
కవితకు డిపాజిట్ కూడా దక్కదన్న రాజగోపాల్
కన్న తండ్రికి విలువ ఇవ్వలేని కవిత.. రాష్ట్ర ప్రజలకు తల్లి ఎలా అవుతుందన్న మునుగోడు ఎమ్మెల్యే.
దేవునపల్లి కవిత పెట్టిన కొత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర షేన(TRS)పై కాంగ్రెస్ నేతలు ఘాటు విమర్శలు చేశారు. ఈ అంశంపై తాజాగా స్పందించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. తండ్రిని తిట్టిన కవిత.. రాష్ట్ర ప్రజలకు తల్లి ఎలా అవుతుందని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. అసలు ఈ కొత్త పార్టీ అంతా కూడా ఆస్తుల కోసం కవిత ఆడుతున్న గేమ్ అంటూ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాని కవిత.. కొత్త పార్టీ పెట్టడం చాలా ఆశ్చర్యంగా ఉందంటూ రాజగోపాల్ రెడ్డి చురకలంటించారు.
ఒక ఉద్యమకారుడి కుమార్తెగా ఉండి ఇలా మాట్లాడటం సరైంది కాదని, కుటుంబ సమస్యలను రాజకీయంగా చూపడం తప్పు అని రాజగోపాల్ పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ ఇంకా పూర్తిగా మూతబడలేదని, కవితకు క్లీన్ చిట్ రాలేదని గుర్తు చేశారు. ఈ సమయంలో పాత పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టడం సరైనది కాదని హితవు పలికారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. గత పదేళ్లలో ఆ పార్టీ పాలనపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసి అధికారంలో నుంచి దింపారని తెలిపారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందని చెప్పారు. అంతేకాకుండా కవిత అసలు పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అని ప్రశ్నించారు. కేవలం ఆస్తి పంపకాల్లో కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు మొదలయ్యాయని, అందుకే బయటకొచ్చి కవిత పార్టీ పెట్టిందని దుయ్యబట్టారు. అంతేకాకుండా కవిత అడుగుతున్న ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు.
ఆ పార్టీ లోపలే విభేదాలు పెరుగుతున్నాయని అన్నారు. ఫోన్ ట్యాపింగ్, ప్రాజెక్టుల అవినీతి అంశాలపై కూడా ఆయన స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిగితే నిజాలు బయటపడతాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు పాత్రధారులు బీఆర్ఎస్ కుటుంబంలోనే ఉన్నారని ఆరోపించారు. బీజేపీపై కూడా ఆయన విమర్శలు చేశారు. కులం, మతం పేరుతో రాజకీయాలు ఎక్కువ కాలం సాగవని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 100కి పైగా సీట్లు సాధిస్తామని చెప్పారు.

