రేవంత్‌కు బీజేపీ భయం పట్టుకుంది: బండి
x

రేవంత్‌కు బీజేపీ భయం పట్టుకుంది: బండి

దక్షిణాదికి అన్యాయమంటూ రేవంత్ చేసిన గగ్గోలు వెనక అసలు కుట్ర రాహుల్ స్థానం కోసమేనన్న బండి సంజయ్.


రేవంత్ రెడ్డిపై కరీంనగర్ ఎంపి, కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. డిలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయమంటూ రేవంత్ చేసిన గగ్గోలు అంతా నటన మాత్రమేనన్నారు. డిలిమిటేషన్ జరిగిన తర్వాత జమిలి ఎన్నికలు జరిగితే బీజేపీ గెలుస్తుందని, రేవంత్‌కు ప్రస్తుతం అదే భయం పట్టుకుందంటూ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రేవంత్ ప్రేమ రాష్ట్ర ప్రజలు, దక్షిణాదిపై కాదని, రాహుల్ గాంధీకి పదవి తెప్పించడంపైనే అని దుయ్యబట్టారు. డిలిమిటేషన్‌పై రేవంత్ పెట్టిన గగ్గోలు వెనక అసలు కుట్ర కూడా రాహుల్‌ గాంధీ స్థానం కోసమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘రాహుల్ గాంధీని జనం విశ్వసించడం లేదు కాబట్టే ఆ స్థానాన్ని ఆక్రమించేందుకు రేవంత్ డ్రామాలు ఆడుతున్నారు. డీలిమిటేషన్ బిల్లును అడ్డుకుని దక్షిణాదికి అన్యాయం చేసింది రేవంత్, స్టాలినే. మహిళా బిల్లును అడ్డుకుని కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, టీఎంసీ తప్పు చేశాయి. ఆ పార్టీల దృష్టిలో మహిళలంటే సోనియా, ప్రియాంక, డింపుల్, కనిమొళి మాత్రమే. వాళ్లకు పదవులిస్తే మహిళలకు న్యాయం జరిగినట్లేనని భావిస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్.

వాళ్ల అసలు భయం అదే

‘‘సాధారణ మహిళలు చట్టసభల్లోకి వస్తే... కుటుంబ పార్టీల పునాదులు కదిలిపోతాయనే భయం. అందుకే మహిళా భిల్లును అడ్డుకున్నాయి. గంట టైమిస్తే డీలిమిటేషన్ బిల్లును సవరిస్తానని అమిత్ షా చెప్పారు. అయినా వినకుండా దక్షిణాదికి తీరని ద్రోహం చేశారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకుంటే ఆదుకుంది బీజేపీ. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు కల్ల. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని అధికారం పంచుకున్న చరిత్ర కాంగ్రెస్‌ది’’ అని వ్యాఖ్యానించారు.

Read More
Next Story