
నిరుద్యోగుల మద్దతు కోసం కాంగ్రెస్-బీఆర్ఎస్ పోటీ
రాబోయే ఎన్నికల్లో యువత ముఖ్యంగా నిరుద్యోగుల మద్దతు కోసం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పోటీలు పడుతున్నాయి. హైదరాబాద్ సరూర్ నగర్లో బీఆర్ఎస్ నిర్వహించిన ‘యువ సంగ్రామ సదస్సు’ ఇందులో భాగమే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి నిరుద్యోగులు కూడా కీలకమనే చెప్పాలి. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల భర్తీలో చాలా అవకతవకలు జరిగటంతో నోటిఫికేషన్లను కూడా హైకోర్టు కొట్టేసింది. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఫలితంగా లక్షలాదిమంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాక బాగా ఇబ్బందులు పడ్డారు. అందుకనే 2023 ఎన్నికల్లో నిరుద్యోగ సంఘాంలు జేఏసీగా ఏర్పడి రాష్ట్రంలోని ప్రతి ఊరిలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారంచేశారు. దాంతో నిరుద్యోగుల దెబ్బేమిటో బీఆర్ఎస్ కు బాగా అర్ధమైంది.
మరో రెండున్నరేళ్ళల్లో ఎన్నికలు రాబోతున్న కారణంగా నిరుద్యోగ యువతను దగ్గరకు తీసుకోవాలనే వ్యూహంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యాచరణ మొదలుపెట్టింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న రేవంత్ ఎన్నికల హామీని గుర్తుచేస్తు బీఆర్ఎస్ నిరుద్యోగ సదస్సులు పెట్టాలని డిసైడ్ చేసింది. సరూర్ నగర్ స్టేడియం సభ మొదటిది. భవిష్యత్తులో ఇలాంటి సభలు రాష్ట్రమంతా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది.
సభలో రేవంత్ ను టార్గెట్ చేస్తు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేపదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీచేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది అని ఆరోపించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ వెబ్ సైట్ లెక్క ప్రకారమే నిరుద్యోగుల సంఖ్య సుమారు 17 లక్షలు. 2023 ఎన్నికల్లో తమను బాగా ఇబ్బందిపెట్టిన నిరుద్యోగ సమస్యను తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంపైకి ప్రయోగించేందుకు బీఆర్ఎస్ రెడీ అయ్యింది. మరి బీఆర్ఎస్ ప్రయత్నం ఫలిస్తుందా ?

