కవిత వల్ల బీఆర్ఎస్ కు డ్యామేజి తప్పదా ?
x

కవిత వల్ల బీఆర్ఎస్ కు డ్యామేజి తప్పదా ?

కేసీఆర్ పైన అసంతృప్తిగా ఉన్న నేతలు, రాబోయే ఎన్నికల్లో టికెట్లురావని అనుమానాలు ఉన్న నేతలంతా ఇపుడు కవిత కొత్తపార్టీలో చేరే అవకాశాలున్నాయి


కొత్తపార్టీని కల్వకుంట్ల కవిత 25వ తేదీన ప్రకటించబోతున్నారు. తనపార్టీ బలోపేతం అవటానికి ఇతరపార్టీల్లోని గట్టి నేతలకు కవిత గాలమేస్తున్నట్లు అర్ధమవుతోంది. రెండుసార్లు బీఆర్ఎస్ ఎంఎల్ఏగా చేసి కాంగ్రెస్ లో ఉన్న రాథోడ్ బాబూరావును తనపార్టీలో చేర్చుకున్నారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ నేతలు తమపార్టీలో చేరటానికి ఆసక్తిగా ఉన్నారని కవిత చెప్పారు. తెలంగాణ ప్రజా జాగృతి పార్టీలో చేరే విషయమై తనతో టచ్‌లో ఉన్నట్లు కవిత చెప్పిందే నిజమైతే బీఆర్ఎస్‌కు ఎంతో కొంత నష్టం తప్పదనే అనుకోవాలి. కేసీఆర్ పైన అసంతృప్తిగా ఉన్న నేతలు, రాబోయే ఎన్నికల్లో టికెట్లురావని అనుమానాలు ఉన్న నేతలంతా ఇపుడు కవిత కొత్తపార్టీలో చేరే అవకాశాలున్నాయి. జిల్లాల వారీగా నేతల భేటీలతో కవిత చాలా బిజీగా ఉన్నారు.

మేడ్చల్ జిల్లా మునీరాబాద్ గ్రామంలోని ఒక ఫంక్షన్‌హాలులో శనివారం ఉదయం కవిత పార్టీప్రకటన చేయబోతున్నారు. ఫార్మల్‌గా పార్టీపేరును గతంలోనే ప్రకటించినప్పటికీ ముహూర్తం బాగుండటంతో శనివారం ఉదయం పార్టీనేతలు, మద్దతుదారుల సమక్షంలో పార్టీపేరు, జెండా, అజెండా తదితరాలను కవిత ప్రకటించబోతున్నారు. ఉదయం 10.30-11 గంటల మధ్యలో ఈ ప్రకటన ఉండవచ్చని జాగృతివర్గాలు చెప్పాయి. ఈ నేపధ్యంలోనే ఒక మోస్తరు బహిరంగసభలాంటిది కూడా నిర్వహించేందుకు పార్టీ అన్నీ ఏర్పాట్లను చేస్తోంది. వివిధ జిల్లాల నుండి జాగృతి మద్దతుదారులు, కార్యకర్తలతో పాటు తనపార్టీలో చేరబోయే ఇతర పార్టీల మద్దతుదారులు, కార్యకర్తలు కలిపి సుమారు 50 వేలమంది వరకు సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

పార్టీ ప్రకటన తర్వాత సభ సందర్భంగా పార్టీలో చేరబోయే వారితో కవిత చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ తరపున రెండుసార్లు ఎంఎల్ఏగా గెలిచిన రాథోడ్ బాబూరావు ఈమధ్యనే తన మద్దతుదారులతో పార్టీలో చేరారు. అలాగే బీఆర్ఎస్ లోని ద్వితీయశ్రేణి నాయకత్వం జాగృతి పార్టీలోచేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. గడచిన తొమ్మిదిన్నరేళ్ళుగా పార్టీలో పనిచేస్తున్నా నిరాధరణకు గురై అసంతృప్తితో ఉన్నవారిని పార్టీలో చేర్చుకునే విషయంలోనే కవిత ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. గ్రామ, మండల స్ధాయిలో గట్టి నేతలను తమ పార్టీలో చేర్చుకుంటే తొందరలోనే జరగబోయే పరిషత్ ఎన్నికల్లో గట్టిప్రభావం చూపించవచ్చని కవిత ఆలోచిస్తున్నారు.

