులు నిర్వహించిన పబ్లిక్ హియరింగ్ కార్యక్రమాలలో సాధారణ ప్రజలు ఉపన్యాసకులుగా మారి మాట్లాడిన మాటలు వింటే -తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ, గౌరవం మరింతగా పెరిగాయి.

అభివృద్ధి అనే భావనను అధికార ప్రభుత్వం ఒక రకంగా చూస్తుంది. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఇంకో రకంగా చూస్తాయి. అధికార గణం మరో రకంగా చూస్తుంది. కార్పొరేట్, ప్రైవేట్ కంపెనీలు మరింత విభిన్నంగా చూస్తాయి. కానీ సాధారణ ప్రజలు మాత్రం, ఏ జిల్లాకు వెళ్ళినా, గత మూడు దశబ్ధాలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధిని ఒకే రకంగా నిర్వచిస్తున్నారు. అది మారు మూల మండల కేంద్రమయినా, రాష్ట్ర సారి హద్దు గ్రామం అయినా , పట్నపు పోకడలు సంతరించుకుంటున్న జాతీయ రహదారికి అతి దగ్గరి మండల కేంద్రమయినా – ఆలోచనలు ఒకే రకంగా కనిపించాయి. మాటలు ఒకే రకంగా వినిపించాయి.

ఆ ఆలోచనలలో తమ స్వంత గ్రామాల పట్ల అంతులేని ప్రేమ కనిపించింది. తమ భూములు, తమ వ్యవసాయం, తమ గ్రామ చెరువులు, మంచి నీళ్ళు, మంచి గాలి, మంచి ఆహారం, మొత్తంగా మంచి వాతావరణం ఎప్పటికీ బాగుండాలనే ఆపేక్ష కనిపించింది. గ్రామీణ ప్రాంతంలో నెలకొల్పడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్న పరిశ్రమలు తమకు మేలు చేయకపోగా, తమకు ఉపాధి చూపించకపోగా, తమ ప్రాంతాలను విషయంతో, దుర్గంధంతో నింపేస్తున్నాయని ఒకే రకంగా ఘోషించారు. పరిశ్రమల కాలుష్యం పై మౌనంగా ఉంటున్న పై స్థాయి ప్రజా ప్రతినిధులను, ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులను ఈ సమావేశాలలో దుమ్మెత్తి పోశారు. ఈ మాటలు, ఎవరో కొందరు వ్యక్తులు, ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడిన మాటలు కావు. ఉమ్మడిగా, పార్టీలకు, కుల మతాలకు అతీతంగా అందరూ తమ అభిప్రాయాలను కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పారు.

మొత్తం మా గ్రామాలన్నీ ఏకగ్రీవంగా మీ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నామని అధికారుల మొహంమ్మీద చెప్పారు. తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. మా మాటలను పట్టించుకోకుండా, కంపనీల ఏర్పాటుకు ప్రభుత్వాలు అనుమతులు ఇస్తే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన జ్ఞాపకాలతో, మళ్ళీ తమ తడాఖా చూపిస్తామని కూడా హెచ్చరించారు. పోలీసుల కాపలాతో నిర్వహించుకోగలమంటే సాధ్యం కాదనీ, పబ్లిక్ హియరింగ్ రోజు ఉన్నట్లే, పోలీసులు రోజూ కంపనీలకు కాపలాగా ఉండరనీ , అందువల్ల కంపనీ పెట్టె ముందే, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలనీ, నిర్మాణ పనులను ఆపేసి, తట్టా బుట్టా సర్దుకుని వెళ్లిపోవాలనీ కూడా ఆయా కంపనీ ప్రతిపాదకులకు స్పష్టం చేశారు.

ఇప్పటికే తమ ప్రాంతాలలో నెలకొల్పిన రసాయన, ఫార్మా కంపెనీలు, తమకు గతంలో అబద్ధాలు చెప్పి మోసం చేశాయనీ, ఇప్పుడు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయనీ, యాజమాన్యానికి చెప్పడానికి కంపనీ గేటు వద్దకు వెళ్ళినా తమను లోపలికి అనుమతించడం లేదనీ, అధికారులు కూడా అటు వైపు తొంగి చూడడం లేదనీ, తమ గ్రామాల యువకులకు ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదనీ, బయట రాష్ట్రాల వాళ్ళను తీసుకు వచ్చి, కంపెనీ లోపలే ఉంచుకుని, రోజూ 12 గంటలు పని చేయించుకుంటున్నారనీ , తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారనీ, మొత్తం విషాలను తమ పొలాల లోకీ, చెరువుల లోకీ వదులుతున్నారనీ, ఆరోపించారు.

