రేవంత్, మంత్రులు త్యాగాలకు సిద్ధం ?
x

రేవంత్, మంత్రులు త్యాగాలకు సిద్ధం ?

రేవంత్, మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీల జీతాల్లో 50శాతం త్యాగానికి అందరు రెడీ అవుతున్నారు


ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు తమ జీతాల్లో 50శాతం త్యాగంచేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో చర్చకు వచ్చింది. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ గురించి సుదీర్ఘంగా చర్చ జరిగింది. అలాగే ఇపుడు జరుగుతున్న ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమ్మె విషయంపైన కూడా చర్చించింది. ఆర్ధిక వనరుల సమీకరణపై చర్చిస్తున్నపుడు తమతో పాటు ప్రజాప్రతినిధుల జీతాల్లో 50శాతం వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ కు మంత్రులు సూచించారు. తమజీతాల్లో 50శాతం కోత కారణంగా ప్రభుత్వానికి ఆదా అయ్యే నిధులను రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్‌కు జమచేయటానికి మంత్రులు స్వచ్చంధంగా సిద్దపడ్డారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు జీతాల్లో 50శాతం త్యాగం చేయటానికి రెడీ అయినాక రేవంత్ మాత్రం ఎందుకు ఊరుకుంటారు, తాను కూడా రెడీ అన్నారు.

అందుకనే రేవంత్, మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీల జీతాల్లో 50శాతం త్యాగానికి అందరు రెడీ అవుతున్నారు. ఈ కోత లేదా త్యాగం అన్నది అర్జంటుగా పలానా నెలనుండే అమలవుతుందని చెప్పేందుకు లేదు. ఎందుకంటే ఆర్ధిక సమస్యలపై అధ్యయనం చేస్తున్న మంత్రులు, ఉన్నతాధికారుల బృందం తమ రిపోర్టు ఇచ్చిన తర్వాత తప్పదు అనుకుంటే జీతాల త్యాగంపై రేవంత్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. తెలంగాణలో 119 మంది ఎంఎల్ఏలు, 40 మంది ఎంఎల్సీలున్నారు. 119 మంది ఎంఎల్ఏల్లోనే 18 మంది మంత్రులున్నారు. రేవంత్ జీతం సుమారుగా నెలకు 4 లక్షలు, మంత్రి జీతం సుమారుగా 3 లక్షలు, ఎంఎల్ఏకి 2.50 లక్షల రూపాయలు, ఎంఎల్సీకి రు. 2.5 లక్షల జీతముంది.

రేవంత్ జీతం రు. 4 లక్షలు+మంత్రుల జీతాలు రు. 54 లక్షలు+ఎంఎల్ఏల జీతాలు రు. 3 కోట్లు+ఎంఎల్సీల జీతాల రు. 1 కోటి= రు. 4.58 కోట్లు అవుతుంది. ఇందులో సగం జీతం అంటే 2.27 కోట్లను త్యాగం చేయాల్సుంటుంది. పబ్లిక్ కాజ్ కోసం జీతాల్లో కోత పెట్టుకోవటం అన్నపుడు ఎవరూ తమ జీతంలో కోత పెట్టేందుకు లేదు అని చెప్పలేరు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బెనిఫిట్స్ సుమారు రు. 10 వేల కోట్లుంటుంది. చెల్లించాల్సిన బకాయిలు కొండలాగ పేరుకుపోయినపుడు మంత్రులు, ప్రజా ప్రతినిధుల జీతాల్లో 50 శాతం త్యాగంద్వారా ఆదా అయ్యే రు. 2.27 కోట్లు ఏ మూలకు పనికివస్తుంది ? అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఆర్ధిక వనరుల సమీకరణలో జీతాల్లో 50శాతం త్యాగానికి సిద్ధపడిన మంత్రుల స్పిరిట్.

నిజానికి సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధుల జీతాల్లో కోత లేదా త్యాగానికి సిద్దపడటం అన్నది హిమాచల్ ప్రదేశ్ నుండి స్పూర్తిగా తీసుకున్నట్లున్నారు.

హిమాచల్ లో ఏమైంది ?

