
పశ్చిమ బెంగాల్: మరోసారి 90 శాతం పోలింగ్ నమోదు
చప్రా, శాంతిపూర్, నిమ్తలా, భాంగర్ సహా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ నేడు జరుగుతోంది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య 142 నియోజకవర్గాలలో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దక్షిణ జిల్లాల్లో అధికార టీఎంసీ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంటుందా? లేక తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ పైచేయి సాధిస్తుందా? అన్నది మే 4న జరిగే ఓట్ల లెక్కింపుతో తేలిపోతుంది.
ఉదయం 7 గంటలకే కోల్‌కతా, హౌరా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, నాడియా, హుగ్లీ, పూర్బ బర్ధమాన్ జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. గత ఫలితాలను పరిశీలిస్తే.. 2021లో అధికార పార్టీ ఈ 142 స్థానాలలో 123 గెలుచుకోగా, బీజేపీకి కేవలం 18, ఐఎస్‌ఎఫ్ ఒక స్థానం మాత్రమే వచ్చాయి.
మమత వర్సెస్ సువెందు..
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ కంచుకోటగా భావించే భబనీపూర్‌లో ఆమెతో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి తలపడుతున్నారు. 2021లో నందిగ్రామ్‌లో ఆయన చేతిలో మమత ఓడిపోయారు.
మొత్తం 3.21 కోట్ల ఓటర్లు..
రెండో దశ పోలింగ్‌లో 1.57 కోట్ల మంది మహిళలు, 792 మంది థర్డ్-జెండర్ ఓటర్లు సహా మొత్తం 3.21 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 41వేల కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది.
7 జిల్లాల్లో 2,321 కంపెనీల కేంద్ర బలగాలను ఎన్నికల సంఘం, మోహరించింది. కోల్‌కతాలో అత్యధికంగా 273 కంపెనీలను రంగంలోకి దింపింది. 142 మంది సాధారణ పరిశీలకులు, 95 మంది పోలీసు పరిశీలకులు, 100 మంది వ్యయ పరిశీలకులను నియమించింది. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షణకు డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు.
ఇదిలా ఉండగా, చప్రా, శాంతిపూర్, నిమ్తలా, భాంగర్‌తో సహా పలు ప్రాంతాల్లో హింసాత్మక, విధ్వంస ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ తొలి దశ ఎన్నికలు ఏప్రిల్ 23న జరిగిన విషయం తెలిసిందే. 152 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 93.19 శాతం ఓటింగ్ నమోదైంది.
Live Updates
- 29 April 2026 6:51 PM IST
అస్సాం బీజేపీదే అంటున్న సర్వే సంస్థలు
దాదాపు నెల రోజుల నుంచి కొనసాగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంకు సంబంధించి వివిధ సర్వే సంస్థలు తమ అంచనాలను విడుదల చేశాయి.
అస్సాం లో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ఆక్సిస్ మై ఇండియా- ఎన్డీటీవీ సర్వే అంచనా వేసింది. ఈ సంస్థ ప్రకారం ఎన్డీఏ ఏకంగా 88 నుంచి 100 వరకు సీట్లు సాధించే అవకాశం ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కు మరోసారి నిరాశే ఎదురవుతుందని పేర్కొంది. కాంగ్రెస్ కూటమికి ఈ సర్వే సంస్థ ప్రకారం 24 నుంచి 36 వరకూ మాత్రమే పరిమితం అవుతుందని అంచనా వేసింది. అస్సాం అసెంబ్లీలో 126 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 65 సీట్లు గెలుచుకున్న పార్టీలు అధికారం దక్కించుకునే అవకాశం ఉంది. - 29 April 2026 6:49 PM IST
కేరళ ఎగ్జిట్ పోల్స్: యూడీఎఫ్‌దే విజయం?
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మారే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఎన్నికల పోలింగ్ అనంతరం విడుదలైన పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్.. కేరళంలో అధికారం మారే అవకాశం గట్టిగా కనిపిస్తోందని చెప్తోంది. పినరయి విజయ్.. గెలుపు కష్టమేనని, ఈసారి కాంగ్రెస్ అధ్యక్షతన ఉన్న యూడీఎఫ్‌కు అత్యధిక సీట్లు వచ్చే అవకాశం ఉందని పలు సంస్థలు చెప్తున్నాయి.
మాట్రిజ్ అనే సంస్థ అంచనాల ప్రకారం..