స్థానికంగా చుట్టూ గ్రామాలలో భూ గర్భ జలాలు కూడా కలుషితమై పోయాయనీ, మనుషులకు, పశువులకు తాగడానికి నీళ్ళు పనికి రాకుండా పోయాయనీ, తాము నీళ్ళను కొనుక్కోవలసి వస్తుందనీ, తమ స్వీయ అనుభవాలను వివరించారు. ఒక రకంగా ఈ పబ్లిక్ హియరింగ్ లు , అధికారులపై, ప్రభుత్వాల అభివృద్ధి నమూనా పై ఒక యుద్ధ శంఖారావం పూరించినట్లుగా కనిపించింది. నాలుగు గంటల పాటు ప్రజలు కదలకుండా కూర్చుని, అందరూ చెప్పేవి విన్నారు. తమ మాట వినిపించారు.

తమ నీళ్ళు, తమ భూములు వాడుకుని, తమ గాలిని , తమ ఆహారాన్ని పాడు చేసే కంపెనీలను తాము అనుమతించబోమని, ఎట్టి పరిస్థితులలో ఇలాంటి రసాయన, ఫార్మా పరిశ్రమలను తమ ప్రాంతంలోకి మళ్ళీ అడుగు పెట్టనివ్వబోమని, ఉన్న వాటిని కూడా తరిమేస్తామని కూడా ప్రకటించారు. తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదనీ, విష కాలుష్యం వెదజల్లని పరిశ్రమలు తమ ప్రాంతంలో పెట్టాలనీ, బయట వాళ్ళకు కాకుండా, స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలనీ కూడా ప్రజలు స్పష్టంగా డిమాండ్ చేశారు.

ప్రభుత్వాలు ముందుకు తోస్తున్న ప్రస్తుత అభివృద్ధి నమూనాపై ప్రజలకు ఇంత స్పష్టత ఉన్నప్పుడు, ఇదే స్పష్టత తెలంగాణ రాజకేయ పార్టీలకు, తెలంగాణ ఉద్యమ కారులకు, ప్రజా ప్రతినిధులకు ఎందుకు ఉండడం లేదు ? ఇది జవాబు వెతుక్కోవలసిన పెద్ద ప్రశ్న .

1991 లో దేశంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో ప్రారంభమైన నూతన ఆర్ధిక, పారిశ్రామిక విధానాల సారాంశం , ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అమలు చేస్తున్న ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, నగరీకరణ, పారిశ్రామికీకరణ విధానాల సారాంశం ఒక్కటే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఇవే విధానాలు అమలవుతున్నాయి.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని మాటలు చెప్పినా, అధికారంలోకి వస్థే అమలు చేసే అభివృద్ధి నమూనా ఒక్కటే. ప్రజల చేతుల్లో నుండీ వనరులను లాక్కోవడం, బడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం, అందుకు అనుగుణంగా చట్టాలలో మార్పులు చేయడం, ప్రజలకు అనుకూలంగా ఉన్న కొన్ని చట్టపర అంశాలను అమలు చేయకపోవడం, అధికార యంత్రాగం పూర్తిగా బడా బాబులకు అడుగులకు మడుగులొత్తడం, ప్రజల , పౌర సమాజ ప్రతినిధుల గొంతు నొక్కేయడం – ఇదే ఈ విధానాల అమలు తీరు.

