డీలిమిటేషన్ పై బండి, కిషన్ రచ్చ రచ్చ
x

డీలిమిటేషన్ పై బండి, కిషన్ రచ్చ రచ్చ

ప్రోరేటా పద్దతిలో హైబ్రీడ్ విధానాన్ని కేంద్రప్రభుత్వం అమలుచేస్తే ధక్షిణాదిరాష్ట్రాలకు కొంతవరకు న్యాయంజరుగుతుందని రేవంత్ సూచించారు


ఇపుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అన్నది ఏమైనా ఉందంటే అది డీలిమిటేషన్ అంశమనే చెప్పాలి. నియోజకవర్గాల పునర్విభజనకు ఉద్దేశించిన డీలిమిటేషన్ అమలువల్ల ధక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పదేపదే మొత్తుకుంటున్నారు. ప్రోరేటా పద్దతిలో హైబ్రీడ్ విధానాన్ని కేంద్రప్రభుత్వం అమలుచేస్తే ధక్షిణాదిరాష్ట్రాలకు కొంతవరకు న్యాయంజరుగుతుందని రేవంత్ సూచించారు. అయితే రేవంత్ సూచనను గాలికి వదిలేసిన కేంద్రమంత్రులు బండి సంజయ్, జీ కిషన్ రెడ్డి తమదైన పద్దతిలో డీలిమిటేషన్ వల్ల ఎలాంటి నష్టం జరగదంటు ఊకదంపుడు ఉపన్యాసాలు, ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు

డీలిమిటేషన్‌వల్ల ధక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయంజరగదు అని చెబుతున్న కేంద్రమంత్రులు ఏ విధంగా న్యాయం జరుగుతుందో మాత్రం చెప్పటంలేదు. 50శాతం శ్లాబ్ తో డీలిమిటేషన్ అమలుచేయటం వల్ల ధక్షిణాది రాష్ట్రాలకు ఏ రూపంలో అన్యాయం జరుగుతుంది అనే విషయాన్ని రేవంత్ చక్కగా అర్ధమయ్యేట్లుగా వివరించారు. రేవంత్ చెప్పిన ప్రకారం ఉత్తరాధి-ధక్షిణాది రాష్ట్రాల మధ్య పార్లమెంటులో ఎంపీల సంఖ్యలో చాలా తేడాలున్నాయి. మొత్తం 543 ఎంపీల సంఖ్యలో ఉత్తరాధి షేర్(నాన్ సౌత్) 413 అయితే ధక్షిణాది ఎంపీల వాటా 130. ఇపుడున్న సంఖ్యను 50 శాతం శ్లాబ్ ప్రకారం అన్నీ రాష్ట్రాల్లోను ఎంపీల సీట్ల సంఖ్యను పెంచబోతున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటననే రేవంత్ తప్పుపడుతున్నారు. ఇపుడున్న ఎంపీల సంఖ్యను అలాగే ఉంచకుండా ఈ సంఖ్యకు 50శాతం శ్లాబ్ ప్రకారం పెంచితే ధక్షిణాది రాష్ట్రాలకు మరింతగా నష్టం జరుగుతుందని అంటున్నాడు.

ఎలాగంటే తెలంగాణలో ఇపుడున్న ఎంపీల సంఖ్య 17. దీనికి అదనంగా 50శాతం పెంచితే పెరిగే ఎంపీల సంఖ్య 25. ఉత్తరప్రదేశ్ లో ఇపుడున్న ఎంపీల సంఖ్య 80. దీనికి 50శాతం కలిపితే అంటే 40 పెరగబోయే ఎంపీల సంఖ్యతో కలుపుకుని 120 అవుతుంది. ఈ రెండురాష్ట్రాల మధ్య ఇపుడున్న ఎంపీల సంఖ్య మధ్య తేడా 80-17=63. అదే 50శాతం శ్లాబ్ ప్రకారం తేడా 120-25=95. ఇపుడున్న తేడా 63 ఎక్కడ సీట్లు పెరిగితే పెరగబోయే తేడా 95 ఎక్కడ ? ఇదే పద్దతిలో ప్రతి ఉత్తరాధి రాష్ట్రంలోను సీట్ల సంఖ్య పెరిగిపోతుందని, ధక్షిణాది రాష్ట్రాల్లోని ఎంపీల సంఖ్యకు బాగా అంతరం వచ్చేస్తుందని రేవంత్ అంటున్నాడు. అందుకనే ప్రోరేటా పద్దతిలో హైబ్రీడ్ విధానాన్ని అమలుచేస్తే అంతరాలు తగ్గుతాయని చెబుతున్నాడు.

