బెంగాల్ లో బీజేపీ, తమిళనాడులో విజయ్ ప్రభంజనం
x
విజయ్

బెంగాల్ లో బీజేపీ, తమిళనాడులో విజయ్ ప్రభంజనం

అస్సాంను క్లీన్ స్వీప్ చేసిన కమలదళం, కాంగ్రెస్ కూటమిదే కేరళ, వెలువడిన నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు


Click the Play button to hear this message in audio format

దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. కొన్ని రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తల్లకిందులు కాగా, ఇంకొన్ని రాష్ట్రాలలో వారి అంచనాలు అందుకున్నారు.

ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్ లో బీజేపీ తొలిసారిగా అధికారంలోకి రాగా, తమిళనాడులో ఎవరి ఊహకు అందకుండా నటుడు విజయ్ స్థాపించిన ‘టీవీకే’ విజయ దుందుభి మోగించింది. కేరళలో కాంగ్రెస్ కూటమి ప్రభంజనం సృష్టించగా, అస్సాంలో కమల దళం క్లీన్ స్వీప్ చేసింది. కేంద్రంలో ఎవరూ అధికారంలో ఉంటే వారికే పట్టంకట్టే ఆచారం పాటిస్తున్న పుదుచ్చేరి ఇప్పుడూ అదే ట్రెండ్ ను ఫాలో అయి, ఎన్డీఏ కూటమికే అధికారం అప్పగించింది.

పశ్చిమ బెంగాల్ లో కమలం దూకుడు..

గత పదిహేను సంవత్సరాలుగా బెంగాల్ ను అప్రహతీతంగా ఏలిన టీఎంసీకి ఈ అసెంబ్లీ ఎన్నికలలో బెంగాలీలు షాక్ ఇచ్చారు. కేవలం 79 స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది. బీజేపీ ఏకంగా 200 కు పైగా స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. 293 స్థానాలున్నా బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 సీట్లు కాగా, కమల దళం ఆ మార్క్ ను ఎప్పుడో దాటి అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. 34 సంవత్సరాలు బెంగాల్ ను ఏలిన కమ్యూనిస్టులు కేవలం రెండు సీట్లకే పరిమితం కాగా, గ్రాండ్ ఓల్డ్ పార్టీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది.
బీజేపీ ఇప్పుడు తదుపరి బెంగాల్ సీఎం ఎవరనే దానిపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. అయితే బయటకు వస్తున్న సమాచారం ప్రకారం బీజేపీ నేత ‘సువేందు అధికారి’కే ఈ అవకాశం ఎక్కువగా ఉంది. ఆయన నందిగ్రామ్ నుంచి పోటీ చేయడంతో పాటు మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీ పూర్ నుంచి సైతం పోటికి దిగారు. అయితే ఆయన ఓటమి పాలైనప్పటికీ నందిగ్రామ్ లో గెలుపొందారు. 2021 ఎన్నికలలో ఆయన నందిగ్రామ్ లో మమత బెనర్జీని ఓడించి సంచలనం సృష్టించారు.
2016 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోగా, సరిగ్గా పది సంవత్సరాల తరువాత జరిగిన ఎన్నికలలో ఏకంగా అధికారం కైవసం చేసుకుంది. అయితే ఈ విజయాన్ని తాము అంగీకరించడం లేదని మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ ఓట్ చోర్ ద్వారానే బెంగాల్ కు కైవసం చేసుకుందని, తమ పోరాటం ఆగదని ప్రకటించారు.

తమిళనాడు... దళపతిదే..