యూడీఎఫ్: 70-75
ఎల్‌డీఎఫ్: 60-65
ఎన్‌డీఏ లేదా అదర్స్: 2-4
- 29 April 2026 6:23 PM ISTఎన్నికలయ్యాక కూడా బెంగాల్ లోనే ఉంటాం: సీఆర్పీఎఫ్ డీజీపశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు పూర్తయిన తరువాత కూడా 500 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే ఉంటాయని సీఆర్పీఎఫ్ డీజీ ఆర్పీ సింగ్ బుధవారం తెలిపారు. ఆయన ఇంతకుముందు కేంద్రం జారీ చేసిన ఆదేశాల ప్రతిని కూడా జత చేసి ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘‘మేము పారదర్శక, న్యాయంగా ఎన్నికలు జరిగేందుకు కట్టుబడి ఉన్నాము’’ అని ఆయన ట్వీట్ చేశారు.
- 29 April 2026 6:14 PM IST
రికార్డు స్థాయి పోలింగ్
బెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న రెండో విడత పోలింగ్ లో మరోసారి ఓటర్లు పొటెత్తారు. సాయంత్రం ఐదు గంటల వరకూ ఏకంగా 90 పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటింగ్ ఇంకా కొనసాగుతోందని, పూర్తి లెక్కలు వస్తే మొదటి దశ పోలింగ్ మించి ఓటింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. - 29 April 2026 4:48 PM IST
ఓ పోలింగ్ బూత్ లో ఆరుగురు టీఎంసీ ఏజెంట్లు: బీజేపీ అభ్యర్థి
కోల్ కతాలోని ఓ పోలింగ్ బూత్ లో ఆరుగురు టీఎంసీ ఏజెంట్లు ఉన్నారని, బీజేపీ, సీపీఐ(ఎం) పార్టీలకు చెందిన ఒక్కొక్కరు మాత్రమే ఏజెంట్లు నియమించుకున్నారని బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ ఆరోపించారు. ఓటర్లు ఎవరికి ఓటు వేస్తున్నారో తెలిసేలా చేస్తున్నారని విమర్శించారు. తాను కేంద్ర బలగాలతో ఈ విషయం మాట్లాడుతున్న సమయంలో టీఎంసీ ఏజెంట్లు దాడి చేయడానికి ప్రయత్నించారని అన్నారు. అయితే తాను ధైర్యంగా నిలబడటంతో ఆ గది నుంచి టీఎంసీ ఏజెంట్లను బయటకు పంపినట్లు వెల్లడించారు. - 29 April 2026 4:42 PM ISTఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేయట్లేదు: టీఎంసీ నాయకుడుబెంగాల్ లో ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేయట్లేదని ఫిర్హాద్ హకీమ్ ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. ఓటర్లను కావాలనే తొలగించి ఎన్నికలు నిర్వహిస్తుందని అన్నారు. సర్ ప్రక్రియ వల్ల చాలామంది ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారని చెప్పారు. కోల్ కత పోర్ట్ నుంచి పోటీ చేస్తున్న ఈ టీఎంసీ నాయకుడు ఉదయం తన కుటుంబంతో కలిసి ఉదయం ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు.
- 29 April 2026 4:24 PM ISTమధ్యాహ్నం మూడు గంటల వరకూ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో 78. 68 పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
- 29 April 2026 2:06 PM ISTబెంగాల్ లో మార్పు ఖాయమయిందన్న మోదీపశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. బెంగాల్ స్పష్టమైన మార్పు కనిపిస్తుందని చెప్పారు. యూపీలో గంగా ఎక్స్ ప్రెస్ వే ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడారు. ప్రజలు నిర్భయంగా వచ్చి ఓట్లు వేస్తున్నారని, కచ్చితంగా కమలదళం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఈ రోజు బెంగాల్ లో మనం ఏం చూస్తున్నాం... భయం లేని వాతావరణం కనిపిస్తోంది. ప్రజలు నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు’’ అన్నారు.గత ఆరు, ఏడు దశాబ్దాలుగా ఇలాంటి చిత్రం బెంగాల్ ఎప్పుడూ కనిపించలేదని అన్నారు. ఓటింగ్ శాతం పెరగడం ప్రజాస్వామ్యం బలోపేతానికి నిదర్శనం పేర్కొన్నారు. బెంగాల్ వీరులకు ప్రణామాలని పేర్కొన్నారు. ఓటర్లు అంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మే 4న వచ్చే ఫలితాలు భారత్ సంకల్పానికి ప్రతీక అన్నారు.
- 29 April 2026 1:59 PM IST
పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న రెండో దశ అసెంబ్లీ ఎన్నికలలో మధ్యాహ్నం వరకూ 61. 11 శాతం పోలింగ్ నమోదు అయింది. చాలా నియోజకవర్గాలలో ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
యూపీ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మ ఈ రోజు దక్షిణ 24 పరగణా జిల్లాలోని చాలా ప్రాంతాలను పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా కట్టుదిట్టంగా ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను స్వయంగా పరిశీలించినట్లు అధికారులు వెల్లడించారు.

