బీఆర్ఎస్ కు బిగ్ రిలీఫ్ (వీడియో)
హైకోర్టు అనుమతితో సభ నిర్వహణ జరపబోతోంది.
బీఆర్ఎస్ నిజంగానే ఊపిరి పీల్చుకున్నది. హైకోర్టు అనుమతితో సభ నిర్వహణ జరపబోతోంది. విషయం ఏమిటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం బహిరంగసభ నిర్వహించాలని అనుకున్నది. అందుకు నగరంలోని సరూర్ నగర్ స్టేడియంను వేదికగా చేసుకోవాలని కూడా డిసైడ్ చేసింది. నిరుద్యోగులకు మద్దతుగా రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సభ జరగబోతోంది. సభ నిర్వహణకు పార్టీ నేతలు అనుమతి కోరుతు పోలీసులకు విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే లా అండ్ ఆర్డర్ ను కారణంగా చూపించి పోలీసులు బహిరంగసభకు అనుమతి నిరాకరించారు.
ఈ విషయాన్ని ముందుగానే ఊహించిన పార్టీ నేతలు వెంటనే హైకోర్టులో పిటీషన్ దాఖలుచేశారు. కేసును విచారించిన హైకోర్టు బీఆర్ఎస్ సభకు అనుమతి ఇవ్వాలంటు ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది. దాంతో సభ నిర్వహణకు అడ్డంకులు తొలగిపోవటంతో బీఆర్ఎస్ నేతలు ఊపిరి పీల్చుకుని అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
2023 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత యువతను మోసం చేశాడు అనే అంశంపైనే బహిరంగసభ నిర్వహిస్తోంది. మెగా డీస్సీలేదు, ఉద్యోగాల భర్తీలేదు చివరకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వటంలేదని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అప్పటి ఎన్నికల్లో ఇదే స్టేడియంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ ఆధ్వర్యంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించిన విషయాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తుచేస్తున్నారు. మరి బహిరంగసభ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు గుప్పిస్తారు, యువతకు తాము ఏమి హామీ ఇస్తారో చూడాలి.