విషాదమేమంటే, 1990 దశకం నుండీ ఈ విధానాలను వ్యతిరేకించడంలో ముందున్న, పోరాడిన వామపక్ష పార్టీలు, తాము అధికారంలో ఉన్న చోట ఇవే విధానాలను అమలు చేయడం, ప్రతిపక్షంలో ఉన్న చోట కూడా ప్రస్తుతం ప్రజలతో కలసి, ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడకుండా మౌనంగా ఉండడం, కొన్ని సార్లు ప్రభుత్వాలను సుత్తి మెత్తని విమర్శలతో సరిపెట్టడం జరుగుతున్నది. తెలంగాణ లో కూడా ఈ పరిస్థితి భిన్నంగా లేదు. గత మూడు పబ్లిక్ హియరింగ్ లలో నేను గమనించింది కూడా ఇదే. వికారాబాద్ జిల్లాలో ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు పబ్లిక్ హియరింగ్ లో ప్రజల పక్షాన నిలబడితే, కామారెడ్డి జిల్లాలో సిపిఐ పార్టీ ప్రతినిధులు, ప్రజల గొంతు వినిపించారు.

రాష్ట్ర స్థాయి పార్టీలు మాత్రం ఇప్పటికీ ఈ అభివృద్ధి నమూనా పట్ల విమర్శనాత్మక వైఖరి తీసుకోవడం లేదు. కొన్ని సార్లు నాయకుల ఉపన్యాసాలలో, రచనలలో ఈ వైఖరి కనపడినా, చాలా సందర్భాలలో తమకు ఎంతో కొంత సంస్థాగత నిర్మాణం ఉన్న జిల్లాలలో కూడా సమస్యలపై ముందుకు వస్తున్న ఆయా ఉద్యమాలలో చురుకైన, నాయకత్వ పాత్ర పోషించడం లేదు. పబ్లిక్ హియరింగ్ సందర్భంగా ఈ లోటు స్పష్టంగా కనిపించింది.

సూర్యాపేట జిల్లా రావి పహాడ్ మండలంలో కొత్తగా నిర్మాణమవుతున్న ఇథనాల్ వ్యతిరేక పోరాటానికి అవకాశం ఉన్నా, స్థానిక ఎర్రజండా పార్టీల నుండీ, ప్రజలను చైతన్య పరచడంలో, ఉద్యమానికి కదిలించడంలో ఎలాంటి చురుకైన పాత్ర లేకపోవడం కనిపించింది. జనగామ, ఖమ్మం, కొత్తగూడెం , మహబూబ్ నగర్ జిల్లాలలో కూడా ఈ కొరత కనిపిస్తున్నది.

చాలా జిల్లాలలో గ్రామీణ ప్రాంతంలో స్థానిక స్థాయిలో పని చేసే వామపక్ష కార్యకర్తలు, వామపక్ష ప్రజా సంఘాలు కనిపించడం లేదు. ఆయా పార్టీలకు కేంద్రీకరించి పని చేసే పూర్తి కాలం కార్యకర్తలతో పాటు, ఆర్ధిక వనరుల కొరత కూడా తీవ్రంగా కనిపించింది. ఆయా జిల్లాలలో ఈ పార్టీలకు జిల్లా స్థాయిలో ఒకరిద్దరు గుర్తింపు ఉన్న నాయకులు ఉన్నా, మొత్తంగా జిల్లాలో ముందుకు వస్తున్న కీలక ప్రజా సమస్యలను గుర్తించడంలో,వాటిపై ప్రజలను సమీకరించడంలో ఆయా పార్టీ కమిటీల వైఫల్యం కూడా కనిపిస్తున్నది.

మరో వైపు వ్యవసాయ రంగంలో దశబ్ధాలుగా నెలకొని ఉన్న సంక్షోభం దృష్ట్యా , గ్రామీణ ప్రాంతం నుండీ బయటకు ప్రజలను తరలించాల్సిన అవసరముందనీ, గ్రామీణ ప్రజలు నగరాలకు, పట్టణాలకు, పారిశ్రామిక, సేవా రంగాలలో పని కోసమూ తరలి వెళ్లాల్సిన అవసరముందనీ, చెప్పే సో కాల్డ్ పెట్టుబడిదారీ ఆర్ధిక వేత్తల భావజాలం మెజారిటీ వామపక్ష పార్టీల నాయకులను కూడా బాగా ప్రభావితం చూపినట్లు కనిపిస్తున్నది. అందుకే ప్రస్తుతం ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి నమూనా కు వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరి రాష్ట్ర పార్టీల నాయకత్వం తీసుకోవడం లేదు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను కదిలిస్తే , అది అంతిమంగా బీజేపీ పార్టీకి రాష్ట్రంలో బలాన్ని పెంచుతుందనే, భయం కూడా, వామపక్ష పార్టీల నాయకులు కొందరిలో అవసరానికి మించి ఉన్నట్లు కనిపిస్తున్నది. ఈ భావ జాల కారణంగానే, ప్రజలు ఎన్ని సమస్యలలో ఉన్నా, స్థానికంగా ప్రజలకు సహజ మిత్రులుగా ఉండాల్సిన వామపక్ష పార్టీలు , ప్రజల వైపు నిలబడి పోరాటాలు నిర్మించకుండా నిస్తేజంగా ఉండడం అందరూ గమనిస్తున్నదే.

