మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ‘రెండంచుల పదును కత్తి’
x
ప్రధాని మోదీకి తన కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డిని పరిచయం చేస్తున్న మాజీమంత్రి మల్లారెడ్డి

మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ‘రెండంచుల పదును కత్తి’

బీఆర్‌ఎస్ నుంచి బీజేపీకి జంప్? మోదీని కలిసిన ప్రీతిరెడ్డి హాట్ టాపిక్


తెలంగాణ సీఎంఆర్ విద్యాసంస్థల అధినేత, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి ప్రధాని నరేంద్ర మోదీను ఢిల్లీలో కలవడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమా? లేక రాజకీయ మార్పుకు సంకేతమా? అన్న ప్రశ్నలు వేడెక్కుతున్నాయి.

సోషల్ మీడియా సంచలనం

డాక్టర్ ప్రీతిరెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. ఈమె నిత్యం వీడియో ఇంటర్వ్యూలతో, డ్యాన్సులతో ,స్పీచ్ లతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంటారు. ‘పాలు అమ్మాను...పూలు అమ్మాను’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన మామ మల్లారెడ్డికి ధీటుగా ప్రీతిరెడ్డి నిత్యం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఆమె రాజకీయాల్లోకి వస్తున్నారని, ‘కమలం’ గూటికి చేరువవుతున్నారనేది ఇపుడు తెలంగాణలో గుప్పుమన్న వార్త. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి చొరవతో ప్రీతిరెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాజకీయాల్లో లేని ఒక సాధారణ డాక్టర్ ప్రధాని మోదీని కలువడమనేది అసాధారణమైన వార్త. ఇది కేవలం మర్యాదపూర్వకమైన సమాచారం కాదని, దీని వెనక రాజకీయం లేకుండా ఉండదని పరిశీలకులు భావిస్తున్నారు. అందునా ఒక మాజీ బీఆర్‌ఎస్ మంత్రి కుటుంబ సభ్యురాలు నేరుగా ప్రధానిని కలవడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రధాని మోదీని కలిశాక త్వరలో బీజేపీ తీర్థం స్వీకరించనున్నారా? మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి బీఆర్‌ఎస్ నుంచి బీజేపీ వైపు వెళుతున్నారనే వార్తలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ప్రధానిని కలిసినంత మాత్రాన ఆమె బీజేపీలో చేరుతున్నట్లు తీసుకోరాదు అని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. “ డాక్టర్ ప్రీతిరెడ్డికి నాయకత్వ లక్షణాలున్నాయి. ఆమె బీజేపీలో చేరతారో లేదో తెలియదు. ఆమె బీజేపీ తరఫున పోటీ చేస్తారనేది అసలు చెప్పనేలేం. అదంతా ఊహాగానమే అవుతుంది. ఒక్కటి మాత్రం నిజం. ప్రీతిరెడ్డి లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండాలి. ఆమె లాంటి వాళ్లు ముందుకు వస్తే, బీజేపీ స్వాగతిస్తుంది,” అని పేరు రాసేందుకు నిరాకరించిన ఆ పార్టీ సీనియర్ నాయకుడొకరు ‘ఫెడరల్ తెలంగాణ’కు తెలిపారు. కోడలు ప్రీతిరెడ్డితో ప్రధాని మోదీని కలవడంపై మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ని ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి సంప్రదించగా, దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.

మహిళా కోటా నేపథ్యంలో...

నియోజకవర్గాల పునర్ విభజన,మహిళా రిజర్వేషన్ కోటా భవిష్యత్ లో రానున్న నేపథ్యం లో రాజకీయ కుటుంబాలకు చెందిన మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి బీఆర్ఎస్ ఫ్యామిలీ నుంచి బీజేపీ వైపు చూస్తున్నారు. తెలంగాణలో రాజకీయ కుటుంబాలకు చెందిన మహిళలు సొంత పార్టీలో అవకాశాలు లేకపోతే ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో పోటీ చేద్దామంటే చోటులేదు. ఇలాంటి వాళ్లకు బీజేపీ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