దేశం మొత్తం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూసిన మరో రాష్ట్రం తమిళనాడు ఎన్నికలు. గత ఆరు దశాబ్ధాలుగా రెండు ద్రవిడవాద పార్టీలదే ఇక్కడ అధికారం. కాగా వీరిని కాదని మూడో ప్రత్యామ్నాయంగా విజయ స్థాపించిన టీవీకే గెలుస్తుందా అని అంతా అనుకున్నారు.
అందుకు తగ్గట్లుగానే ఎగ్జిట్ పోల్ లో అన్ని తిరిగి డీఎంకేనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ దళపతి విజయ్ పార్టీ సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఆ పార్టీకి సొంతంగా మెజారిటీ మార్క్ రానప్పటికీ ఆయనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీవీకే వర్గాలు తెలిపాయి. ఆ పార్టీకి బయట నుంచి కాంగ్రెస్ సహ ఇతర చిన్న పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఎన్నికల తరువాత కరూర్ తొక్కిసలాట, జననాయగన్ సినిమా విడుదలకు అడ్డంకులు, విజయ్ సభలకు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన సరైన రీతిలో ప్రచారం చేయలేకపోయారు. దళపతి కేవలం ఓట్లను మాత్రమే చీలుస్తారని, హంగ్ వస్తే కింగ్ మేకర్ అవుతారని అనుకున్నారు. కానీ వాస్తవ ఫలితాలు అంచనాలకు అందకుండా వచ్చాయి.
ఈ ఎన్నికలలో అధికార డీఎంకేకు ఘోరమైన పరాజయం ఎదురైంది. ఏకంగా సీఎం స్టాలిన్ కొలత్తూర్ స్థానం నుంచి టీవీకే అభ్యర్థి చేతిలో పరాజయం పాలైయ్యారు. దాదాపు 20 మంది మంత్రులు పరాజయం అంచున నిలబడ్డారు. విపక్ష అన్నాడీఎంకే పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఆ పార్టీ కేవలం 55 స్థానాలకు పరిమితమైంది. టీవీకే పార్టీ ఈ ఎన్నికలలో 30 శాతం ఓట్లకు సాధించింది. విజయ్ పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ లో రెండింటిలో విజయం సాధించారు.

కేరళ..

కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభంజనం సృష్టించింది. ఆ కూటమి ఏకంగా వందకు పైగా స్థానాలో విజయం సాధించింది. విపక్ష ఎల్డీఎప్ కేవలం 35 స్థానాలు తమ ఖాతాలో వేసుకుంది. బీజేపీ మూడు స్థానాలలో బోణి కొట్టింది. ఆ పార్టీకి ఇంతకుముందు ఇక్కడ ఒక్క స్థానం కూడా లేదు. అయితే బీజేపీ భారీ స్థాయిలో ఓట్లను చీలుస్తుందనే ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పాయి.
పది సంవత్సరాల తరువాత విజయం సాధించిన యూడీఎఫ్ కూటమి తదుపరి తమ సీఎం ఎవరనే దానిపై దృష్టి సారించింది. ఈ రేసులో కే పీసీసీ చీఫ్ వీడీ సతీషన్, కేసీ వేణుగోపాల్ ముందు వరుసలో ఉన్నారు. అయితే పార్టీ అధిష్టానం సీఎం ఎవరనేదీ నిర్ణయిస్తుందని కేపీసీసీ వర్గాలు తెలిపాయి.

అస్సాం..

అస్సాంలో బీజేపీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 102 స్థానాలు కైవసం చేసుకుంది. అస్సాం అసెంబ్లీ లో 126 స్థానాలు ఉన్నాయి. అధికారం అందుకోవాలంటే 64 సీట్లు అవసరం. అయితే ఈ మార్క్ ను ఆరంభంలోనే బీజేపీ అందుకుంది. విపక్ష కాంగ్రెస్ కూటమి కనీసం పోటీ ఇవ్వలేకపోయింది.
ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ కరిష్మాకు తోడు అమిత్ షా, మోదీ వ్యూహం ప్రజాదరణ అస్సాంలో వరుసగా మూడోసారి బీజేపీ అధికారం చేపట్టడానికి తోడ్పడింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వస్తున్న చొరబాట్లు, అస్సామీయులు మైనారిటీగా మారుతున్నారనే ఆందోళన ఈ ఎన్నికలలో కీలక పాత్ర పోషించాయి. వందలాది బంగ్లాదేశీయుల నుంచి కొన్ని వేల హెక్టార్లను హిమాంత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఆయనకు ప్లస్ గా మారింది.

పుదుచ్చేరిలో..

పుదుచ్చేరీలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారం నిలుపుకుంది. కేంద్రంలో ఎవరూ అధికారంలో ఉంటే వారికే అధికారం అప్పగించడం ఇక్కడ సంప్రదాయంగా ఉంది. ఇప్పుడూ అదే ఫాలో అయ్యారు. 30 అసెంబ్లీ స్థానాలున్న ఇక్కడ 16 సీట్లు సాధించిన పార్టీ అధికారం దక్కించుకుంటుంది. ఎన్డీఏ ఇక్కడ 18 స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. రంగస్వామి మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. టీవీకే 3 స్థానాలు, కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకున్నాయి.
Read More
Next Story