ఇలాంటి సన్నివేశాన్ని తెలంగాణలో ఊహించగలమా ?
x
Vijay taking Aseerwadam from former CM MK Stalin

ఇలాంటి సన్నివేశాన్ని తెలంగాణలో ఊహించగలమా ?

స్టాలిన్ ఇంటికి వెళ్ళిన విజయ్ మాజీ సీఎం కాళ్ళకు దణ్ణంపెట్టి ఆశీర్వాదం తీసుకోవటం హైలైట్ గా నిలిచింది


ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ చేసిన పని జనాలను ఫిదా చేసేసింది. ఇంతకీ విజయ్ చేసిన పని ఏమిటంటే మాజీ సీఎం స్టాలిన్తో పాటు కొందరు ప్రతిపక్ష నేతల ఇళ్ళకు వెళ్ళి సహకారం అందించాలని రిక్వెస్ట్ చేయటం. స్టాలిన్ ఇంటికి వెళ్ళిన విజయ్ మాజీ సీఎం కాళ్ళకు దణ్ణంపెట్టి ఆశీర్వాదం తీసుకోవటం హైలైట్ గా నిలిచింది. ఇపుడు ఈ విషయంలోనే విజయ్ అంటే పాజిటివ్ టాక్ పెరిగిపోతోంది. ఎందుకంటే ఒకపుడు తమిళనాడు రాజకీయాలు ఎలాగుండేదో చాలామందికి తిలిసిందే. మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి-దివంగత సీఎం జే జయలలిత మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులాగుండేవి. ఒకసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే జయలలిత చీర, జాకెట్ ను చింపేయటం దేశంలో సంచలనం రేపిన విషయం అందరికీ తెలిసిందే.

తర్వాత జయలలిత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకరోజు అర్ధరాత్రి ఓ కేసులో పోలీసులు కరుణానిధి ఇంట్లోకి ధౌర్జన్యంగా వెళ్ళి భుజాలపై మోసుకుని బయటకు తీసుకొచ్చి జీపులో కుదేసి అరెస్టు చేసి తీసుకుని వెళ్ళిన ఘటన అప్పట్లో సంచలనం. అప్పట్లో తమిళనాడు రాజకీయాలు ముఖ్యంగా కరుణానిధి-జయ మధ్య అంత హాటుహాటుగా ఉండేవి. కాలక్రమంలో జయ మరణించినపుడు డీఎంకే పార్టీ ఆఫీసు ముందు పురచ్చితలైవి(జయలలితకు మారుపేరు) నిలువెత్తు కటౌట్ పెట్టించారు కరుణానిధి. జయ గొప్పదనం గురించి కరుణానిధి రాసిన మాటలు అందరినీ కదలించేశాయి. స్వతహాగానే గొప్ప రచయిత అయిన కరుణానిధి దివంగత ముఖ్యమంత్రి జయ గురించి హ్రుదయాన్ని కదిలించేలా రాస్తారని ఎవరూ ఊహించలేరు. ఆ తర్వాత కొంతకాలానికి కరుణానిధి కూడా వెళిపోయారు. ఏఐఏడీఎంకే పాలనలో డీఎంకే నేతలపై వేధింపులు ఏమీ జరగలేదు.

స్టాలిన్ సీఎం అయిన తర్వాత నుండి తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రతిపక్ష నేతల ఇళ్ళకు వెళ్ళి స్టాలిన్ సహకారాన్ని కోరారు. సభలో కాని బయటకాని ప్రతిపక్ష సభ్యులపై డీఎంకే ఎక్కడా అసభ్యంగా మాట్లాడిందిలేదు. అక్రమకేసులు, రాజకీయ వేధింపులు దాదాపు మాయమైపోయాయనే చెప్పాలి. ఫలితంగా తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయాయి. మరక మంచిదే అన్నట్లుగా మార్పు కూడా మంచిదే అని అందరు సంతోషించారు. ఇక, ప్రస్తుత విషయానికి వస్తే కొత్తగా బాధ్యతలు తీసుకున్న విజయ్ కూడా స్టాలిన్ ఇంటితో పాటు చాలామంది ఇళ్ళకు వెళ్ళాడు. స్టాలిన్ కాళ్ళకు దణ్ణంపెట్టి ఆశీర్వాదం తీసుకోవటం ముచ్చటేసింది.

ఇక్కడే తమిళనాడు వాతావరణం తెలంగాణలో కూడా కనబడుతుందా ? అనే సందేహం మొదలైంది. ఒకరి కాళ్ళకు మరొకరు దణ్ణంపెట్టడం అవసరంలేదు కాని ఒకరిని మరొకరు గౌరవించుకుంటే అదే చాలు అన్నట్లుగా ఉంది ప్రస్తుతం తెలంగాణలో పరిస్ధితి. ఇపుడు రాష్ట్రంలో పరిస్ధితి ఎలాగుందంటే ఎనుముల రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రిగా గుర్తించటంలేదు. రేవంత్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ అగ్రనేతలు కొందరు నాలుగడుగులోడని, లిల్లీపుట్ అని, పొట్టోడని, బట్టేబాజ్, ఔలాగాడు...ఇలా నోటికి వచ్చినట్లు తిడుతున్నారు. అలాగే బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి లాగులో తొండలను వదలుతానని, నిక్కర్లని ఇలా ఏవేవో మాటలంటున్నాడు. తెలంగాణలో రాజకీయం ప్రత్యర్ధులు అనేస్ధాయి దాటిపోయి శతృవులు అనుకునే స్ధాయికి చేరాయి కాబట్టే సభ్యసమాజం సిగ్గుపడేట్లుగా ఉన్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతల మధ్య వ్యవహారం చివరకు ఎక్కడికి చేరుకున్నది అంటే రేవంత్ ను ఫేస్ చేయాల్సొస్తుందని కేసీఆర్ అసెంబ్లీకే రావటం మానుకున్నారు. రేవంత్-కేసీఆరే కాదు చివరకు రేవంత్-కేటీఆర్ కూడా ఒకిరిని మరొకరు చూసుకోవటానికి కూడా ఇష్టపడటంలేదు. ఇలాంటి పరిస్థితిలో తమిళనాడు వాతావరణం ఇక్కడ ఆశించటం అత్యాసే అవుతుందేమో.

Read More
Next Story