
‘డేంజర్ జోన్’ లో 18 జిల్లాలు
ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. ఈ సందర్భంలో రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు గాను 18 జిల్లాలు 'డేంజర్ జోన్'లో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది.సాధారణంగా ఆగస్టు నెలలో తెలంగాణ వ్యాప్తంగా 215.8 మిమీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది కేవలం 134.5 మిమీ వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే దాదాపు 38% వర్షాభావ లోటు ఏర్పడింది. జూన్ నుండి ఆగస్టు వరకు మొత్తం సాధారణ వర్షపాతం 573.5 మిమీ ఉండాల్సి ఉండగా, కేవలం 473.8 మిమీ మాత్రమే నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
వాతావరణ మార్పుల కారణంగా వర్షపాత సరళి తీవ్రంగా దెబ్బతిన్నట్లు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వర్షాలు క్రమపద్ధతిలో కాకుండా, రోజుల తరబడి పొడి వాతావరణం ఉండి ఒక్కసారిగా భారీగా కురిస్తే ప్రయోజనం ఉండదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇలా ఒక్కరోజులోనే కురిసే భారీ వర్షాల వల్ల ఉపరితల నీటి ప్రవాహం పెరిగిపోయి నీరంతా వాగులు, వంకల ద్వారా నదుల్లోకి, సముద్రంలోకి వృథాగా కొట్టుకుపోతోందే తప్ప భూమిలో ఇంకే సమయం దొరకడం లేదు. దీని ఫలితంగా భూగర్భ జలాలు రీచార్జ్ కాకపోగా, పంట పొలాల్లో నీరు నిలిచి పైర్లు కుళ్లిపోవడం, నేలలోని సారవంతమైన మట్టి కొట్టుకుపోవడం వంటి తీవ్ర నష్టాలు జరుగుతున్నాయి
ఈ పరిస్థితిపై పర్యావరణవేత్త డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ, ఫార్మ్ పౌండ్స్ అభివృద్ధి చేస్తామని, ఇంకుడు గుంతల నిర్వహణ చేపడతామని ప్రభుత్వం ప్రకటించి రెండు నెలలు గడిచినా క్షేత్రస్థాయిలో చర్యలు శూన్యమని ఆరోపించారు. మూడు నెలల నుంచి ఎల్ నినో పట్ల రైతులకు అవగాహన కల్పిస్తామని, ప్రత్యామ్నాయ పంటలపై ఎడ్యుకేట్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కావడం వల్లే ఈ సంక్షోభం తీవ్రతరమైందని అన్నారు.

