సింగరేణిపై బీజేపీ మాస్టర్ ప్లాన్(వీడియో)
x

సింగరేణిపై బీజేపీ మాస్టర్ ప్లాన్(వీడియో)

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే అన్నీ నియోజకవర్గాల్లోను బీజేపీ గెలిచి తీరాల్సిందే అనే నిర్ణయంతో గట్టి వ్యూహాలను అమలుచేస్తోంది


సింగరేణి ఏరియాపై పట్టుకోసం బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసినట్లు అర్ధమవుతోంది. ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గాల్లో కరీంనగర్ లోక్ సభలో మాత్రమే బీజేపీ గెలిచింది. సింగరేణి ఏరియాలో 4 ఎంపీ స్ధానాలు, 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే అన్నీ నియోజకవర్గాల్లోను బీజేపీ గెలిచి తీరాల్సిందే అనే నిర్ణయంతో గట్టి వ్యూహాలను అమలుచేస్తోంది. ఇందులో భాగంగానే మొదటగా తాడిచెర్ల-2 ఓపెన్ క్యాస్ట్ గనిని కేంద్రప్రభుత్వంతో సింగరేణికి నామినేషన్ పై ఇప్పించింది. సికింద్రాబాద్ ఎంపీ అయిన జీ కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి అవటం తెలంగాణ బీజేపీకి కలిసొచ్చింది.

సింగరేణికి సొంతమైన బొగ్గు గనులన్నింటినీ 2016లో కేంద్రప్రభుత్వం సొంతం చేసేసుకున్నది. దేశంలోని అన్నీ బొగ్గు గనుల్లాగే తెలంగాణలోని గనులను కూడా నరేంద్రమోదీ ప్రభుత్వం సొంతచేసుకున్నది. దీనిపైన సింగరేణి కార్మికులు, ఉద్యోగుల్లో అప్పటినుండి బాగా మంటగా ఉంది. చేతిలో ఉన్న గనులను వదులుకున్న తర్వాత బొగ్గు తవ్వకాలకు గనులను కేటాయించాలని కేంద్రాన్ని వేడుకునే పరిస్ధితి అయిపోయింది యాజమాన్యానిది. ప్రైవేటు కంపెనీలతో వేలంపాటల్లో పోటీపడలేక అలాగని సొంతంగా గనులు లేక సింగరేణి నానా అవస్తలు పడుతోంది. ఇలాంటి పరిస్ధితిలో తాడిచెర్ల-2 గనిని కేంద్రం నామినేషన్ మీద సింగరేణికి కేటాయించింది అని కిషన్, బీజేపీ నేతలు చెప్పుకుని పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు.

సింగరేణి పరిరక్షణకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పటానికే ఈనెల 13, 14 తేదీల్లో రెండు రోజులు ‘సింగరేణి భరోసా యాత్ర’ మొదలుపెట్టబోతున్నారు. ఈ యాత్రలో కేంద్రమంత్రి కిషన్, పార్టీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు, ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో పాటు సీనియర్ నేతలంతా పాల్గొనబోతున్నారు. సోమవారం ఉదయం కొత్తగూడెం కార్పొరేట్ ఆఫీసు దగ్గర కార్మికులను కిషన్ కలుస్తారు. అక్కడి నుండి మణుగూరు, రాత్రికి భూపాలపల్లికి చేరుకుంటారు. రాత్రి భూపాలపల్లిలోనే బసచేస్తారు. 14వ తేదీన గనిలోని కార్మికులతో భేటీ తర్వాత తాడిచెర్ల-2 బ్లాకును సందర్శిస్తారు.

తర్వాత గోదావరిఖనిలోని ఓపెన్ కాస్ట్ గనులను పరిశీలించి అక్కడి కార్మికులతో భేటీ అవుతారు. అక్కడినుండి బయలుదేరి మంచిర్యాల జిల్లా శ్రీరామ్ పూర్ ఎస్ఆర్పీ-3 గనిని పరిశీలిస్తారు. చివరగా మందమర్రి-చెన్నూరు నియోజకవర్గంలో జరిగే భారీ బహిరంగసభతో రెండురోజుల యాత్రను ముగిస్తారు. పార్టీ ఎంపీలు, ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు తమ యాత్రలను చెన్నూరు బహిరంగసభతోనే ముగించబోతున్నారు. బీఆర్ఎస్, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా సింగరేణి పరిధిలో కార్యక్రమాలను అమలుచేస్తు పార్టీని బలోపేతం చేయాలన్న పార్టీ ప్లాన్ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Read More
Next Story