సిట్ విచారణను లెక్కచేయని భగీరథ...ఇరకాటంలో బండి సంజయ్
x

సిట్ విచారణను లెక్కచేయని భగీరథ...ఇరకాటంలో బండి సంజయ్

కేంద్రమంత్రికి వ్యతిరేకంగా ఉద్యమించటానికి బీఆర్ఎస్ కు బలమైన ఆయుధం దొరికినట్లయ్యింది.


పోక్సో కేసులో విచారణను ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ సిట్ నోటీసును ఏమాత్రం లెక్కచేయలేదు. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో భగీరథపై పేట్ బషీర్ బాద్ పోలీసులు పోక్సో కేసు నమోదుచేశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సంబంధిత పోలీసుస్టేషన్లో విచారణకు హాజరవ్వాలని మంగళవారం పోలీసులు నోటీసులు జారీచేశారు. అయితే ఆ నోటీసులను నిందితుడు ఏమాత్రం లెక్కచేయలేదు. విచారణకు పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్లో హాజరవ్వలేదు. దాంతో నిందితుడి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

తనపై నిందితుడు లైంగిక దాడిచేశాడని ఒక మైనర్ బాలిక ఈనెల 8వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పేట్ బషీరా బాద్ పోలీసులు భగీరథపై పోక్సో కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. తనపైన కేసు నమోదైన విషయం తెలియగానే నిందితుడు కూడా అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మపైన హనీట్రాప్, బెదిరింపుల కేసును కరీంనగర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేశాడు. నిందితుడు ఫిర్యాదుమేరకు పోలీసులు తల్లీ, కూతుళ్ళపైన కేసులు నమోదుచేశారు.

అయితే పోలీసుల విచారణకు తల్లీ, కూతుళ్ళు అందుబాటులో ఉండగా నిందితుడు మాత్రం పరారీ అయిపోయాడు. దాంతో అందరికీ నిందితుడి మీద అనుమానాలు పెరిగిపోతున్నాయి. తప్పుచేయకపోతే పరారీ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందనే చర్చ పెరిగిపోతోంది. ఇదిలా ఉండగా కేసు చుట్టూ సామాజికపరమైన, రాజకీయ వివాదాలు పెరిగిపోతున్నాయి. తాము బీసీలం కాబట్టే తమను అణగదొక్కేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోందని స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండ సంజయ్ ఆరోపించటమే ఆశ్చర్యంగా ఉంది. తప్పులు చేస్తే సామాజికవర్గాల ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అనే ప్రశ్నలు బండికి ఎదురయ్యాయి. దాంతో బీసీ, వేధింపులు అన్న మాటలను బండి ఇపుడు వాడటంలేదు.

అయితే ఇదే సమయంలో బండిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశ్యంతో బీఆర్ఎస్ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. బండి భగీరథను వెంటనే అరెస్టుచేయాల్సిందే అంటు పదేపదే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నేతలు డిమాండ్లు చేస్తున్నారు. నిందితుడి మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందే అని తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎలాగైనా కేంద్రమంత్రిని ఇరకాటంలో పడేయటమే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోందన్నది వాస్తవం. ఇంతకాలం సంజయ్ ను ఇరుకునపెట్టడానికి బీఆర్ఎస్ కు ఎలాంటి అవకాశం రాలేదు. ఇపుడు వచ్చిన అవకాశాన్ని బీఆర్ఎస్ వదులుకోవాలని అనుకోవటంలేదు. అందుకనే కారుపార్టీ సీనియర్ నేతలు, యువ, మహిళా నేతలన్న తేడాలేకుండా బండి సంజయ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.

పోక్సో విచారణకు హాజరుకాకపోతే..

పోక్సో కేసులో విచారణకు హాజరుకాకపోతే ఏమవుతుంది ? అనే చర్చ పెరిగిపోతోంది. న్యాయ నిపుణుల ప్రకారం చట్టపరమైన చర్యలను ఎదుర్కోక తప్పదు. అరెస్టు జారీచేయవచ్చు, లేదా ఒకవేళ బెయిల్ ఉంటే ఆ బెయిల్ రద్దు కావచ్చు, పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించి పోలీసులు గాలింపుచర్యలు చేపట్టవచ్చు లేదా డైరెక్టుగా కోర్టే నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ కూడా జారీచేయవచ్చు.

ప్రతిపక్షం ఆందోళనలకు తగ్గట్లే నిందితుడు ఈరోజు విచారణకు గైర్హాజరయ్యారు. దాంతో కేంద్రమంత్రికి వ్యతిరేకంగా ఉద్యమించటానికి బీఆర్ఎస్ కు బలమైన ఆయుధం దొరికినట్లయ్యింది. కొడుకు ఏతప్పూ చేయకపోతే పోలీసుల విచారణకు ఎందుకు గైర్హాజరయ్యారో చెప్పాలన్న బీఆర్ఎస్ ప్రశ్నకు సంజయ్ సమాధానం చెప్పలేకపోతున్నారు. మొత్తానికి భగీరథపైన నమోదైన పోక్సో కేసు రాజకీయ వివాదంగా మారే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

Read More
Next Story