
32 నెలల్లో ఆర్థికంగా పుంజుకున్న తెలంగాణ
గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ₹2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు ఊరటనిచ్చినట్లు చెప్పారు. రైతు భరోసా కింద ₹36 వేల కోట్లకు పైగా సాయం అందించడంతో పాటు సన్నవడ్లకు క్వింటాలుకు ₹500 బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు. గత 32 నెలల్లో వ్యవసాయానికి ₹1.70 లక్షల కోట్లు ఖర్చు చేయడం వల్ల వరి సాగు, దిగుబడిలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని వివరించారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో 335 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు నమోదైనట్లు వివరించారు. 53.09 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 42.90 లక్షల కుటుంబాలకు ₹500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్లు చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు ₹60,487 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించడమే కాకుండా, మహిళలను సోలార్ పంపుల నిర్వహణ, బస్సుల యాజమాన్యం వరకు అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక బలాన్ని వివరిస్తూ, సంక్షేమం అనేది ఆర్థిక భారం కాదని ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచే బాధ్యత అని చెప్పారు. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం 2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం ₹4,18,931గా నిలిచిందని పేర్కొన్నారు. ఇది జాతీయ సగటు తలసరి ఆదాయం కంటే 91 శాతం అధికంగా ఉండటం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సాధించిన విజయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపారు.

