రాయదుర్గం ‘భూ వివాదం’ వెనుక అసలు రహస్యమిదేనా ? (వీడియో)
x

రాయదుర్గం ‘భూ వివాదం’ వెనుక అసలు రహస్యమిదేనా ? (వీడియో)

Raidurgam Land Row: The Hidden Story Behind the Controversy?


రాయదుర్గంలో 5 ఎకరాల వివాదం విషయంలో ఇటు ప్రభుత్వానికి అటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మధ్య పెద్దఎత్తున లీగల్ బ్యాటిల్ నడుస్తున్న విషయం తెలిసిందే. రాయదుర్గంలోని 83/1 సర్వే నెంబర్లోని 5 ఎకరాలను ప్రభుత్వం తరపున టీజీఐఐసీ వేలంవేసిన విషయం తెలిసిందే. ఆ వేలంపాటలో ఎకరాభూమి అత్యధికంగా రు. 237 కోట్లకు అమ్ముడుపోయింది. వేలంపాట ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత సడెన్‌గా బ్యాంకు వివాదాన్ని మొదలుపెట్టింది. తమభూమిని ప్రభుత్వం వేలంవేయటం ఏమిటని నిలదీసింది. నిలదీయటమే కాకుండా ఏకంగా హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు కూడా దాఖలుచేసింది. తమపై బ్యాంకు కోర్టులో కేసు వేయటంతో ప్రభుత్వంకు షాక్ కొట్టినట్లయ్యింది. ఇపుడు వ్యవహారం కోర్టు విచారణలో ఉంది.

అయితే తమపై బ్యాంకు కోర్టులో కేసు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే విషయాన్ని ప్రభుత్వం ఆరాతీసింది. అందులో విస్తుపోయే విషయాలు బయపడినట్లు తెలిసింది. విషయం ఏమిటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రాజకీయనేత తెరవెనుక నుండి చక్రంతిప్పినట్లు ప్రభుత్వానికి అర్ధమైంది. బ్యాంకు ఛైర్మన్ శ్రీనివాసుల శెట్టితో వనపర్తి జిల్లాలోని ఒక రాజకీయ ప్రముఖుడితో బాగా సన్నిహిత సంబంధాలున్నట్లు బయటపడింది. తనకున్న సన్నిహితాన్ని అడ్డంపెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సదరునేత బ్యాంకు ఛైర్మన్ తో మాట్లాడి కోర్టులో కేసు వేసేట్లు వ్యూహం పన్నినట్లు సమాచారం.

నిజానికి ఎస్బీఐకి ప్రభుత్వం పైనచెప్పిన 5 ఎకరాలను కేటాయించింది వాస్తవమే. అలాగే భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేయలేదుకాబట్టి సదరు కేటాయింపును ప్రభుత్వం 2021లో రద్దుచేయటమూ వాస్తవమే. ఇచ్చిన భూ కేటాయింపులను ప్రభుత్వం రద్దుచేయగానే 2021లోనే బ్యాంకు కోర్టులో కేసువేసింది. అయితే రద్దుచేసిన భూమికి ప్రత్యామ్నాయంగా ఉస్మాన్ నగర్, గండిపేట ప్రాంతాల్లో మరో భూమిని కేటాయిస్తామని ప్రభుత్వం బ్యాంకుఅధికారులకు చెప్పింది. ప్రత్యామ్నాయస్ధలం తీసుకోవటానికి ఎస్బీఐ రీజనల్ అధికారులు అంగీకరించిన తర్వాత ఉస్మాన్ నగర్, గండిపేట ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ భూమిని చూపించాలని ప్రభుత్వం టీజీఐఐసీకి 2021, సెప్టెంబర్ 6వ తేదీన లేఖ కూడా రాసింది.

కోర్టులో కేసును ఉపసంహరించుకుని ప్రత్యామ్నాయ భూమికి దరఖాస్తు చేసుకోవాలన్న ప్రభుత్వ సూచనకు సానుకూలంగా బ్యాంకు అధికారులు టీజీఐఐసీ అధికారులతో సమావేశమయ్యారు. పైరెండు ఏరియాల్లో భూమిని తీసుకోవటానికి బ్యాంకు ఉన్నతాధికారులు సానుకూలత తెలిపినట్లు టీజఐఐసీ అధికారులు ప్రభుత్వానికి 2026, మే 5వ తేదీన లేఖ కూడా రాశారు. అలాగే టీజీఐఐసీ చెప్పిన ప్రత్యామ్నాయ భూములను బ్యాంకు అధికారులు 2026, మే 12వ తేదీన వ్యక్తిగతంగా వెళ్ళి పరీశీలించారు. ఆ తర్వాతే టీజీఐఐసీ 5 ఎకరాలను వేలంపాట వేసింది. అయితే తర్వాత ఏమిజరిగిందో ఏమో వెంటనే బ్యాంకు కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు దాఖలుచేసింది.

వేలంపాట వేసిన తర్వాత నుండి ఏమి జరిగిందనే విషయాన్ని ప్రభుత్వం ఆరాతీసినపుడు వనపర్తి జిల్లాకు చెందిన ప్రముఖ నేత బ్యాంకు ఛైర్మన్ తో భేటీ అయినట్లు బయటపడింది. సదరు నేత ప్రోద్బలంతోనే బ్యాంకు ఛైర్మన్ ఆదేశాల కారణంగా బ్యాంకు అధికారులు కోర్టులో కేసు వేసినట్లు ప్రభుత్వానికి అర్ధమైంది. ఇదే విషయమై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్, ఆర్బీఐ ఛైర్మన్ తో ఫిర్యాదు చేయటానికి ఢిల్లీకి వెళ్ళినట్లు సమాచారం. అలాగే ఎస్బీఐకి ఉన్న లీడ్‌బ్యాంక్ హోదాను తొలగించటంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ఫిక్స్ డ్ డిపాజిట్లు, అన్నీ ఖాతాలను ఎస్బీఐనుండి ఉపసంహరించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Read More
Next Story