‘కమలం’ బాటలో ప్రీతిరెడ్డి

బీఆర్ఎస్ కుటుంబానికి చెందిన ప్రీతి రెడ్డి కమలం బాటలోనే పయనిస్తున్నారనడానికి ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలను చూస్తే అవగతమవుతుంది. తనకు కన్నడ, మరాఠీ, హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషలు వచ్చని, తాను భవిష్యత్ లో రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ కావాలని కోరుకుంటున్నానని గతంలో ప్రీతిరెడ్డి ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ప్రకటించారు. పాకిస్థాన్ దేశంలో హైదరాబాద్ నగరం ఉన్నందున, మన హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగర్ గా మార్చాలని ప్రీతిరెడ్డి బీజేపీ వాయిస్ ను ఇటీవల వినిపించేశారు. మరో వైపు తాను హిందూత్వవాదినని ప్రకటించడంతో పాటు మోదీ పాలనను ప్రీతిరెడ్డి మెచ్చుకున్నారు.గత కొన్ని ఇంటర్వ్యూలలో ఆమె కేంద్ర ప్రభుత్వ విధానాలను, ముఖ్యంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని, మోదీ పాలనను ప్రశంసించడం ద్వారా తన రాజకీయ మొగ్గును పరోక్షంగా బయటపెట్టారు.

మల్కాజిగిరి ఎంపీ స్థానంపై దృష్టి

మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తనకు ప్రాబల్యం ఉండటంతో డాక్టర్ ప్రీతిరెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన మామ అయిన చామకూర మల్లారెడ్డి, మల్కాజిగిరి నుంచి తన కుటుంబసభ్యుడు, మల్లారెడ్డి అల్లుడైన మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రీతిరెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దింపే యోచనలో పార్టీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె ఆ నియోజకవర్గ పరిధిలో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు.తెలంగాణకు చెందిన మరో కేంద్రమంత్రి బండి సంజయ్ వంటి నేతలు కూడా ఆమె చేరికపై సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రీతిరెడ్డి రెండంచుల పదను కత్తి

ప్రీతిరెడ్డి కర్నాటక నుంచి వచ్చారు. ఆమె కుటుంబ నేపథ్యం కర్నాటక. ఆమెకు తెలుగు, కన్నడం, మరాఠీ బాషలు వచ్చు. తెలంగాణలో నే కాదు, ఆమెకు భారతీయ జనతా పార్టీ ఈ మూడు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయించే అవకాశం కూడా ఉంది. ఆమెను పార్లమెంటుకు తీసుకెళ్లాలనుకుంటే, బీజేపీ బలంగా ఉన్న కర్నాటక, మహారాష్ట్రాల నుంచి కూడా పోటీచేయించవచ్చని మరో బీజేపీ నాయకుడు చెప్పారు.

బీఆర్‌ఎస్‌కు షాక్

మల్లారెడ్డి కుటుంబం ఇప్పటికీ బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటికీ, కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి బీజేపీ వైపు వెళ్లడం ఆ పార్టీకి కొంత ఇబ్బందికర పరిణామమే.బీజేపీలో ప్రీతిరెడ్డి చేరనున్నారనే వార్తలపై మల్లారెడ్డి కుటుంబం ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ఖండన ఇవ్వకపోవడంతోపాటు భవిష్యత్ లో తమ కుటుంబం నుంచి నలుగురైదుగురు రాజకీయాల్లోకి వస్తారని జోస్యం చెప్పారు. దీంతో ప్రీతిరెడ్డి రాజకీయ ఎంట్రీ దాదాపు ఖాయమని సంకేతాలిస్తోంది.

ఎవరీ ప్రీతిరెడ్డి?

ప్రీతిరెడ్డి వృత్తిరీత్యా డాక్టర్.ఎండీ మెడిసిన్స్ చదివే సమయంలో మల్లారెడ్డి కుమారుడు భద్రా రెడ్డితో పరిచయం ప్రేమగా మారింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈమె మల్లారెడ్డి కుమారుడు డాక్టర్ భద్రారెడ్డిని వివాహం చేసుకున్నారు.ఈమె తండ్రి వృత్తిరీత్యా డాక్టర్, తల్లి సైంటిస్ట్.తండ్రి ఉద్యోగ రీత్యా వారి కుటుంబం కర్ణాటక నుంచి పూణేకు మారింది. ప్రీతిరెడ్డి తన విద్యాభ్యాసం అంతా పూణేలోనే పూర్తి చేశారు. ఆమె మెడిసిన్‌లో ఎండి చదివారు. ప్రీతిరెడ్డి దంపతులకు ఇద్దరు పిల్లలు.ప్రస్తుతం ఈమె మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్, మల్లారెడ్డి హెల్త్ సిటీకి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

