
రేవంత్ ఇంటి దగ్గర హైటెన్షన్.. కదం తొక్కుతున్న బీజేపీ మహిళలు..
మహిళా బిల్లుపై వివాదం, ఎన్‌డీఏ పిలుపుతో ఆందోళనలు, పోలీసులు జోక్యం, ఆరోపణల మధ్య ఉద్రిక్త పరిస్థితులు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసం దగ్గర హైటెన్షన్ నెలకొంది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడగొట్టేలా కాంగ్రెస్ ఓటు వేసిందని ఎన్‌డీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ మహిళా మోర్చ నాయకురాళ్లు.. రేవంత్ ఇంటి దగ్గర నిరసనలు చేపట్టాయి. కాంగ్రెస్, రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మహిళలను తొక్కేయడం కాంగ్రెస్ రక్తంలోనే ఉందని శుక్రవారం పార్లమెంటు వేదికగా హస్తం గుర్తు మరోసారి నిరూపించుకుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకుల నిరసన సమాచారం అందడంతో పోలీసులు అక్కడు చేరుకుని వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ పరిస్థితులు మరింత వేడెక్కాయి.
బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్ప వ్యాఖ్యానిస్తూ, మహిళా రిజర్వేషన్ల అమలుకు అడ్డంకులు సృష్టించడం ద్వారా కాంగ్రెస్ తన వైఖరిని బయటపెట్టిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు కూడా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసినట్లు తెలిసింది. మహిళా ప్రతినిధిత్వాన్ని అడ్డుకునే విధంగా ఆ పార్టీ వ్యవహరిస్తోందని, గతంలో కూడా ఈ అంశంపై ఆలస్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ ఆరోపణలు, నిరసనల మధ్య రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