2022 ఎన్నికల్లో అధికారంలోకి రావటంకోసం హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యంకాని హామీలను ఇచ్చేసింది. కాంగ్రెస్ హామీలను నమ్మిన జనాలు ఓట్లేసి అధికారం కట్టబెట్టారు. ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్, మహిళలకు నెలకు రు. 1500 ల్లాంటి అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన పడింది. దాంతో అక్కడి ప్రభుత్వం తల్లకిందులైపోతోంది. ఆర్ధిక పరిస్ధితి తల్లకిందులైపోవటానికి ప్రధాన కారణం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలనే చెప్పాలి. 2026 నాటికి రాష్ట్ర ఖజానా జీతాలు, పెన్షన్లు చెల్లించలేని స్ధితికి చేరుకుంది. రాష్ట్ర బడ్జెట్ రు. 58 వేల కోట్లయితే ఆదాయం రు. 20 వేల కోట్లు మాత్రమే.

ఖర్చులు-ఆదాయం మధ్య అంతరం రు. 38వేల కోట్లు అవటంతో నిధులను సమకూర్చుకునేందుకు అక్కడి ప్రభుత్వం నానా అవస్ధలు పడుతోంది. ఖర్చులు తగ్గించుకోవటంతో పాటు ఆర్ధికవనరుల సమీకరణకు మార్గాలను వెతుక్కుంటోంది. నిధుల సమీకరణ అంత తేలికగా అయ్యే పనికాదు. అందుకనే ఖర్చులు తగ్గించుకోవటంలో భాగంగా ముందు తనతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధుల జీతాల్లో 50శాతం కోత విధించాలని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు డిసైడ్ అయ్యారు. దాని ఫలితమే సీఎం జీతంలో 50 శాతం కోత. అలాగే డిప్యుటి సీఎం, క్యాబినెట్ మంత్రులు, స్పీకర్, డిప్యుటి స్పీకర్ జీతాల్లో 30శాతం, ఎంఎల్ఏల జీతంలో 20శాతం కోతేస్తున్నారు. ఈ కోత సీఎం, మంత్రులు, స్పీకర్ కే పరిమితం కాకుండా ఉన్నతాధికారుల జీతాల్లో 30శాతం, మధ్యస్ధాయి అధికారుల జీతాల్లో 20శాతం కోతేస్తున్నారు. మూడు, నాలుగో తరగతి ఉద్యోగులను మాత్రం జీతాల కోతలో నుండి మినహాయించారు.

కాబట్టి తెలంగాణలో మంత్రుల జీతాల్లో త్యాగాలకు మూలం హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయమని అర్ధమవుతోంది. అక్కడ ఆరుమాసాల పాటు జీతాల్లో కోత విదిస్తున్నట్లు ప్రభుత్వం ఏకంగా ఉత్తర్వులను జారీచేసింది. మరిక్కడ కూడా అలాంటి పరిస్దితే వస్తే ప్రభుత్వం ఏమిచేస్తుందో చూడాలి.

ఇంతటి ఆర్ధిక ఇబ్బందులకు కారణం ఏమిటంటే ఎన్నికల్లో గెలుపుకు అలవికాని, ఆచరణ సాధ్యంకాని హామీలను ఇవ్వటమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2023 ఎన్నికల్లో గెలుపు కోసం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు నెలకు రు. 2500, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, అర్హులైన పేదలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కాలేజీలకు వెళ్ళే విద్యార్ధినులకు ఉచిత స్కూటీలు, మహిళలకు తులం బంగారం లాంటి హామీలిచ్చారు. నిజానికి ఇందులో ఏ ఒక్కటి కూడా ఆచరణకు సాధ్యమైనవి కావు. అసలు పైన హామీలను ఇవ్వమని ఎవ్వరూ అడగలేదు. అధికారంలోకి రావాలన్న ఏకైక లక్ష్యంతో తనంతట తానుగా రేవంతే పై హామీలను ఇచ్చాడు.

ఇదే సమయంలో కేసీఆర్ కూడా మూడోసారి అధికారంలో కంటిన్యు అవటానికి నోటికొచ్చిన హామీలను ఇచ్చేశారు. తాము ఏమీ తక్కువ తినలేదని బీజేపీ కూడా చాలా హామీలను గుప్పించింది. మూడు పార్టీల హామీల్లో జనాలు కాంగ్రెస్ ను నమ్మిగెలిపించారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రేవంత్ బీద అరుపులు అరుస్తున్నది అందరు వింటున్నదే. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పలాగ చేసేశాడు, అప్పులకు వడ్డీలు కట్టలేక తాను అవస్తలు పడుతున్నట్లు పదేపదే చెబుతున్నాడు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి బాగాలేదని తెలిసి కూడా పార్టీలు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇవ్వటం వల్లే రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోయి చివరకు దివాలా స్ధితికి చేరుకుంటున్నాయి. మరి జీతాల త్యాగం ఎప్పటినుండి మొదలవుతుందో చూడాల్సిందే.

Read More
Next Story