సామ్రాజ్యవాద యుగంలో , ప్రపంచ ఆర్ధిక వేదిక లలో ప్రభుత్వాలు పరిశ్రమల, సేవ సంస్థల యాజమనులతో కుదుర్చుకునే ఒప్పందాలను మనం ఆపలేమనీ, బయట దేశాల కార్పొరేట్ కంపనీలు , దేశీయ బడా కంపనీలు మన దగ్గర పరిశ్రమలను స్థాపించడం అనివార్యమనీ, అలాగే పెట్టుబడిదారీ విధాన చట్రం పని చేస్తుందనీ, ఈ క్రమంలో గ్రామీణ రైతులు తమ భూములను కోల్పోక తప్పదనీ, అది రాష్ట్ర అభివృద్ధికి అవసరమనీ వామపక్ష పార్టీల నాయకులు కొందరు బలంగా నమ్ముతున్నట్లున్నారు. ఆయా దేశాలలో పెట్టుబడిదారీ విధానం ఇలాగే అభివృద్ధి చెందిందనీ మనకు నమ్మబలుకుతారు.

అది నిజం కాదు. ఒక వర్గ వ్యవస్థలో, ప్రజా పక్ష వర్గ పోరాటాలు అడుగడుగునా ఈ విధ్వంసకర అభివృద్ధి నమూనాను అడ్డుకుంటాయి. ప్రజలెప్పుడూ బలహీనతతో తమ వనరులను,హక్కులను కోల్పోతూనే ఉండరు. ప్రజలు సమిష్టి కార్యాచరణతో తమ జీవనోపాధుల, వనరుల రక్షణ కోసం సాగించే ప్రజా పోరాటాలు కొత్త హక్కులను కూడా సాధిస్తాయి. ఈ ఎగుడు దిగుడుల ప్రజల పోరాటాల మార్గమే ఆయా సందర్భాల పోరాట రూపాలను కూడా నిర్దేశిస్తుంది. అంతిమంగా సమాజంలో సంపూర్ణంగా దోపిడీ, పీడనలను నిర్మూలించే పోరాటాలకు ఈ మార్గం వేస్తుంది. సమాజంలో ఈ ప్రక్రియను వేగవంతం చేయడమే నిజమైన ప్రజాస్వామిక వాదుల, కమ్యూనిస్టుల కీలక కర్తవ్యం అవుతుంది.

ఈ విమర్శను, అభిపాయాన్ని , ఆయా రాష్ట్ర పార్టీల నాయకత్వం సహృదయంతో తీసుకుని, ఆయా పార్టీలు,కార్యకర్తలు ప్రజలకు అండగా నిలబడాలన్న కోరిక తప్ప, ఈ వ్యాస రచయితకు మరో ఆశ లేదు.

పాత (కొత్త) అభివృద్ధి నమూనా పై ప్రజలకు అవగాహన కల్పించడంలో, ఈ అభివృద్ధి నమూనా ఫలితంగా ముందుకు వస్తున్న సమస్యలను గుర్తించడంలో, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల నష్టపోతున్న ప్రజల గొంతు వినిపించడంలో, తెలంగాణ లో అనేక పేర్లతో పని చేస్తున్న ఇతర ఉద్యమ సంస్థలు, కుల సంఘాలు, వాటి నాయకత్వాలు కూడా కూడా ఆచరణలో క్షేత్ర స్థాయిలో వెనకబడి ఉంటున్నాయని, ఈ మూడు పబ్లిక్ హియరింగ్ ల సందర్భంగా బయటకు వచ్చిన మరో అంశం.

తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, సైంటిస్ట్స్ ఫర్ పీపుల్ లాంటి సంస్థలు చొరవ చేసి, ఆయా పబ్లిక్ హియరింగ్ లపై కొంత సాహిత్యాన్ని ప్రచారంలోకి తెచ్చి, అధికారులకు మెమోరాండం లు రాసి, వీడియోలు, పోస్టర్లు చేసి, కరపత్రాలు ముద్రించి, గ్రామాల లోకి వెళ్ళి నేరుగా ప్రజలతో మాట్లాడే వరకూ, స్థానికంగా పౌర సమాజ సంస్థలు ఏవీ ఇలాంటి అంశం తమ కళ్ల ముందే జరుగుతున్నా పట్టించుకున్న దాఖలాలు కనపడలేదు. పైన పేర్కొన్న రెండు సంస్థలకు కూడా ఆర్ధిక వనరులు లేవు. కార్యకర్తల కొరత తీవ్రంగా ఉంది. కానీ ప్రజలకు విషయాలు చెప్పాలనే తపన మాత్రం నిండుగా ఉంది.

అందుకే తమకు ఏ మాత్రం సంబంధంలేని, కనీసం పరిచయాలు కూడా లేని ప్రాంతాలయినా పని గట్టుకుని వెళ్ళి ఈ రెండు సంస్థల ప్రతినిధులు ప్రజలను కలిశారు. రాబోయే విధ్వంసకర పరిశ్రమల గురించి ప్రజలకు వివరించారు. ఒక ప్రజా శాస్త్రవేత్తకు ప్రజల పట్ల ఉన్న నిబద్ధత, పబ్లిక్ హియరింగ్ పై ఒక వారం రోజుల ప్రచారం, గ్రామాల ప్రజలతో సమావేశాలు, రెండు వేల కరపత్రాల పంపిణీ , సమాజం పట్ల బాధ్యతతో ఆలోచించే రిపోర్టర్ లు రాసిన కొన్ని వార్తా పత్రికల కథనాలు , సమస్య తీవ్రతను వివరించేలా ఒకరిద్దరు వాలంటీర్లు రూపొందించిన మూడు వీడియోలు, సోషల్ మీడియా పోస్టర్లు – క్షేత్ర స్థాయికి ప్రజల లోకి తరలి వెళ్ళిన నలుగురైదుగురు కార్యకర్తల సమయం,– ఇవే మూడు పబ్లిక్ హియరింగ్ లలోనూ ప్రజల కదలికలకు కారణమయ్యాయి.

అంటే తెలంగాణ ప్రజలు సజీవంగా ఉన్నారు. నిత్య నిర్బంధాలతో, కుల, మతాల చీలికలతో, మద్యం వ్యసనంతో ప్రజలను నిద్ర పుచ్చాలని ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నించినా, ఎదురయ్యే సమస్యలపై తమ పోరాట స్పూర్తిని కోల్పోలేదు. కాకపోతే, ప్రజల దగ్గరకు వెళ్ళి, వర్తమాన వాస్తవాల ప్రాతిపదికన ప్రజలను సమీకరించే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం తెలంగాణ ఎదుర్కుంటున్న కీలక సమస్య ఇదేనని నాకు కలిగిన అభిప్రాయం.

ప్రజల దగ్గరకు వెళ్లాలంటే, ప్రజా రాజకీయాల పట్ల స్పష్టత, సమాజంలో వస్తున్న మార్పుల పట్ల అధ్యయనం, వస్తున్న మార్పులకు అనుగుణంగా రూపొందించుకునే కార్యాచరణ, నాయకులు, కార్యకర్తలలో వ్యక్తిగత నిబద్ధత, నిజాయితీ, శత్రువును ఏకాకిని చేయడానికి, మిత్రులను పెంచుకోవాలనే అవగాహన – ఇవన్నీ జమిలిగా అవసరమవుతాయి. ప్రజల పట్ల బాధ్యతగా ఆలోచించే సంస్థలు, వ్యక్తులు వీటిని సాధించడం కష్టమేమీ కాదు. ఎప్పుడైనా ప్రారంభించాల్సిన ప్రక్రియ ఇదే..

Read More
Next Story