బీఆర్ఎస్‌లో టెన్షన్ పెంచేస్తున్న 17వ తేదీ
చార్జిషీటులో సిట్ అధికారులు ఎవరెవరి పేర్లను ప్రస్తావించబోతున్నారు ? అన్న విషయమే టెన్షన్ పెంచేస్తోంది
తెలంగాణలో సంచలనం సృష్టించిన టెలిఫోన్ ట్యాపింగ్ అంశంపై ఈనెల 15వ తేదీన సిట్ హైకోర్టులో చార్జిషీట్ దాఖలు చేయబోతోంది. ఆ చార్జిషీటులో సిట్ అధికారులు ఎవరెవరి పేర్లను ప్రస్తావించబోతున్నారు ? అన్న విషయమే టెన్షన్ పెంచేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో వేలాది ఫోన్లు అక్రమంగా ట్యాప్ అయిన విషయం తెలిసిందే. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రత్యర్ధులు, జర్నలిస్టులు చివరకు హైకోర్టు జడ్జీలతో పాటు వారి కుటుంబసభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ అయినట్లు బయటపడింది. ఇందులో భాగంగానే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనీల్ కుమార్ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా కవితే బహిరంగంగా చెప్పారు.
టెలిఫోన్ ట్యాపింగ్ పై దాదాపు రెండేళ్ళు విచారించిన సిట్ సూత్రధారి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టీ ప్రభాకరరావుతో పాటు చాలామందిని విచారించింది. ట్యాపింగుకు పాల్పడిన పోలీసు అధికారుల్లో ఐదుగురిని ఇప్పటికే సిట్ అరెస్టుచేసి విచారించింది. వారు కూడా ట్యాపింగు జరిగినట్లు కోర్టులో అంగీకరించారు. పాత్రధారులను అరెస్టు చేసిన సిట్ అధికారులు సూత్రధారి ఎవరో తేల్చేపనిలో ఉన్నారు. ప్రభాకరరావుతో ఈ విషయాన్ని చెప్పించేందుకే సిట్ అధికారులు ఇంతకాలం టైం తీసుకున్నారు.
విచారణలో ప్రభాకరరావు ఏమి అంగీకరించారో తెలీదు కాని సిట్ మాత్రం 15వ తేదీన ఛార్జిషీట్ దాఖలు చేయబోతున్నట్లు సిట్ అధిపతి, హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రకటించారు. కేసీఆర్, కేటీఆర్ నేతృత్వంలోనే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు పదేపదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దాఖలు చేయబోయే ఛార్జిషీటులో ఎవరి పేర్లు ఉంటాయనే విషయంలో తెలంగాణ రాజకీయాల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

