కేసీఆర్ కు బిగ్ రిలీఫ్
x

కేసీఆర్ కు బిగ్ రిలీఫ్

జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టు ఆధారంగా కేసీఆర్, హరీష్ తదితరులపై యాక్షన్ తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం ఆదేశించింది


బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బిగ్ రిలీఫ్ అనేచెప్పాలి. ఈ రిలీఫ్ తాత్కాలికమా లేకపోతే శాశ్వతమా అన్నది కొద్దిరోజుల్లోనే తేలుతుంది. ఇప్పటికైతే మాజీ సీఎంకు పెద్ద ఊరటనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే కాళేశ్వరం అవినీతి, అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టు ఆధారంగా కేసీఆర్, హరీష్ తదితరులపై ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం ఆదేశించింది. జస్టిస్ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం తమపై కుట్రపూరితమైన చర్యలకు దిగుతోందని కేసీఆర్, హరీష్ ఆందోళన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అవకతవకలపై బాధ్యులంటు రేవంత్ ప్రభుత్వం ఆరోపిస్తున్న కేసీఆర్, హరీష్ రావు తదితరులపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే అని రేవంత్, మంత్రులు గట్టిగా ఉన్నారు.

రేవంత్ దూకుడు చూసిన తర్వాతే కేసీఆర్, హరీష్, ప్రాజెక్టును ప్రత్యక్షంగా పర్యవేక్షించిన స్మితా సబర్వాల్, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి తదితరులంతా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు. అందుకనే కమిషన్ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వంపై తమమీద ఎలాంటి యాక్షన్ తీసుకునేందుకు లేకుండా అడ్డుకోవాలని హైకోర్టులో వేర్వేరుగా కేసులు దాఖలుచేశారు. కౌంటరుగా అడ్వకేట్ జనరల్ తదితర లాయర్లు తమ వాదనలను వినిపించారు. అందరి లాయర్ల వాదనలు విన్న హైకోర్టు బుధవారం తీర్పిచ్చింది. ఈతీర్పులో కమిషన్ ఏర్పాటు చట్టబద్దంగానే జరిగినా విచారణ తీరు మాత్రం నిబంధనలకు విరుద్ధమని చెప్పింది. కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో చర్చించకుండానే మీడియాలో విస్తృతంగా చర్చ జరగటాన్ని హైకోర్టు తప్పుపట్టింది.

దాదాపు ఏడాదిన్నర పాటు జస్టిస్ ఘోష్ విచారణ జరిపారు. కేసీఆర్, హరీష్, స్మిత, జోషితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్ధతో పాటు ప్రాజెక్టులో చీఫ్ ఇంజనీర్లు, సూపరెండెంట్ ఇంజనీర్లతో పాటు వివిధ స్ధాయిల్లోని కీలకమైన అధికారులతో పాటు ఇరిగేషన్ నిపుణులు, ఇంజనీరింగ్ నిపుణులు ఇలా దాదాపు 150 మందిని కమిషన్ విచారించింది. అందరి వాగ్మూలాలను అఫిడవిట్ల రూపంలో కమిషన్ తీసుకున్నది. తర్వాత తన దగ్గరున్న సాక్ష్యాలను, అఫిడవిట్లను పరిశీలించి, అధ్యయనంచేసిన కమిషన్ ప్రభుత్వానికి రిపోర్టును అందించింది.

రిపోర్టులో ఏముంది ?

ఆ రిపోర్టులో కేసీఆర్, హరీష్, స్మిత, జోషితో పాటు ఎవరెవరి బాధ్యత ఎంత అన్న విషయాన్ని చాలా స్పష్టంగా వివరించింది. లోపం ఎక్కడ జరిగింది ? అవినీతి, అవకతవకలు ఏస్ధాయిలో జరిగాయనే విషయాన్ని కూడా వివరించింది. ఆరిపోర్టుపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చకూడా జరిగింది. ఒకవైపు రిపోర్టుపై అసెంబ్లీలో చర్చలు జరుగుతుండగానే కేసీఆర్, హరీష్ తదితరులు హైకోర్టులో కేసులు దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటే చెల్లదని, కమిషన్ రిపోర్టు ఆధారంగా తమపై ప్రభుత్వం యాక్షన్ తీసుకోవటాన్ని అడ్డుకోవాలని తమ పిటీషన్లో అభ్యర్ధించారు. చివరగా రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత కాళేశ్వరం, మేడిగడ్డ అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలని సీబీఐని కోరుతు అసెంబ్లీలో తీర్మానం కూడా జరిగింది. తీర్మానం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ కేంద్ర హోంశాఖమంత్రికి లేఖ కూడా రాసారు. అసెంబ్లీ తీర్మానం జరిగి, రేవంత్ లేఖ రాసి 8 నెలలు అయినా ఇప్పటివరకు కేంద్రం నుండి ఎలాంటి సమాధానం రాలేదు.

