అసెంబ్లీనా.. ఆధిపత్య పోరుకు వేదికా?
స్పీకర్‌ను బీఆర్ఎస్ ఎంఎల్సీ బూతులు తిట్టడం లాంటి వివాదాస్పద ఘటనలతో అసెంబ్లీ, కౌన్సిల్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి.
నిరసనలు, తోపులాటలు, కిందపడిన కొందరు ఎంఎల్ఏలకు గాయాలు, బీఆర్ఎస్ ఎంఎల్ఏ చీర లాగేశారనే ఆరోపణలు, స్పీకర్‌ను బీఆర్ఎస్ ఎంఎల్సీ బూతులు తిట్టడం లాంటి వివాదాస్పద ఘటనలతో అసెంబ్లీ, కౌన్సిల్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఒకపుడు సమస్యలపై చర్చించి పరిష్కారం చూపిన అసెంబ్లీ సమావేశాలు కొంతకాలంగా అధికార-ప్రతిపక్షాల మధ్య బలప్రదర్శనకు వేదికగా మారిపోయింది. అందుకనే ఒకరిపై మరొకరు ఆధిపత్యం సాధించామని చెప్పుకోవటానికి వ్యక్తిగత ధూషణలతో మొదలుపెట్టి చివరకు బూతులు తిట్టుకునే స్ధాయికి చేరుకున్నారు కొందరు సభ్యులు.
సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులు, బీఆర్ఎస్ సభ్యుల మధ్య జరిగిన ఘటనలు ఇందులో భాగమనే చెప్పాలి. బీఆర్ఎస్ ఎంఎల్సీ తాతా మధు పోలీసులతో దురుసుగా మాట్లాడుతు ఎవడ్రా మీకు ఆదేశాలు ఇచ్చిన......... అంటు బూతులు తిట్టడం ఇపుడు సంచలనంగా మారింది. గతంలో ప్రతిపక్ష సభ్యులకు అధికారపార్టీపై ఎంత కోపమున్నా అసెంబ్లీలో స్పీకర్ లేదా కౌన్సిల్ ఛైర్మన్ ను తిట్టేవారు కాదు.
ఇపుడు తాతామధు స్పీకర్ ను బూతులు తిట్టడంతో వెంటనే తనను కౌన్సిల్ నుండి బహిష్కరించటమే కాకుండా కౌన్సిల్ సభ్యుడిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని మంత్రులు డిమాండ్లు చేస్తున్నారు. మొదటిరోజే అసెంబ్లీ ప్రాంగణంలో ఇంతటి గందరగోళం జరిగితే రెండో రోజు దీని ప్రభావంతో ఇంకెంత గందరగోళం జరుగుతుందో చూడాల్సిందే.