ప్రోరేటాలో హైబ్రీడ్ పద్దతి ఏమిటంటే 543 సీట్లను పెంచితే పార్లమెంటులో మొత్తం ఎంపీల సంఖ్య 816 అవుతుంది. ఇపుడున్న సంఖ్య 543కి బదులు 816 అంటే 273 సీట్లు పెరుగుతాయి. ఈ 273 సీట్లలో సంగం సీట్లను అంటే సుమారు 136 సీట్లను అన్నీ రాష్ట్రాల్లోను పెంచి మిగిలిన 136 సీట్లను కేవలం ధక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే పెంచాలని చెబుతున్నాడు. అదికూడా దేశ ఆర్ధికప్రగతికి ధక్షిణాది రాష్ట్రాల వాటా ప్రకారం 136 సీట్లను పెంచాలని అంటున్నాడు. అప్పుడు కూడా ఉత్తరాధి రాష్రాల ఎంపీలకు ధక్షిణాది రాష్ట్రాల ఎంపీల సంఖ్యలో అంతరం ఉన్నా, అంతరం తగ్గుతుందని రేవంత్ చెబుతున్నాడు. ప్రోరేటా హైబ్రీడ్ పద్దతిని రేవంత్ ఎందుకు చెబుతున్నట్లు ? ఎందుకంటే, 1971లో నియోజకవర్గాల పునర్విభజన అన్నది జనాభాపైన ఆధారపడి జరిగింది. 1970లో కేంద్రప్రభుత్వం జనాభాను అరికట్టే ఉద్దేశ్యంతో కుటుంబనియంత్రణ విధానాన్ని అమలుచేసింది. కుటుంబనియంత్రణ కార్యక్రమాన్ని ధక్షిణాదిరాష్ట్రాలు క్రమశిక్షణతో కఠినంగా అమలుచేశాయి. దానివల్లే ఉత్తర-ధక్షిణాది రాష్ట్రాల జనాభాలో భారీ తేడాలు కనబడుతున్నాయి. కుటుంబనియంత్రణ కార్యక్రమాన్ని ఉత్తరాధి రాష్ట్రాలు పెద్దగా పాటించకపోవటం వల్ల ఉత్తరాధిలో జనాభా పెరిగిపోయింది.

దీన్నే రేవంత్ ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాడు. కుటుంబనియంత్రణ కార్యక్రమాన్ని కఠినంగా అమలుచేసినందుకే ధక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని చెబుతున్నాడు. కేంద్రప్రభుత్వ కార్యక్రమాన్ని అమలుచేసేనందుకే ఇపుడు ధక్షిణాది రాష్ట్రాలను నరేంద్రమోదీ ప్రభుత్వ శిక్షిస్తోందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాడు. కుటుంబనియంత్రణ కార్యక్రమాన్ని అమలుచేసినందుకు కేంద్రప్రభుత్వం ఇన్సెంటివ్‌గా 136 సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాడు. అయితే రేవంత్ సూచనను కేంద్రప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. వాళ్ళు అనుకున్న పద్దతిలోనే ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయ్యారు.

ఈ విషయాలను బండి, కిషన్ ఏమాత్రం పట్టించుకోవటంలేదు. సింపుల్ గా డీలిమిటేషన్ ను వ్యతిరేకించటం దుర్మార్గమని, అన్యాయమంటు నానా రచ్చచేస్తున్నారు. రేవంత్ చేసిన సూచనను, పరిష్కార మార్గాన్ని మాత్రం పొరబాటున కూడా కేంద్రమంత్రులు ప్రస్తావించటంలేదు.

Read More
Next Story