ఇదేవిషయాన్ని రేవంత్ ఎద్దేవాచేస్తు బీఆర్ఎస్-బీజేపీ ఒకటే అనేందుకు ఇదే నిదర్శనంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలని సీబీఐకి లేఖ రాసి ఇన్ని నెలలైనా ఎందుకని కేంద్రం పట్టించుకోవటంలేదని రేవంత్, మంత్రులు పదేపదే నిలదీస్తున్నారు. ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనటానికి కంటిముందే అన్ని ఆధారాలు స్పష్టంగా తెలుస్తున్నా కేంద్రం సీబీఐతో ఎందుకని విచారణ జరిపించటంలేదు అని రేవంత్ పదేపదే నిలదీస్తున్నా ఉలాంటి సమాధనం రావటంలేదు. అంతకుముందు కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోవటానికి రేవంత్ భయపడుతున్నాడని ఒకసారి, కేసీఆర్ తో రేవంత్ కుమ్మక్కయ్యాడని మరోసారి కేంద్రమంత్రులు బండి సంజయ్, జీ కిషన్ రెడ్డి చాలాసార్లు ధ్వజమెత్తారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లోనే కేసీఆర్ ఫ్యామిలీపై కేసులు పెట్టి అందరినీ బొక్కలో తోస్తామని కేంద్రమంత్రులు ఎన్నోసార్లు రెట్టించారు.

అయితే కాళేశ్వరం అవినీతిని రేవంత్ ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తు అసెంబ్లీలో తీర్మానం చేసిన దగ్గర నుండి బండి, కిషన్ ఇప్పటివరకు నోరెత్తటంలేదు. దీనికి కారణాలు వాళ్ళకే తెలియాలి. ఏదేమైనా ఈరోజు హైకోర్టు తీర్పు తాత్కాలికమనే అనుకోవాలి. ఎందుకంటే ఈ తీర్పును సవాలు చేస్తు రేవంత్ ప్రభుత్వం సుప్రింకోర్టులో పిటీషన్ వేయబోతోంది. మరప్పుడు సుప్రింకోర్టు విచారణలో ఏమి తేలుతుందో చూడాలి.

ప్రాజెక్టు వివరాలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ప్రాణహిత-చేవెళ్ళగా పాపులరైన ప్రాజెక్టును 2014లో అధికారంలోకి రాగానే కేసీఆర్ రీడిజైన్ చేసి కాళేశ్వరంగా మార్చేశారు. 2015-16 మధ్యలో మొదలైన పనులు 2016 తర్వాత ఒక్కసారిగా జోరందుకున్నది. 2019లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యింది. అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్, హరీష్ తదితరులు ఇంజనీరింగ్ అద్భుతమని ఎన్నోసార్లు చెప్పుకున్నారు. 2019-2022 వరకు ప్రాజెక్టు ద్వారా నీరందింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను కూడా కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది. గోదావరి జలాల ఆధారంగా నిర్మించిన కాళేశ్వరం+మూడు బ్యారేజీలకు సుమారు 1.10 లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చయ్యింది. గోదావరి జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారు.

గోదావరి జలాలు కాళేశ్వరం ప్రాజెక్టులోకి వెళ్ళి ఓవర్ ఫ్లో అయిన అయిన నీటిని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల మీదుగా సేధ్యానికి వదిలేది ప్రభుత్వం. ఇంతటి ఇంజనీరింగ్ అద్భుతంకు 2023, అక్టోబర్ లో పెద్ద కుదుపు ఎదురయ్యింది. ఎలాగంటే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలోని కొన్ని పిల్లర్లు కుంగిపోయాయి. ఒకసారి భారీవర్షాలకు పిల్లర్ల కిందున్న ఇసుక కొట్టుకుపోవటంలో పట్టుతప్పి పిల్లర్లు కిందకు కుంగిపోయాయి. దాంతో పిల్లర్ల ఆధారంగా నిర్మించిన బ్యారేజీ ప్లాట్ ఫామ్ కూడా కొన్నిచోట్ల కుంగిపోవటంతో పాటు పగుళ్ళు వచ్చేశాయి. దాంతో మేడిగడ్డ బ్యారేజీ నీటినిల్వకు పనికిరాకుండా పోయింది. ఇదే పద్దతిలో అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు కూడా దెబ్బ తినేశాయి. ఈ మూడు బ్యారేజీలు నీటినిల్వకు పనికిరాకుండా పోవటంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకూ పనికిరాకుండా పోయింది. అందుకనే కాళేశ్వరం ప్రాజెక్టును రేవంత్, మంత్రులు ‘కూలేశ్వరం’ అంటున్నది.

2023, నవంబర్ ఎన్నికలకు ముందు అక్టోబర్లో బ్యారేజీల్లో సమస్యలు తెల్లతటం అప్పట్లో రాజకీయంగా ఎన్నికల్లో కీలకమైన అంశంగా మారిపోయింది. రేవంత్, కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం అవినీతిని ప్రధానంగా హైలైట్చ చేస్తు ఎన్నికల్లో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేసీఆర్ దోచుకున్నాడంటు రేవంత్, నేతలు చేసిన ఆరోపణలను జనాలు కూడా నమ్మారు. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024, మార్చిలో ప్రభుత్వం కాళేశ్వరంపై విచారణ చేయించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను నియమించింది. ఇపుడు రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవద్దని చెప్పిన హైకోర్టు తీర్పును రేవంత్ ప్రభుత్వం సుప్రింకోర్టులో చాలెంజ్ చేయబోతోంది. తర్వాత పరిణామాలు ఎలాగ ఉంటాయో చూడాల్సిందే.

Read More
Next Story