
తేజస్వీ సూర్యపై తెలంగాణ గరమ్ గరమ్..
సూర్య దిష్టిబొమ్మను తగలబెట్టిన బీఆర్ఎస్ శ్రేణులు.
తెలంగాణలో తేజస్వీ సూర్య మంటలు తీవ్రతరం అవుతున్నాయి. పార్లమెంటు వేదికగా తెలంగాణ విభజనపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళనలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలోనే సూర్య వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా పలు సంఘాలు, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు తేజస్వీ సూర్య ఫొటోను దగ్దం చేసి నిరసన తెలిపాయి. బీజేపీ అంటేనే తెలంగాణ వ్యతిరేకి అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని.. బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకోవడం రెండు పార్టీల మధ్యా మాటల తూటాలు పేలాయి. కాగా అప్పటికే బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు.. ఇరు వర్గాలను కంట్రోల్ చేశారు. తాజాగా ఇదే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ వంశీ కృష్ణ గడ్డం ఘాటుగా స్పందించారు. కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య.. అప్రజాస్వామిక వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్షమాపణలు చెప్పాల్సిందే: వంశీ కృష్ణ
ఇదే అంశంపై మాట్లాడేందుకు పలువురు తెలంగాణ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను శుక్రవారం కలిశారని వివరించారు వంశీ కృష్ణ. ‘‘తేజస్వీ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలకు తీవ్రమైన బాధను, అవమానాన్ని కలిగించాయి. మేము తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాము. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా చేసే ఎటువంటి అవమానకరమైన వ్యాఖ్యలపైన లేదా దురుద్దేశాలపైన అయినా మేము పోరాడుతాము. మాకు న్యాయబద్ధంగా దక్కాల్సిన హక్కుల కోసం మేము పోరాడుతాము. జి. కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి. నిన్న సభలో తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన ఆ వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలని మేము లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరాము’’ అని ఆయన తెలిపారు.
తప్పు చేశానని ఒప్పుకున్నారుగా: కిషన్
తెలంగాణ వ్యాప్తంగా ఈ అంశం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కిషన్ రెడ్డి స్పందించారు. తేజస్వీ సూర్య.. తన వ్యాఖ్యలను తప్పని ఒప్పుకున్నారని, గురువారమే సభలో తాను కూడా ఆ వ్యాఖ్యలకు వివరణ ఇచ్చానని కిషన్ అన్నారు. ‘‘బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య.. తెలంగాణ ప్రజలను కానీ, ఉద్యమాన్ని కానీ అవమానించేలా ఎక్కడా మాట్లాడ లేదు. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 369 మందిని, ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఉద్యమకారులను బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలు, తప్పుడు చర్యలను, తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే అయన ప్రశ్నించారు’’ అని వివరించారు కిషన్ రెడ్డి.
పార్లమెంటులో తెలంగాణ ఎంపీల నిరసన
తేజస్వీ సూర్య వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకుని.. బీజేపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పోరాటాలను, ఆత్మగౌరవాన్ని అవమానించొద్దని నినాదించారు. ఈ సందర్భంగానే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తేజస్వీ సూర్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘తేజస్వి సూర్యకు తెలంగాణ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చిన ఆయన వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలి. తెలంగాణ ప్రజలకు ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. అదే సమయంలో, ఆయన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి సమర్థించారు. కిషన్ రెడ్డి వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు’’ అని చామల అన్నారు.

