
పోలీసులకు లొంగిపోయిన బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ కొడుకు
ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి అందులోని ముగ్గురు పారిపోయారు
వేరేదారిలేక చివరకు బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ కొడుకు శనివారం ఉదయం పోలీసుల ముందు లొంగిపోయాడు. విషయం ఏమిటంటే 2022, మార్చి 17వ తేదీ రాత్రి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్ 45 మీదుగా ఫిలింనగర్ వైపు వెళుతున్న ఒక కారు మహిళను బలంగా ఢీకొన్నది. ఈ ప్రమాదంలో మహిళతో పాటు మరో ముగ్గురికి గాయాలవ్వగా ఒక చిన్నారి స్పాట్ లోనే చనిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి అందులోని ముగ్గురు పారిపోయారు.
బాధితుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేశారు. కారుపై బోధన్ ఎంఎల్ఏ షకీల్ అనే స్టిక్కర్ అంటించి ఉంది. దాని ఆధారంగా పోలీసులు కారు ఎవరిది అనే విషయాన్ని దర్యాప్తుచేశారు. ప్రమాదానికి కారణమైన కారు బోధన్ ఎంఎల్ఏ షకీల్‌ది అని నిర్ధారణైంది. అయితే కారును ఎవరు నడుపుతున్నారు ? ప్రమాదానికి కారణమెవరు అన్న విషయాన్ని పోలీసులు గుర్తించలేకపోయారు. ప్రమాదం జరిగిన విధానంపై పోలీసులు చుట్టుపక్కల ఉన్న సుమారు 100 సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా కారులో అఫ్రాన్, రాహిల్, మహ్మద్ మాజ్ ఉన్నట్లు గుర్తించారు. దాంతో గాలింపు చర్యలు జరిపినపుడు అఫ్రాన్, మహ్మద్ దొరికారు. వీళ్ళను విచారించినపుడు తాను కారు నడుపుతున్నపుడే ప్రమాదానికి గురైనట్లు అఫ్రాన్ అంగీకరించాడు. పోలీసులు కూడా ఇదే నిజమని నమ్మారు.
అయినా ఎందుకో అనుమానం వచ్చి కెమెరాల దృశ్యాలను మరింతలోతుగా విశ్లేషించారు. అప్పుడు ముగ్గురు యువకులు ప్రమాదం జరగ్గానే కారులో నుండి దిగి పారిపోయినట్లు కనబడింది. ప్రమాదానికి గురైన వారికి కెమెరాలోని దృశ్యాలను చూపించినపుడు కారు డ్రైవింగ్ సీటులో నుండి బయటకు వచ్చిన యువకుడిని గుర్తించారు. దాని ప్రకారం కారును నడిపింది అఫ్రాన్ కాదని అర్ధమైపోయింది. పోలీసులు గట్టిగా విచారించినపుడు కారును నడిపింది రాహిల్ అని బయటపడింది. రాహిల్ ఎవరంటే ఎంఎల్ఏ షకీల్ కొడుకు. అంటే ఎంఎల్ఏ కొడుకు రాహిల్ ను ప్రమాదంలో నుండి తప్పించేందుకు అఫ్రాన్ నేరాన్ని తనమీద వేసుకున్న విషయం అర్ధమైపోయింది.
రాహిల్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా అతను అందుబాటులోకి రాలేదు. దాంతో పోలీసులు బోధన్ కు వెళ్ళగా అప్పటికే రాహిల్ దేశం విడిచిపారిపోయినట్లు తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉండగా కొడుకును దేశం దాటించటం ఎంఎల్ఏకి సులభమైందనే ఆరోపణలు మొదలయ్యాయి. దాంతో అన్నీవర్గాల జనాలు బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ఎంఎల్ఏ షకీల్ వ్యవహార శైలిపై విరుచుకుపడటం మొదలుపెట్టారు. జనాల ధాటికి తట్టుకోలేక చివరకు షకీల్ కూడా కొంతకాలం విదేశాలకు వెళ్ళిపోయాడు.
జరిగిన ప్రమాదాన్ని, కారకులపై పోలీసులు కేసు నమోదుచేసి కోర్టులో దాఖలుచేశారు. కోర్టు ఆదేశాలతో కొంతకాలం తర్వాత షకీల్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. అయితే కొడుకు మాత్రం రాలేదు. అప్పటినుండి కోర్టులో విచారణ జరుగుతునే ఉంది. చివరకు రాహిల్ కూడా పోలీసులకు లొంగిపోవాలని హైకోర్టు గట్టిగా ఆదేశించటంతో వేరేదారిలేక చివరకు రాహిల్ దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చి పోలీసులకు ఈరోజు ఉదయం లొంగిపోయాడు.

