బండికి ‘సన్’ స్ట్రోక్ తప్పదా ?
x
Central Minister Bandi Sanjay with his son Bhageeratha

బండికి ‘సన్’ స్ట్రోక్ తప్పదా ?

బండి భగీరథ పై నమోదైన పోక్సో కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని కూకట్ పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ డిసైడ్ చేయబోతున్నారు


కేంద్రమంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేట్లులేదు. మంగళవారం బండి కొడుకు బండి భగీరథ పై నమోదైన పోక్సో కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని కూకట్ పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ డిసైడ్ చేయబోతున్నారు. ఈరోజు భగీరథపై ఫిర్యాదుచేసిన బాలికను డీసీపీ వ్యక్తిగతంగా విచారించబోతున్నారు. విచారణ అయిన తర్వాత భగరీథపై అదనపు సెక్షన్లు నమోదుచేయటం, ఇప్పటికే నమోదైన సెక్షన్లను మార్చటంపై రితిరాజ్ నిర్ణయం తీసుకుంటారు. అందుకనే ఈకేసుకు బాగా ప్రాధాన్యత పెరుగటమే కాకుండా రాజకీయ వివాదంగా మారిపోయింది.

మామూలుగా ఎవరిపైనైనా పోలీసులు పోక్స్ కేసు నమోదుచేయగానే సదరు నిందితులను పట్టుకుని అరెస్టుచేస్తారు. కానీ ఇక్కడ నిందితుడు భగీరథ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కావటంతో కఠినచర్యలు తీసుకోవటానికి పోలీసులు వెనకాడుతున్నారు. ఈవిషయంలోనే బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపైన బాగా ఒత్తిడి పెంచేస్తున్నారు. కొడుకుపై పోలీసులు బలమైన పోక్సో కేసును నమోదుచేయటంతో బండి కూడా కేసు, ఘటన గురించి మాట్లాడకుండా తాను బీసీ నేతను కాబట్టి అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటు సామాజిక కోణాన్ని రక్షణగా ఉపయోగించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు మరింత వివాదాస్పదమవుతోంది.

బండి భగీరథ వివాదాస్పద వ్యవహారాలన్నీ ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాలిక మీద అఘాయిత్యం ఆరోపణలు రావటం, పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఎప్పుడైతే భగీరథపైన పోలీసులు పోక్సో కేసు నమోదుచేశారో వెంటనే గతంలో నిందితుడు ఎవరినో కోడుతున్న వీడియోలు వెలుగుచూశాయి. ఆ వీడియోలో ఒక యువకుడు సోషాలో కూర్చునుండగా భగీరథ అతగాడిని ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు. ఇపుడా వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కేంద్రమంత్రి చెబుతున్నట్లు కొడుకు అమాయకుడు కాదని హింసా ప్రవృత్తి ఉన్న యువకుడే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు గట్టి ఆరోపణలు చేస్తున్నారు.

ఏదేమైనా కొడుకు దుందుడుకు చర్యలు, మైనర్ బాలికపై అఘాయిత్యం ఆరోపణలతో పోక్సో కేసులు ఇరుక్కోవటం బండికి పెద్ద తలనొప్పనే చెప్పాలి. పోలీసులు గనుక కొడుకును అరెస్టుచేసి కోర్టు ద్వారా రిమాండుకు పంపితే మొత్తం బీజేపీ పార్టీనే ఇబ్బందుల్లో పడటం ఖాయం. భగీరథపై పోక్సో కేసు నమోదు విషయంపై మాట్లాడటానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు ఏమాత్రం ఇష్టపడటంలేదు. మీడియా అడిగిన ప్రశ్నకు అధ్యక్షుడు సమాధానం చెబుతు చట్టం తనపని తాను చేసుకుని వెళుతుందని మాత్రమే కామెంట్ చేయటం గమనార్హం. కేంద్రమంత్రి కొడుక్కు మద్దతుగా మాట్లాడలేక అలాగని ప్రభుత్వం కేసుపెట్టడాన్ని వ్యతిరేకించలేక పార్టీ సీనియర్ నేతలతా బాగా ఇబ్బంది పడుతున్నారు. డీసీపీ రితిరాజ్ బాలిక విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలుంటాయో ఆసక్తిగా మారింది.

Read More
Next Story