
బెంగాల్‌లో యూసీసీ.. త్వరలో అసెంబ్లీలో బిల్లు?
వెస్ట్ బెంగాల్‌లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుకు బీజేపీ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందని సువేందు అధికారి తెలిపారు.
పశ్చిమ బెంగాల్‌లో యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సువేందు అధికారి తెలిపారు. గుజరాత్, అస్సాం రాష్ట్రాలు అనుసరించిన విధానంలోనే చట్టపర ప్రక్రియను పాటిస్తూ యూసీసీని అమలు చేస్తామని చెప్పారు. ఉత్తర కోల్‌కతాలో బంకిం చంద్ర చటోపాధ్యాయ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
యూసీసీ అమలుకు నిర్దిష్ట విధానం ఉందని, అదే విధానాన్ని అనుసరిస్తామని ఆయన స్పష్టం చేశారు. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి వ్యక్తిగత చట్టాలకు ఒకే విధమైన నిబంధనలు తీసుకురావడమే యూసీసీ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా యూసీసీ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో చర్చ జరిగినట్లు సమాచారం. ఈ బిల్లు ఆమోదం పొందితే, బెంగాల్‌లో కీలక చట్టపరమైన మార్పుగా నిలిచే అవకాశం ఉంది.
2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో యూసీసీ అమలు చేస్తామని బీజేపీ తన ఎన్నికల హామీలో ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ హామీని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. ఉత్తరాఖండ్, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే యూసీసీ అమలుకు చర్యలు ప్రారంభమైన నేపథ్యంలో, బెంగాల్ కూడా అదే దిశగా అడుగులు వేస్తుందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఇదే కార్యక్రమంలో బంకిం చంద్ర చటోపాధ్యాయకు నివాళులర్పించిన సువేందు అధికారి, 'వందే మాతరం' గీతానికి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రంలో జాతీయ స్థాయి 'వందే మాతరం' మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