565 జిల్లా పరిషత్ లు, 5675 మండల పరిషత్‌లకు ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఈఎన్నికల్లో పోటీచేయటానికి వేలాదిమంది గట్టి నేతలు కావాలి. ఈఎన్నికలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించినవనే చెప్పచ్చు. మున్సిపలేతర ప్రాంతమంతా గ్రామీణ ప్రాంతంకిందకే వస్తుంది కాబట్టే పరిషత్ ఎన్నికలు చాలా కీలకమైనవి. గ్రేటర్ హైదరాబాద్ వెలుపలి ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రస్తుతం బాగా బలహీనంగా ఉంది. అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ క్యాడర్ ను తన పార్టీలోకి లాక్కుని కారును దెబ్బకొట్టాలన్నది కవిత వ్యూహంగా కనబడుతోంది. అందుకనే జిల్లాల నుండి వస్తున్న నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ విషయాలపై క్షేత్రస్ధాయిలో పరిస్ధితిని తెలుసుకునేందుకే దాదాపు రెండునెలలు ‘జనంబాట’ పేరుతో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పాదయాత్ర చేశారు. పరిషత్ ఎన్నికల్లో తన పార్టీ తరపునే బీఫారమ్ లు ఇచ్చి జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కు గట్టి సవాలు విసరాలని కవిత నిర్ణయించినట్లు సమాచారం.

తెలంగాణకు జాతీయ పార్టీలకన్నా ప్రాంతీయపార్టీ అవసరమే ఎక్కువగా ఉందని కవిత పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో తనపార్టీ మాత్రమే ప్రాంతీయపార్టీ కాబట్టి ప్రజలు తెలంగాణ ప్రజా జాగృతిని ఆదరించాలని జనాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారంలో ఇంకా రెండున్నరేళ్ళుంటుంది కాబట్టి కాంగ్రెస్ లో నుండి కవిత పెట్టబోయేపార్టీలోకి మారే నేతలు దాదాపు ఉండరు. అలాగే బీజేపీలో నుండి కవిత పార్టీలో చేరే నేతలు ఉందరనే అనుకోవాలి. ఇక మిగిలింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కారుపార్టీలో నుండి కవిత పార్టీలోకి నేతలు చేరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కవిత కూడా ఒకపుడు బీఆర్ఎస్ లో చాలా కీలకంగా వ్యవహరించిన నేత. పార్టీలో నుండి కవితను బయటకు గెంటేసినా ఆమెతో కొందరు నేతలు టచ్ లోనే ఉన్నట్లు జాగృతి వర్గాలు చెబుతున్నాయి. కవిత మాటల్లో కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.

బీఆర్ఎస్ లోని చాలామంది పార్టీ నేతలు తనతో టచ్ లో ఉన్నట్లు కవిత చెబుతున్నారు. నిజంగానే అంతమంది నేతలు టచ్ లో ఉన్నారా ? లేకపోతే పార్టీ నాయకత్వంపై మైండ్ గేమ్ ఆడుతున్నారో అర్ధంకావటంలేదు. కవిత చెబుతున్నట్లు నిజంగానే వివిధ జిల్లాల్లోని నేతలు ఆమెతో టచ్ లో ఉండి పార్టీలో చేరటం ఖాయమైతే మాత్రం కారుపార్టీకి కొంత డ్యామేజి జరగటం ఖాయమనే అనుకోవాలి. అందుకనే 25వ తేదీన కవిత పార్టీలో చేరబోయే నేతలు ఎవరు అనే విషయం ఆసక్తిగా మారింది.

Read More
Next Story