సేవా కార్యక్రమాలు

మల్లారెడ్డి ఫౌండేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడంలో డాక్టర్ ప్రీతిరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల విమానంలో తోటి ప్రయాణికుడికి గుండెపోటు వస్తే సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడటంతో ఈమె వార్తల్లో నిలిచారు.మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్‌గా, మెడికల్, డెంటల్, ఉమెన్స్ కాలేజీల నిర్వహణలో ఈమె కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఛాంపియన్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డు

డాక్టర్ ప్రీతిరెడ్డి విద్యావేత్తగా, వైద్యురాలిగా ఉన్న గుర్తింపుతో పాటు, ఇటీవలే ఛాంపియన్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డును కూడా అందుకున్నారు. ఈ సామాజిక గుర్తింపు ఆమె రాజకీయ ప్రస్థానానికి ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజకీయ ప్రస్థానం

గత ఎన్నికల్లో తన మామ మల్లారెడ్డి తరపున ప్రీతిరెడ్డి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు.మామయ్య కోసం ఎక్కడైనా ఛాలెంజ్ గా తీసుకుని ప్రచారం చేస్తానని గతంలో ప్రకటించారు. వరుస ఇంటర్య్యూలతో సోషల్ మీడియాలో దూసుకుపోతున్న మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ప్రధాని మోదీని కలవడం వైరల్ అయింది.మల్లారెడ్డి కుటుంబానికి చెందిన ప్రీతిరెడ్డి ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

ప్రీతిరెడ్డి స్టయిల్ వైరల్

రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న డాక్టర్ ప్రీతిరెడ్డి స్టైలిష్ ప్రెజెన్స్, పబ్లిక్ అపియరెన్స్, డ్యాన్స్ చేసినా, స్పీచ్ ఇచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మల్లారెడ్డి ఫ్యామిలీకి ఉన్న రాజకీయ ప్రాధాన్యం ఉండటంతో సోషల్ మీడియాలో ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. ప్రీతిరెడ్డి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. చాలా మంది ఆమెపై ఆసక్తి చూపిస్తూ ఆమె గురించి సెర్చ్ చేస్తున్నారు.

ప్రీతిరెడ్డి డ్యాన్స్ వీడియోలు అదుర్స్

మామ మల్లారెడ్డి షష్టిపూర్తి సంగీత్ ఫంక్షన్‌లో కోడలు ప్రీతి అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో అందరినీ ఆకట్టుకున్నారు.సినీ హీరో నవీన్ పొలిశెట్టికి పోటీగా డ్యాన్స్ చేసి మల్లారెడ్డి కోడలా మజాకా అనిపించుకున్నారు. మరోసారి మహిళా గర్జన లో బోనం ఎత్తి డాన్స్ చేసి ఆకట్టుకున్నారు.మరోసారి ‘‘రాను బొంబాయి కి రాను’’ పాటకి డాన్స్ తో అలరించారు.తల్లీతండ్రీ లేని తనకు అత్తా మామలే తనకు అమ్మా నాన్నా అని ప్రీతి ప్రకటించారు.పవన్ కళ్యాణ్ మేనరిజం ఇమిటేట్ చేసి ఫంక్షన్‌లో గెస్టులను అలరించారు.మహాశివరాత్రి వేడుకల్లో ప్రీతిరెడ్డి అదిరిపోయే డ్యాన్స్ చేశారు.
మోదీతో భేటీ తర్వాత డాక్టర్ ప్రీతిరెడ్డి పేరు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది కేవలం ఒక మర్యాదపూర్వక సమావేశమేనా? లేక బీజేపీ వైపు కీలక అడుగేనా? అన్నది త్వరలో స్పష్టతకు రానుంది. అయితే ఒక విషయం మాత్రం ఖాయం...ప్రీతిరెడ్డి రాజకీయ ఎంట్రీపై కౌంట్‌డౌన్ ప్రారంభమైందనే అభిప్రాయం బలపడుతోంది.
Read More
Next Story