
కుదించుకుపోయిన బీఆర్ఎస్ ప్లీనరీ
విచిత్రం ఏమిటంటే పార్టీ ప్లీనరీని పరిమితంగా జరపటానికి కారణం మండిపోతున్న ఎండలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పటం
ప్రాంతీయపార్టీల ఆవిర్భావ దినోత్సవాలు ఎంత ఘనంగా జరుపుకుంటాయో తెలుగుదేశంపార్టీని చూస్తే తెలుస్తుంది. అలాంటి ప్రాంతీయ పార్టీనే అయిన బీఆర్ఎస్ మాత్రం పార్టీ వ్యవస్ధాపక దినోత్సవాన్ని ఈసారి కుదించేసింది. సోమవారం పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్లో పార్టీ ప్లీనరీ కేవలం పరిమిత ఆహ్వానితుల మద్యలోనే జరుపుకోతోంది. విచిత్రం ఏమిటంటే పార్టీ ప్లీనరీని పరిమితంగా జరపటానికి కారణం మండిపోతున్న ఎండలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పటం. ఈమధ్యనే జగిత్యాలలో భారీ బహిరంగసభ నిర్వహించటం, మండిపోతున్న ఎండల కారణంగా పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో కేవలం రాష్ట్ర కార్యవర్గానికి మాత్రమే ప్లీనరీని పరిమితం చేసినట్లు కేటీఆర్ వివరించారు.
రేపు జరగబోయే సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో పాటు జిల్లాల అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు మాత్రమే ప్లీనరీకి రావాలని కేటీఆర్ చెప్పారు. ఆహ్వానం ఉన్న వారు మాత్రమే ప్లీనరీకి రావాలని ఆహ్వానం లేనివారు ఎట్టి పరిస్ధితిల్లోను పార్టీ ఆఫీసుకు రావద్దని స్పష్టంగా చెప్పారు. ప్లీనరీకి ఆహ్వానం లేని వాళ్ళంతా తమ నియోజకవర్గాల్లోనే ఉండి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. పార్టీ ఆవిర్భావం దినోత్సవం సదర్భంగా ప్రతి గ్రామం, మండలం, పట్టణం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించాలని చెప్పారు. ఉదయాన్నే ఆహ్వానం ఉన్న నేతలంతా తమ ప్రాంతాల్లో జెండా పండుగ ముగించుకుని మధ్యాహ్నం 1.30 గంటలకల్లా పార్టీ ఆఫీసుకు చేరుకోవాలని సూచించారు.
జగిత్యాల బహిరంగసభ, ఎండలు పార్టీకి బాగా కలిసివచ్చినట్లు అనిపిస్తోంది. జగిత్యాల బహిరంగసభ కూడా అంతంతమాత్రంగానే జరిగింది. జగిత్యాలలో సభ నిర్వహించిన మైదానంలో మ్యాగ్జిమమ్ క్రౌడ్ 15వేలుంటుందని బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ కుమార్ చెప్పిన విషయం తెలిసిందే. 15 వేలతో నిర్వహించిన సభనే కేటీఆర్ భారీ బహిరంగసభ అని చెప్పటమే విచిత్రంగా ఉందని సంజయ్ ఎద్దేవాచేశారు. సరే, సభ నిర్వహించారు, విజయవంతమైంది కూడా. కాబట్టి వెంటనే మరో సభ నిర్వహించాలంటే పార్టీకి సాద్యంకాదు. అందులోను ఇపుడు మండిపోతున్న ఎండల్లో సభంటే జనాలు రావటం కూడా అనుమానమే.
జగిత్యాలలో కూడా బీఆర్ఎస్ సభ నిర్వహించేంత సీన్ లేదు. అయితే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తాటిపర్తి జీవన్ రెడ్డి చేరిక ప్రిస్టేజ్ అయిపోయింది కాబట్టి తప్పని పరిస్ధితుల్లో బీఆర్ఎస్ సభ నిర్వహించింది. అచ్చంగా ఇపుడు ప్లీనరీ కోసమే బహిరంగసభ అంటే కష్టమే. అందుకనే కేసీఆర్ తెలివిగా మండిపోతున్న ఎండలు అనే కారణాన్ని చూపి ప్లీనరీని పార్టీ ఆఫీసుకే పరిమితం చేసేశారు. కేవలం ఆహ్వానాలు అందుకున్న నేతలు మాత్రమే ప్లీనరీకి రావాలని చెప్పేశారు కాబట్టి సమావేశం సక్సెస్ లేదా ఫెయిల్యూర్ అన్న ప్రశ్నే ఉత్పన్నంకాదు.
కవితే టార్గెట్టా ?
రేపు జరగబోయే ప్లీనరీలో నేతలంతా కల్వకుంట్ల కవితనే టార్గెట్ చేసినా ఆశ్చర్యంలేదు. ఇంతకాలం పార్టీలోని కేటీఆర్, హరీష్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్న కవిత పార్టీ ఆవిర్భావ సభలో డైరెక్టుగా కేసీఆర్ నే టార్గెట్ చేశారు. తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ నే టార్గెట్ చేసిన తర్వాత ఇక కవితను ఉపేక్షించి లాభంలేదని పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి రేపటి ప్లీనరీలో కవితపై ఎటాక్ చేయటమే కీలకమైన ఎజెండాగా మారినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈ పని నేరుగా కేసీఆర్, కేటీఆరే చేస్తారా ? లేకపోతే ఎవరితో అయినా చేయిస్తారా అన్నది ఆసక్తిగా మారింది.

